నూతన వైద్య కళాశాలల నిర్మాణానికి సహకరించండి | AP Minister Vidadala Rajini Meets Health Minister Mandaviya | Sakshi
Sakshi News home page

నూతన వైద్య కళాశాలల నిర్మాణానికి సహకరించండి

Published Tue, Dec 6 2022 8:39 AM | Last Updated on Tue, Dec 6 2022 9:20 AM

AP Minister Vidadala Rajini Meets Health Minister Mandaviya - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా నిర్మిస్తున్న మెడికల్‌ కళాశాలలకు కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా కావాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ మాన్సూక్‌ మాండవీయను కోరారు. న్యూఢిల్లీలో బుధవారం కేంద్ర మంత్రితో భేటీ అయ్యి ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి రజిని మాట్లాడుతూ పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్లలో మెడికల్‌ కళాశాలల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులొచ్చాయని, నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు.

ప్రతి జిల్లాలోనూ కనీసం ఒక ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ఉండేలా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని, ఇప్పటికే అన్ని చోట్లా మెడికల్‌ కళాశాలల నిర్మాణం ప్రారంభమైందన్నారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న 17 మెడికల్‌ కళాశాలలకు కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలని, తగిన ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. వైద్య ఆరోగ్య రంగంలో ఏపీలో కీలకమైన మార్పులు తీసుకొస్తున్నట్టు చెప్పారు.

ఫ్యామిలీ డాక్టర్‌ వైద్య విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నామని తెలిపారు. వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ల గురించి కేంద్ర మంత్రికి రజిని వివరించారు. ఎక్కడా కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా 46 వేల నియామకాలను ఒక్క వైద్య, ఆరోగ్య రంగంలోనే సీఎం జగన్‌ చేపట్టారని వివరించారు. ఏకంగా రూ.16 వేల కోట్లకు పైగా నిధులతో రాష్ట్రంలోని ఆస్పత్రుల స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తున్నారని వివరించారు. ఇదిలా ఉండగా, మంత్రి రజిని వినతిపై కేంద్రమంత్రి మాండవీయ సానుకూలంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో వైద్య ఆరోగ్య రంగంలో తీసుకొస్తున్న మార్పులు తమ దృష్టిలోనూ ఉన్నాయన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు తమ వంతు సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఏపీలో వైద్య కళాశాలల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని చెప్పారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement