పెద్దపప్పూరు: విధులను సక్రమంగా నిర్వర్తించాల్చిన ఓ అధికారి తన బాధ్యతలను మరచిపోయారు. గత ప్రభుత్వంలో హవా చెలాయించిన నేతకు భయపడో.. లేక తనకు సన్నిహితులనో తాను చేయాల్సిన పనిని పక్కన పెట్టేశారు. వివరాల్లోకెళితే... పెద్దపప్పూరు మండలం చిన్నపప్పూరులో వెలసిన పప్పూరుమ్మ అమ్మవారి గుడికి సంబంధించిన 18.30 ఎకరాలు ఉంది. 2018లో జేసీ దివాకర్‌రెడ్డి అగ్రికల్చరల్ కళాశాల నిర్వహణ కోసం అనంతపురం మాజీ ఎంపీ జేసి దివాకర్‌రెడ్డి తనకు పప్పూరమ్మ మాన్యంలో 10 ఎకరాలు కౌలుకు కావాలని, ఎకరానికి రూ.9,000 చొప్పున దేవాదాయశాఖ అధికారులతో అనుమతి పొందారు. అయితే 18.30 ఎకరాల భూమిని సాగుచేసుకుంటూ ..
కేవలం 10 ఎకరాలకు మాత్రమే అదీ 2018–2019కి గాను కౌలు చెల్లించిన విషయాన్ని ఈనెల 19న ‘సాక్షి’లో ‘దేవుడి సొమ్ముకాజేసి’ అనే కథనం ప్రచురితమైంది. దీంతో అదే రోజే పప్పూరుమ్మ మాన్యం కౌలు డబ్బులకు సంబంధించి గ్రూప్ టెంపుల్ ఈఓ దుర్గాప్రసాద్ తక్షణమే జేసి దివాకర్‌రెడ్డి అగ్రికల్చరల్ కళాశాల యాజమాన్యానికి నోటీసుల జారీ చేసి కౌలు డబ్బులు రాబడతామని చెప్పారు. అయితే ఇది జరిగి దాదాపు పది రోజులవుతున్నా దానిపై దృష్టిసారించలేదు. విశ్వసనీయ సమాచారం మేరకు జేసీ వర్గీయులకు ఈఓకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న విమర్శలున్నాయి. ఇదే విషయమై అనంతపురం దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ రామాంజనేయులును ‘సాక్షి’ ఫోన్ ద్వారా వివరణ కోరగా పప్పూరుమ్మ మాన్యానికి సంబంధించి కౌలు డబ్బులు వసూలు చేయమని గ్రూప్ టెంపుల్ ఈఓకు తెలియజేశానని, దీనిపై తక్షణ చర్యలు చేపడతామని సమాధానమిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment