
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. మంగళగిరిలోని వైద్య శాఖ ప్రధాన కార్యాలయంలో వైద్య కళాశాలలపై మంత్రి రజిని ఉన్నతాధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, నంద్యాల, విజయనగరంలలో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రారంభించాలనే దృఢ నిశ్చయంతో ప్రభుత్వం ముందుకెళుతోందన్నారు.
ఈ క్రమంలో జాతీయ వైద్య మండలి నిబంధనల మేరకు ఐదు కళాశాలల్లో కావాల్సిన అన్ని వసతులను వచ్చే నెలాఖరులోగా సమకూర్చుకోవాలని ఆదేశించారు. క్లినికల్, నాన్–క్లినికల్ వైద్యులు, ఇతర సిబ్బంది నియామకాలపై దృష్టి సారించాలన్నారు. సివిల్ పనులన్నీ వచ్చే మార్చిలోగా పూర్తి చేయాలని ఏపీఎంఎస్‌ఐడీసీ అధికారులకు సూచించారు. ఇకపై రోజూ ఈ ఐదు కళాశాలలపై పర్యవేక్షణ ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు.
నూతన కళాశాలలకు సంబంధించి లైబ్రరీల నిర్మాణం, వాటికి కావాల్సిన ఫర్నిచర్, పుస్తకాలు, ఇతర పరికరాల కొనుగోలు ఇలా ప్రతి అంశంపై దృష్టి సారించాలన్నారు. వైద్య కళాశాలల్లో పీజీ సీట్లను రాబట్టడంలో ప్రభుత్వం విజయం సాధించిందని మంత్రి రజిని తెలిపారు. 2019లో రాష్ట్రంలో మొత్తం 911 పీజీ సీట్లుండేవని, ఇప్పుడు ఈ సీట్ల సంఖ్య ఏకంగా 1,249కు పెంచుకోగలిగామన్నారు. ఈ ఏడాది కూడా మరో 637 సీట్ల పెంపుదలకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. ఆ ప్రయత్నంలో ఇప్పటి వరకు 90 సీట్లను అదనంగా సాధించగలిగామన్నారు. ఈ ఏడాది మొత్తం మీద కనీసం 500 పీజీ సీట్లను అదనంగా సాధించేలా ముందుకు సాగుతున్నామని మంత్రి రజిని వివరించారు. సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, డీఎంఈ డాక్టర్ వినోద్‌కుమార్‌లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment