![Establishment Of Electronic Control Units On Highways In AP - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/5/Highways.jpg.webp?itok=VQMXPkHz)
సాక్షి, అమరావతి: జాతీయ రహదారులపై అతి వేగంతో దూసుకెళ్లే వాహనాలకు ఇకపై బ్రేకులు పడనున్నాయి. నిర్దేశించిన వేగ పరిమితిని దాటితే భారీ జరిమానాలు విధించేందుకు రాష్ట్ర రవాణా, పోలీస్ శాఖలు సమాయత్తమవుతున్నాయి. ఇందుకోసం హైవేలపై టోల్ ప్లాజాల్లో ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. తద్వారా ఎంత వేగంతో వాహనం ప్రయాణిస్తుందో తెలుసుకోనున్నారు. జాతీయ రహదారులపై ప్రమాదాల శాతాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్లు ఏర్పాటు చేయాలని పోలీసులు రహదారి భద్రత కమిటీ దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో రహదారి భద్రత నిధి నుంచి రూ.6 కోట్లతో ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్లను కొనుగోలు చేయాలని రవాణా శాఖ నిర్ణయించింది. ఇందుకోసం పోలీస్ శాఖ నుంచి ఓ అధికారిని నామినేట్ చేయాలని కోరింది. హైవేలపై నిర్దేశించిన వేగానికి అనుగుణంగానే ఇకపై వాహనాలను నడపాల్సి ఉంటుంది. ఇప్పటివరకు హైవేలపై గంటకు 80 కి.మీ. వేగంతో కార్లు వెళ్లేందుకు అనుమతి ఉండగా, దాన్ని 100 కి.మీ.కు. ద్విచక్ర వాహనాలకు 60 కి.మీ. నుంచి 80 కి.మీ.కు పెంచే ప్రతిపాదనకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ గతంలోనే ఆమోదం తెలిపింది. బస్సులు, లారీలు కూడా గంటకు 80 కి.మీ. వేగంలోపే ప్రయాణించాల్సి ఉంటుంది. హైవేలపై ఆటోలు ప్రయాణించడానికి వీల్లేదు. అయినా కొన్నిచోట్ల ఆటోలు హైవేలపై ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురవుతున్నాయి.
ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ల ద్వారా వేగ నిర్ధారణ
హైవేలపై వాహనాలు ఎంత వేగంతో వెళుతున్నాయో ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్లు అంచనా వేస్తాయి. ఒక టోల్‌ప్లాజా నుంచి మరో టోల్‌ప్లాజాకు ఎంత సమయంలో చేరుతున్నాయో శాస్త్రీయంగా అంచనా వేసేందుకు ఈ యూనిట్లు ఉపయోగపడతాయి. దీన్నిబట్టి అతివేగానికి భారీ జరిమానాలు విధించనున్నారు. తొలుత ఎన్‌హెచ్–16 (చెన్నై–కోల్‌కతా), ఎన్‌హెచ్–65 (విజయవాడ–హైదరాబాద్) మధ్య ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు.
రహదారి భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేందుకే..
రహదారి భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని దీనిపై ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీ పలుమార్లు హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలో జాతీయ రహదారులపై 38 శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని రవాణా శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ–విశాఖ (ఎన్‌హెచ్–16), విజయవాడ–హైదరాబాద్ (ఎన్‌హెచ్–65) మధ్య హైవేలపై ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని అంచనా. గతేడాది రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు మొత్తం 17,910 జరిగితే 7,059 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో విజయవాడ–విశాఖ మధ్య 6,843 రోడ్డు ప్రమాదాల్లో 1,866 మంది, విజయవాడ–హైదరాబాద్ మధ్య 4,589 రోడ్డు ప్రమాదాల్లో 1,235 మంది మృతి చెందారు. అతివేగమే రోడ్డు ప్రమాదాలకు కారణమంటున్న రవాణా శాఖ ఇక వేగ నిరోధానికి పటిష్ట చర్యలు చేపట్టనుంది. స్పీడ్ గన్లు, టోల్‌ప్లాజాల్లో బ్రీత్ అనలైజర్లతో తనిఖీలు చేసి వాహనదారులపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment