సాక్షి, అమరావతి: నాడు.. చంద్రబాబుకు ఎస్సీ, ఎస్టీలంటే అత్యంత చులకన. ‘ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా?’ అనే ఈసడింపు.. దళితులకు శుద్ధీ శుభ్రం ఉండవంటూ ఏవగింపు.
నేడు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఎస్సీ, ఎస్టీలంటే ఎంతో గౌరవం. ఎక్కడైనా ‘నా ఎస్సీలు.. నా ఎస్టీలు’ అంటూనే మాట్లాడటం మొదలెడతారు. వారి హక్కులను కాపాడటమే కాదు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వారికి సమున్నత స్థానమిస్తున్నారు. సామాజిక న్యాయంలో సరికొత్త అధ్యాయాన్ని ఆరంభించారు.
అయినా సరే... ‘ఎస్సీ, ఎస్టీలకు దగా’ అంటూ చంద్రబాబు కళ్లలో సంతోషం కోసమే కథనాలు వండే స్థాయికి దిగజారిపోయింది ‘ఈనాడు’. అసలు ఎస్సీ, ఎస్టీలకు ఎవరేం చేశారు?
2014–19 మధ్య ఐదేళ్లలో చంద్రబాబు సీఎంగా ఎస్సీల సంక్షేమానికి ఖర్చు చేసింది రూ.33,629 కోట్లు, ఎస్టీలకు రూ.12,488 కోట్లు. కానీ ఈ ప్రభుత్వ హయాంలో ఈ ఏడాది నవంబరు వరకూ... అంటే మూడున్నరేళ్లలో ఎస్సీల సంక్షేమానికి రూ.58,353.07 కోట్లు, ఎస్టీలకు 15,660.03 కోట్లు ఖర్చు చేసింది. ఇదీ ఇద్దరికీ తేడా!!.
రుణాల మంజూరు కనిపించదా రామోజీ?
– ఈ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీల స్వయం ఉపాధి, జీవనోపాధి మెరుగుదల కోసమిచ్చే రుణాలు 53 శాతం పెరిగాయి. ఇది సాక్షాత్తూ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ తాజా నివేదిక చెప్పిందే. – ‘జగనన్న తోడు’ పథకం కింద చిన్న వ్యాపారాలు చేసుకునే 9.05 లక్షల మందికి రుణాలివ్వగా... ఈ ఏడాది మూడో దశలో ఏకంగా 9 లక్షల మందికి రుణాలివ్వాలని లకి‡్ష్యంచారు. వారిలో 5.10 లక్షల మందికి ఇప్పటికే రుణాలిచ్చారు. ఈ రుణాలపై వడ్డీ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 32.51 కోట్లను బ్యాంకులకు చెల్లించింది.
ఎస్సీ, ఎస్టీలకు మూడేళ్లలో ఇచ్చిన రుణాలివీ...
ఏడాది రుణ మొత్తం (రూ.కోట్లలో)
2019–20 15,791
2020–21 18,689
2021–22 28,577
పథకాల్లో సింహభాగం...
ఎన్నికల మేనిఫెస్టోనే పవిత్ర గ్రంథంలా భావించి చిత్తశుద్ధితో అమలు చేస్తున్న ప్రభుత్వం... 2019 జూన్ నుంచి ఇప్పటివరకు రకరకాల పథకాలతో ఎస్సీ, ఎస్టీలకు గరిష్ఠ ప్రయోజనాన్ని చేకూర్చింది.
– ఎస్సీ, ఎస్టీల వివాహాలు, కులాంతర వివాహాలకు సంబంధించి ఎన్నికలకు మూడునెలల ముందు హడావుడిగా పథకాన్ని ప్రకటించిన చంద్రబాబు... ఒక్కరికైనా ఇస్తే ఒట్టు. కానీ బాబు ప్రకటించిన మొత్తాలను రెట్టింపు చేసి మరీ దీనికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి జగన్.
విద్యకు ఇంత ప్రాధాన్యం ఎన్నడైనా ఉందా?
ఎస్సీ, ఎస్టీల విద్యను పట్టించుకోవడం లేదనేది రామోజీ విషప్రచారం. చంద్రబాబు హయాంలో అమలు చేసిన విదేశీ విద్య అద్యంతం అక్రమాల పుట్టే. నకిలీ విదేశీ వర్సిటీలను చూపించి తమ వారి ఖాతాల్లోకే డబ్బులు మళ్లించేశారు. ఇది విజిలెన్స్ విచారణలోనూ వెలుగుచూసింది.
రాష్ట్ర ప్రభుత్వ సాయంతో విదేశాలకు వెళ్లేవారు రాష్ట్రానికి పేరు తెచ్చేలా... ఇక్కడి సంపదను పెంచేలా ఉండాలని భావించిన ముఖ్యమంత్రి జగన్... ప్రపంచంలోని టాప్–100 వర్సిటీల్లో సీట్లు సాధించినవారికి పూర్తి ఫీజును రీఇంబర్స్ చేస్తామని ప్రకటించారు.
టాప్–200 వర్సిటీల్లో చేరినవారికి రూ.50 లక్షల సాయం ప్రకటించారు. అంతేకాదు. నాడు–నేడు, అమ్మ ఒడి, జగనన్న విద్యాదీవెన, జగనన్న విద్యా కానుక, వసతి దీవెన వంటి అనేక పథకాల ద్వారా విద్యావకాశాలు, మౌలిక వసతులను మెరుగుపరిచింది.
► రాష్ట్రంలోని స్టడీ సర్కిల్స్ ద్వారా విశాలో సివిల్ సర్వీసెస్, విజయవాడలో గ్రూప్–1, తిరుపతిలో బ్యాంకు పోస్టులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. స్టడీ సర్కిల్స్‌లో ఈ ఏడాది ఆగస్టు వరకు 10,976 ఎస్సీ విద్యార్థుల కోసం రూ.12.75 కోట్లు ఖర్చు చేశారు.
► ఎస్సీ గురుకులాలకు టీడీపీ హయాంలో 9 ఐఐటీ, 19ఎన్‌ఐటీ, 18 ఎంబీబీఎస్ సీట్లు వస్తే... ఈ ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు 57ఐఐటీ, 101ఎన్‌ఐటీ, 40ఎంబీబీఎస్ సీట్లు సాధించారు ఎస్సీ విద్యార్థులు. దీన్నిబట్టే ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి అర్థం చేసుకోవచ్చు. అదే తీరులో గిరిజన సంక్షేమ గురు కులాలనూ ప్రోత్పసహించటంతో గతేడాది 30 మంది ఐఐటీ, 59 మంది ఎన్‌ఐటీలో ప్రవేశానికి అర్హత సాధించారు.
రాజకీయాల్లో సముచిత స్థానం...
వాడుకుని వదిలేయడానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన చంద్రబాబు హయాంలో ఎస్సీ, ఎస్టీలకు అడుగడుగునా నిర్లక్ష్యమే ఎదురైంది. సీఎం వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్టీల రాజకీయ సాధికారతలో కొత్త అధ్యాయం లిఖిస్తున్నారనటానికి కేబినెట్లో వారికిచ్చిన స్థానమే నిదర్శనం. తొలి కేబినెట్లో 56 శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీటీలను రెండవ విడతలో 70 శాతానికి తీసుకెళ్ళారు.
ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి పదవులిస్తే వారిలో నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే. పెద్దల సభ శాసన మండలి చైర్మన్‌గా కొయ్యే మోషేన్‌రాజు (ఎస్సీ), వైస్ చైర్మన్‌గా జకియాఖానం (మైనారిటీ), అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం(బీసీ)ను ఉన్నతస్థానాల్లో కూర్చొబెట్టిన ఘనత సీఎం వైఎస్ జగన్‌దే. 32 మంది వైసీపీ ఎమ్మెల్సీల్లో 18 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీటీలేనంటే... ముఖ్యమంత్రి జగన్ వారికిచ్చిన ప్రాధాన్యమేంటో తెలియకమానదు.
ప్రత్యేక కార్పొరేషన్లతో అభివృద్ధికి ఊతం...
ఎస్సీ, ఎస్టీలకు వేరువేరు కార్పొరేషన్లతో పాటు ఎస్సీ ఆర్థికాభివృద్ధి సంస్థ, గిరిజన సహకార సంస్థ వంటి ప్రత్యేక కార్పొరేషన్‌తో వారి అభివృద్ధికి ఊతమిస్తున్నారు. మాదిగలకు లిడ్‌క్యాప్ చైర్మన్, డైరెక్టర్ పోస్టులిచ్చారు.
► స్ధానిక సంస్ధల పదవుల విషయానికొస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వాటా 67 శాతం పైనే. 13 జెడ్పీ చైర్మన్ పదవుల్లో 9 ఈ వర్గాలకే. 14 నగర కార్పొరేషన్ మేయర్ పదవుల్లో 12 వీరివే. పార్టీ గెలిచిన 84 మున్సిపాల్టీలలో 58 స్ధానాలు వీరివే. 196 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లలో 117 పదవులు ఈ వర్గాలకే కేటాయించారంటే ముఖ్యమంత్రి చిత్తశుద్ధి తెలియకమానదు. ఇక ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 ఛైర్మన్ పదవులలో 79... 484 నామినేటెడ్ డైరెక్టర్ పదవుల్లో 280 ఈ వర్గాలకే కేటాయించారు.
► ఇవి మాత్రమే కాదు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దాదాపు 1.30 లక్షల శాశ్వత ఉద్యోగాలు, 2.60 లక్షల వాలంటీర్లలో 84 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే!.
► విజయవాడ నడిబొడ్డున అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి... వేగంగా నిర్మాణ పనులు చేయిస్తున్నారు. 125 అడుగుల ఎతైన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్మృతి వనానికి ప్రభుత్వం రూ.268.48కోట్లు ఖర్చు చేస్తోంది.
గిరి జనానికి అండాదండ
వివిధ పథకాల్లో ఎస్టీలకు సముచిత వాటా ఇవ్వటంతో పాటు... వారికి భూమి హక్కు(ఆర్వోఎఫ్‌ఆర్, డీకేటీ పట్టాలు) కల్పించడంలో ఈ ప్రభుత్వానికి ఎవ్వరూ సాటిరారనే చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రంలో గత 12 ఏళ్లలో 2.34 లక్షల ఎకరాలను పట్టాలుగా ఇవ్వగా.. ఈ ప్రభుత్వం మూడున్నరేళ్లలో ఏకంగా 2.48,887లక్షల ఎకరాలను పంచి రికార్డు సృష్టించింది.
► ప్రత్యేక గిరిజన విశ్వవిద్యాలయం, వైద్య కళాశాల, ఇంజనీరింగ్ కాలేజీ, సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీలతో ఎస్టీలకు సాంకేతిక, వైద్య విద్యను అందుబాటులోకి తేవడంతో పాటు అరకు కాఫీ, నల్లమల నన్నారి వంటి గిరిజన ఉత్పత్తులకు బ్రాండ్ ఇమేజ్‌ను కల్పించి ప్రోత్సహిస్తున్నారు. వీటన్నిటినీ మరుగున పరుస్తూ... చంద్రబాబు కాలమే స్వర్ణయుగమనే ‘ఈనాడు’ రాతలు ఇంకెన్నాళ్లు?
Fact Check: అబద్ధాలు చెప్పటమే అసలు దగా! దిగజారిపోయిన ‘ఈనాడు’
Published Mon, Dec 19 2022 4:07 AM | Last Updated on Mon, Dec 19 2022 10:28 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment