Employee Union Leaders Meet CM Jagan At Tadepalli - Sakshi
Sakshi News home page

ఉద్యోగులు బాగుండాలి.. చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం: సీఎం జగన్‌

Published Tue, Jun 13 2023 12:57 PM | Last Updated on Tue, Jun 13 2023 3:31 PM

Employees Union Meets CM Jagan At Tadepalli - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో పలు విభాగాలకు చెందిన ఉద్యోగ సంఘాలు సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. ఉద్యోగులకు సంబంధించిన అంశాల్లో కేబినెట్‌ నిర్ణయాలు, జీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఉద్యోగులు సంతోషంగా ఉంటేనే డెలివరీ మెకానిజం బాగుంటుందని, ప్రజలు సంతోషంగా ఉంటారని పేర్కొన్నారు. ఉద్యోగుల్ని సంతోషంగా ఉంచడానికి ప్రతి కార్యక్రమం మనసా, వాచా కర్మేణా చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

తన మనసు ఎప్పుడూ ఉద్యోగులకు మంచి చేయడం కోసమే ఉంటుందని.. రాజకీయ కారణాలతో ఎవరైనా ఏదైనా చెప్పినా వాటిని విశ్వసించనవసరం లేదని సూచించారు. ఉద్యోగులు బాగుండాలని చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నామన్నారు. తొలిసారి ప్రభుత్వం సమస్యలను సమస్యలుగా వదిలేయకుండా.. ప్రతి సమస్యకూ ఒక పరిష్కారం చూపించాలని ప్రయత్నిస్తున్నామని చెప్పారు. దాని వల్ల ఉద్యోగులకూ, రాష్ట్ర ప్రభుత్వానికీ మంచి జరగాలని ఆలోచన చేశామన్నారు. జీపీఎస్‌ కోసం రెండు సంవత్సరాలు కసరత్తు చేశామని సీఎం జగన్‌  వివరించారు.

‘ఉభయ ప్రయోజకరంగా ఉండే విధంగా జీపీఎస్‌ను రూపొందించాం. 2003లో ప్రభుత్వాలు ఇది అయ్యేపని కాదని చేతులు ఎత్తేశాయి. ఆ పరిస్థితి కూడా రాకూడదు, ఉద్యోగులు రోడ్డుమీదకు రాకూడనే ఉద్దేశ్యంతో ఎంతో ఆలోచన చేశాం. మీరు ఈ రోజు తీసుకుంటున్న జీతం బేసిక్‌లో కనీసం 50 శాతం పెన్షన్‌గా వచ్చేలా ఏర్పాటు చేశాం. ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణలోకి తీసుకుని డీఆర్‌లు జీపీఎస్‌లో ఇస్తున్నాం. రిటైర్ అయిన ఉద్యోగుల జీవన ప్రమాణాలు స్ధిరంగా మెయింటైన్‌ కావడానికి తగినట్టుగా గ్యారంటీ పెన్షన్‌ స్కీంను తీసుకువచ్చాం. 1.35 లక్షల మంది సచివాలయ ఉద్యోగులను నియమించాం.

వీళ్లందరూ భవిష్యత్తులో జగన్‌ నాకు మంచి చేశాడన్న మాట రావాలే తప్ప.. మరో మాట రాకూడదని, ఉద్యోగులకు మంచి జరగాలని చేశాం. ఇంత సిన్సియర్‌గా ఒక పరిష్కారం వెదికిన పరిస్ధితి రాష్ట్రంలో గతంలో ఏ ప్రభుత్వమూ చేయలేదు. భవిష్యత్‌లో జీపీఎస్‌ అనేది దేశానికే రోల్‌ మోడల్‌ అవుతుంది. ఈ పథకం ఉద్యోగులకు మేలు చేస్తుంది. మీకు అన్ని రకాలుగా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఈ ప్రభుత్వం మీది. మిమ్నల్ని పూర్తిగా భాగస్వామ్యులు చేసుకున్నాం. మీ మొహంలో చిరునవ్వు ఉంటేనే మీరు బాగా చేయగలుగుతారు. ప్రజలు సంతోషంగా ఉంటారు. రిటైర్‌ అయిన ఉద్యోగుల జీవన ప్రమాణాలను కాపాడినట్టు అవుతుంది’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

అదే విధంగా ఉద్యోగులకు సంబంధించి కేబినెట్‌ నిర్ణయాలన్నీ కూడా 60 రోజుల్లోగా అమల్లోకి రావాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు.  ఎక్కడా జాప్యం లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, డైలీ వేజెస్‌ కేటగిరీ ఉద్యోగులను కూడా ఆప్కాస్‌ పరిధిలోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు.
చదవండి: అమిత్ షా, జేపీ నడ్డా మాటల్లో నిజమెంత?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement