కూటమి ప్రభుత్వంలో చెలరేగిన టీడీపీ వర్గీయులు
భూ ఆక్రమణలు, దౌర్జన్యాలతో రెచ్చిపోతున్న వైనం
ఆలయ భూములనూ వదలని అక్రమార్కులు
ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో ఇదీ సంగతి!
కామవరపుకోట: కూటమి ప్రభుత్వం రాగానే ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో మొదలైన టీడీపీ నేతల అరాచకాలు, భూ కబ్జాలకు అడ్డూఅదుపు కనిపించడంలేదు. అధికారులను కూడా బెదిరిస్తూ యథేచ్ఛగా అక్రమాలు కొనసాగిస్తున్నారు. దేవుడి భూములను సైతం చెరబడుతున్నారు. గతంలో ఎవరూ ఇంతగా బరితెగించేవారు కాదని ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఇలాంటి కబ్జాలను అరికట్టడానికే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారని, కానీ టీడీపీ నాయకులు దానిపై తప్పుడు ప్రచారం చేసి ఇప్పుడిలా అక్రమాలకు పాల్పడుతున్నారని పేర్కొంటున్నారు. ఇటీవల తెలుగుదేశం నేతలు పాల్పడిన భూ అక్రమాల్లో కొన్ని..
» జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరు వెళ్లే ప్రధాన రహదారి వెంబడి కొత్తూరు చెక్‌పోస్ట్ సెంటర్‌లో శ్రీవీరభద్రస్వామి ఆలయానికి సంబంధించి సర్వే నంబర్ 702/4లో 97 సెంట్ల భూమి ఉంది. దానివిలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.10 కోట్లకుపైనే.
ఆ స్థలంలో 1,950 గజాలను 2021లో స్థానికుడైన వందనపు లక్ష్మణరావుకు.. ఏడాదికి రూ.11.40 లక్షలు చెల్లించే విధంగా 11 సంవత్సరాలకు దేవదాయశాఖ లీజుకు ఇచ్చింది. ఆ స్థలంలో షాపులు నిర్మించి అద్దెకిస్తున్న ఆయన కూటమి ప్రభుత్వం రాగానే మిగిలిన భూమిని కూడా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. అంతకుముందు లీజును కూడా అధికారులు నామమాత్రపు ధరకు తగ్గించినట్లు తెలిసింది.
» ఈ ఆలయ భూమిలోనే కామవరపుకోట మండలం వెంకటాపురానికి చెందిన శ్రీనివాసరావు తెలుగుదేశం అండదండలతో కారు సర్వీసింగ్ సెంటర్ కోసం భారీ షెడ్డు నిర్మించాడు. భూమి కబ్జాచేసి షెడ్డు వేసినా దేవదాయశాఖ అధికారులు స్పందించలేదు.
» కామవరపుకోట మండలం కొత్తూరు సమీపంలోగల రాఫిన్ రియల్ ఎస్టేట్ ఎదురుగా జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరు ప్రధాన రహదారిని అనుకుని సర్వే నంబరు 390/1లో 5.70 ఎకరాల భూమి ఉంది. ఇది గతంలో భూదాన కార్యక్రమంలో భాగంగా కొత్తూరు గ్రామానికి చెందిన మేడంకి అర్జయ్యకు ప్రభుత్వం ఇచ్చింది. అతడికి భార్య సుశీల, కుమారుడు రవీంద్ర, కుమార్తె ఉన్నారు.
అర్జయ్య మృతిచెందడంతో ఆ భూమిని తన పేరిట మార్చుకున్న సుశీల.. 2019లో కుమారుడు రవీంద్ర పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించింది. 2020లో రవీంద్ర అనారోగ్యంతో మృతిచెందాడు. కూటమి అధికారంలోకి రాగానే.. రూ.10 కోట్ల విలువైన ఆ భూమిని కబ్జా చేయాలని కామవరపుకోటకు చెందిన ఓ డాక్యుమెంట్ రైటర్ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఒక మహిళను అడ్డుపెట్టుకుని ఆ భూమిని బొర్రంపాలెం గ్రామానికి చెందిన ఒక భూస్వామికి అమ్మడానికి ప్రయత్నిస్తున్నాడని సుశీల ఆరోపిస్తోంది.
» టీడీపీ నాయకుడు, చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, ఆయన సోదరుడు, అనుచరులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఏలూరుకు చెందిన ఈడుపుగంటి హరిభగవాన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆవేదన వ్యక్తం చేశారు. టి.నరసాపురం మండలం బొర్రంపాలెం నుంచి కామవరపుకోట వెళ్లే రోడ్డు వెంబడి 15 ఎకరాల పామాయిల్ తోటను హరిభగవాన్ బ్యాంకు ఆన్‌లైన్ వేలంలో రూ.3.70 కోట్లకు పాడుకున్నారు. తను ఆ భూమిలోకి వెళ్లకుండా గంటా మురళి, ఆయన సోదరుడు, అనుచరులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని హరిభగవాన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
» కొయ్యలగూడెం మండలం రాజవరం గ్రామానికి చెందిన దళితుడైన బిరుదుగట్ల కృష్ణమూర్తికి జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురం రెవెన్యూ పరిధిలో 597/3లో 2.10 ఎకరాల భూమి ఉంది. దాన్లో పామాయిల్ సాగు చేస్తున్నాడు. ఆ భూమిని కబ్జా చేసేందుకు యర్రంపేటకు చెందిన తెలుగుదేశం వర్గీయుడు చెరుకూరి సత్యజానకి నరసింహారావు ప్రయత్నిస్తున్నాడు. కృష్ణమూరి్తని పొలంలోకి వెళ్లకుండా అడ్డుకుని దౌర్జన్యం చేశాడు. కృష్ణమూర్తి అధికారుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా, మానసికంగా నలిగిపోతున్నాడు.
ఆలయ భూములను పరిరక్షించాలి
కూటమి ప్రభుత్వం రాగానే టీడీపీ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పేదల భూములను కబ్జా చేసేందుకు తెగబడుతున్నారు. దేవాలయ భూములను సైతం ఆక్రమించేందుకు తెరతీశారు. ప్రభుత్వం స్పందించి బాధితులకు న్యాయం చేసి, వారికి రక్షణ కల్పించడంతో పాటు కబ్జాదారుల నుంచి ఆలయ భూములను పరిరక్షించాలి. – కంభం విజయరాజు, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కన్వీనర్, చింతలపూడి
రక్షణ కల్పించండి
బ్యాంకు వేలంలో భూమిని ఆన్‌లైన్‌లో కోర్టు ద్వారా డబ్బులు చెల్లించి కొనుగోలు చేశాను. స్థానిక టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, ఆయన సోదరుడు, అనుచరులు నాపై దౌర్జన్యం చేసి, భూమిని ఆక్రమించేందుకుప్రయత్నిస్తున్నారు. వారినుంచి నాకు రక్షణ కల్పించండి. – ఈడుపుగంటి హరిభగవాన్, చైత్ర హాస్పిటల్ యజమాని, ఏలూరు
న్యాయం చేయండి
మా తాతల నుంచి నాకు సంక్రమించిన భూమిలో పామాయిల్ సాగుచేస్తున్నాను. టీడీపీ నాయకుడు చిలుకూరి సత్యజానకి నరసింహారావు దళితుడినైన నాపై దౌర్జన్యం చేసి నా పొలం ఆక్రమించాడు. దీనిపై అధికారుల చుట్టూ తిరుగుతున్నా వారు పట్టించుకోవడం లేదు. నరసింహారావు నుంచి నాకు రక్షణ కల్పించి, న్యాయం చేయండి. – బిరుదుగడ్ల కృష్ణమూర్తి, రాజవరం
Comments
Please login to add a commentAdd a comment