సాక్షి, అమరావతి: రాష్ట్ర రైతాంగానికి ఈ ప్రభుత్వమిస్తున్నంతటి భరోసా గతంలో ఏ ప్రభుత్వమూ ఇవ్వలేదనేది నిస్సందేహం. మరే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంతటి చిత్తశుద్ధితో రైతాంగానికి మేలు చేయటం లేదనేది కూడా వాస్తవం. అందుకే విత్తనాలు ఇవ్వటం నుంచి పండించిన పంటను విక్రయించుకునే దాకా రైతుకు సహాయంగా ఉంటూ చేయి పట్టి నడిపిస్తున్నారు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి. కాకపోతే ఈ బృహత్ యజ్ఞాన్ని ‘ఈనాడు’ ఏనాడూ ప్రశంసించలేదు. పైపెచ్చు ప్రతి పనిలోనూ రంధ్రాన్వేషణే పనిగా పెట్టుకుంది.
ప్రతి ఏటా రూ.12,500 చొప్పున రూ.50 వేల సాయం చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి... అధికారంలోకి వచ్చాక ఆ హామీకన్నా మిన్నగా రైతు సంక్షేమానికి నడుం బిగించారు ముఖ్యమంత్రి. అందుకే మరో వెయ్యి అదనంగా జోడించి ఏడాదికి రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500 ఇవ్వటానికి సంకల్పించారు. దాన్ని ఆచరణలో చేసి చూపిస్తున్నారు. ఏటా సగటున 52.38 లక్షల మంది రైతుల చొప్పున గడిచిన మూడేళ్లలో రూ.25,971.33 కోట్ల సాయాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. దీన్ని కూడా ఏనాడూ సానుకూలంగాంశంగా ప్రస్తావించని ‘ఈనాడు’... ‘రైతు భరోసాపై ఎన్ని మడతలో’... అంటూ చిత్రవిచిత్రమైన రాతలకు దిగటమే అసలైన దుర్మార్గం.
50 వేలిస్తామని చెప్పి రూ.67,500 చొప్పున ఇస్తుంటే... కోత పెట్టారని రాశారంటే రామోజీని ఏమనుకోవాలి? 42 శాతం నిధులను పిఎం కిసాన్ కింద కేంద్రమే ఇస్తోందంటే... అవి బడ్జెట్ ద్వారా రాష్ట్రానికిచ్చే నిధులే కదా? రాష్ట్రాల నుంచి పన్నుల ద్వారా సమీకరించిన మొత్తాన్ని బడ్జెట్ ద్వారా, పన్నుల్లో వాటాగా కేంద్రం రాష్ట్రాలకిస్తే... రాష్ట్రాలు వాటిని ప్రాధాన్యాల వారీగా ఖర్చుచేస్తాయి.
ఈ మాత్రానికి కేంద్రమంటే ఏదో విదేశాల నుంచి తెస్తున్నట్టు ఎందుకీ దుర్మార్గపు రాతలు రామోజీరావు గారూ? రైతుకు ఇస్తామని చెప్పిన మొత్తం కన్నా దాదాపు 35 శాతం అధికంగా చెల్లిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ ఒక్క అక్షరం ముక్క కూడా రాయని మీరు... లేనిపోని అవాస్తవాలతో జనాన్ని తప్పుదోవ పట్టించేలా రాయటం భావ్యమా?
చంద్రబాబు ఏం చేసినా రైటేనా?
2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు బేషరతుగా రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి... అన్నదాతల ఓట్లతో అధికారంలోకి వచ్చారు. కానీ ఆ తరవాత రుణమాఫీని పూరి్తగా అటకెక్కించేసినా ‘ఈనాడు’ ఏనాడూ ఒక్క అక్షరం కూడా రాయలేదెందుకు? అన్నదాతలను నమ్మించి మోసం చేయటం కరెక్టా? గద్దెనెక్కగానే రూ.87,612 కోట్ల రుణాలను మాఫీ చేస్తానని నమ్మించి... చివరకు రకరకాల ఆంక్షలతో కేవలం రూ.15వేల కోట్లతో రుణమాఫీ చేసేసినట్లుగా చెబితే... అది తప్పని, రైతులను మోసం చేయటమేనని ఎందుకు అడగలేదు? 2019లో ఎన్నికలు సమీపిస్తున్నాయనగా... ‘అన్నదాత సుఖీభవ’ పేరిట ఏటా రైతులకు రూ.15వేలు చొప్పున పెట్టుబడి సాయం అందిస్తానని చంద్రబాబు చెప్పినప్పుడు... అధికారంలో ఉన్నన్నాళ్లూ ఎందుకు చేయలేదని నిలదీయలేదేం? ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా... రూ.15 వేలు ఇస్తానని చెప్పి కూడా ఎన్నికలకు మూడు నెలల ముందు రైతులకు కేవలం రూ.4 వేలు చేతిలో పెట్టి, కౌలురైతులకు పూర్తిగా మొండి చెయ్యి చూపించినపుడు మీ పత్రిక ఏమైపోయింది? చంద్రబాబు ఇచ్చిన రూ.4వేలలో కూడా రూ.2వేలు కేంద్రానివే కదా? మరి అప్పుడేమైపోయింది మీ పాత్రికేయం? మరి ఇప్పుడెందుకీ మడతపేచీ రాతలు?
అన్నదాత సుఖీభవతో పోల్చి చూడొచ్చుగా?
సీఎం వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తూ రైతుల కష్టాలను చూసి... తాను గెలిస్తే ఏటా రూ.12,500 చొప్పున ప్రతి రైతు కుటుంబానికి ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీని చూసిన చంద్రబాబు... రైతుల ఓట్లు దక్కవేమోనన్న భయంతో ఎన్నికలకు 3 నెలల ముందు ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని ప్రకటించారు. ప్రతి రైతు కుటుంబానికీ రూ.15వేల పెట్టుబడి సాయం అందిస్తానంటూ 2019 ఫిబ్రవరి 17న జీవో–28ని జారీ చేశారు. జీవో ఇచ్చినా డబ్బులు మాత్రం ఇవ్వలేదు.
దాన్ని పీఎం కిసాన్ సాయంతో ముడిపెట్టి తొలుత రూ.1000, ఎన్నికలకు నెల రోజుల ముందు రూ.3వేల చొప్పున జమ చేసి చేతులు దులుపుకున్నారు. ఇలా చెల్లించిన సొమ్ములో రూ.675 కోట్లు పీఎం కిసాన్ కింద కేంద్రం జమ చేసినవే కదా? మరి అప్పుడెందుకు ప్రశ్నించలేదు రామోజీరావు గారూ? బాబు మాదిరిగా భూ విస్తీర్ణంతో ముడిపెట్టకుండా... చివరికి 5 సెంట్ల భూమి ఉన్న రైతుకూ రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న ప్రభుత్వాన్ని విమర్శించటం ఏ తరహా పాత్రికేయం?
కౌలురైతులకూ పెట్టుబడి సాయం
ఇక సొంత భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతులకే కాదు... అటవీ (ఆర్వోఎఫ్‌ఆర్), దేవదాయ సాగుదారులకూ పీఎం కిసాన్‌తో సంబంధం లేకుండా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. నాడు కౌలురైతులకు కాదు కదా అటవీ, దేవదాయ భూ సాగుదారులకూ పైసా కూడా విదల్చలేదు చంద్రబాబు. కానీ గత మూడున్నరేళ్లలో 3,71,732 మంది కౌలుదారులు, 3,07,866 మంది అటవీ, దేవదాయ భూ సాగుదారులకు రూ.892.45 కోట్ల పెట్టుబడి సాయాన్ని అందించిందీ ప్రభుత్వం.
Comments
Please login to add a commentAdd a comment