పులుల అభయారణ్యం చుట్టూ ఎకో సెన్సిటివ్‌ జోన్‌ | Eco Sensitive Zone around the Tiger Sanctuary | Sakshi
Sakshi News home page

పులుల అభయారణ్యం చుట్టూ ఎకో సెన్సిటివ్‌ జోన్‌

Published Wed, Aug 18 2021 2:42 AM | Last Updated on Wed, Aug 18 2021 2:42 AM

Eco Sensitive Zone around the Tiger Sanctuary - Sakshi

సాక్షి, అమరావతి: నాగార్జున సాగర్, శ్రీశైలం పులుల అభయారణ్యం చుట్టూ ఉన్న వెలుపల అటవీ ప్రాంతాన్ని కేంద్ర అటవీ శాఖ పర్యావరణ సున్నిత ప్రాంతం (ఎకో సెన్సిటివ్‌ జోన్‌)గా గుర్తించింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల్ని కేంద్ర అటవీ శాఖ ఎట్టకేలకు ఆమోదించింది. కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి రవి అగర్వాల్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలో జరిగిన 47వ ఎకో సెన్సిటివ్‌ జోన్‌ నిపుణుల కమిటీ సమావేశంలో దీనిపై చర్చించి ఆమోద ముద్ర వేశారు. రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన ముఖ్య సంరక్షణాధికారి ఎన్‌.ప్రతీప్‌కుమార్‌ ఇతర అటవీ శాఖాధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

పులుల అభయారణ్యం చుట్టూ విస్తరించి ఉన్న రిజర్వ్‌ ఫారెస్ట్, మిగిలిన అటవీ ప్రాంతాన్ని 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం ఎకో సెన్సిటివ్‌ జోన్‌గా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేంద్ర అటవీ శాఖకు ప్రతిపాదనలు పంపిందని ప్రతీప్‌కుమార్‌ చెప్పారు. సాగర్, శ్రీశైలం పులుల అభయారణ్యం కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో 3,727.82 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉందని తెలిపారు. దానిచుట్టూ ఉన్న 2,149.68 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఎకో సెన్సిటివ్‌ జోన్‌గా గుర్తించాలని గతంలో ప్రతిపాదనలు పంపామన్నారు.

అభయారణ్యం బయట ఉన్న సరిహద్దు నుంచి వివిధ ప్రదేశాల్లో 0 కిలోమీటర్ల నుంచి 26 కిలోమీటర్ల దూరం వరకు ఎకో సెన్సిటివ్‌ జోన్‌గా ఉంటుందని తెలిపారు. ఈ జోన్‌ వల్ల పులులు, ఇతర వన్యప్రాణుల స్వేచ్ఛకు, మనుగడకు మరింత భద్రత ఏర్పడుతుందన్నారు. ఆ ప్రాంతంలో పర్యావరణ సమతుల్యత నెలకొని పచ్చదనం కూడా పెరుగుతుందని చెప్పారు. సేంద్రియ వ్యవసాయానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ జోన్‌ పరిధిలో వర్షపు నీటిని వివిధ పద్ధతుల్లో నిల్వ చేసుకుని జంతువులకు నీటి సమస్య లేకుండా చేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో శ్రీశైలం పులుల అభయారణ్యం సంరక్షణాధికారి వై శ్రీనివాసరెడ్డి, శివప్రసాద్, సునీత పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement