అమలాపురం: ఆంధ్రా నుంచి కొబ్బరి దిగుమతి చేసుకునేందుకు యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలైన యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే), బెల్జియం, నెదర్లాండ్స్, స్పెయిన్, జర్మనీ ఆసక్తి చూపుతున్నాయి. మన రాష్ట్రంలోని కొబ్బరి రైతులు, ఎగుమతిదారులతో చర్చలు జరిపేందుకు యూరోపియన్ వ్యాపారులు సిద్ధమయ్యారు. విశాఖ కేంద్రంగా డిసెంబర్‌లో ఓ సదస్సు నిర్వహించనున్నారు. అన్నీ అనుకూలిస్తే.. మన రాష్ట్రం నుంచి కొబ్బరితోపాటు కోకో, అరటి, మిరియాల ఎగుమతులకూ మార్గం సుగమం కానుంది.
కొబ్బరి ముక్క, నీరు, నూనె, కొబ్బరి పాలు, ఇతర ఉత్పత్తులు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఈ కారణంగా యూరప్ వాసుల ఆహారంలో కొబ్బరి వినియోగం పెరుగుతోంది. ఇప్పటికే మలేషియా, థాయ్‌లాండ్, మన దేశంలోని కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచి యూరప్‌కు కొబ్బరి ఎగుమతి అవుతోంది. అవసరాలకు తగినట్టు దిగుమతులు లేకపోవడంతో ఆంధ్రా నుంచి కూడా దిగుమతి చేసుకోవాలని అక్కడి వ్యాపారులు నిర్ణయించారు.
డిసెంబర్‌లో సదస్సు
యూరోపియన్ దేశాలకు చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ(ఎన్జీవో)తో పాటు కొందరు దిగుమతిదారులు మన రాష్ట్రంలోని కొబ్బరి వ్యాపారులు, రైతులతో ఇప్పటికే ఓ దఫా చర్చలు జరిపారు. గడచిన సెప్టెంబర్‌లోనే ఇక్కడి రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, వ్యాపారులతో యూరోపియన్ యూనియన్ దిగుమతిదారులు సదస్సు నిర్వహించాలని యోచించారు. కానీ.. కరోనా ఉధృతి వల్ల వాయిదా పడింది. వచ్చే డిసెంబర్‌లో ఈ సదస్సు నిర్వహించనున్నారు. చర్చలు ఫలించి కొబ్బరి ఎగుమతులు ప్రారంభమైతే అరటి, కోకో, మిరియం వంటి ఎగుమతులు కూడా పెరుగుతాయి. కాగా, తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లికి చెందిన ఆదర్శ కొబ్బరి రైతు విళ్ల దొరబాబును యూరోపియన్ యూనియన్ దిగుమతిదారులు ఏపీలో తమ ప్రతినిధిగా ఎంపిక చేసుకున్నారు.
నారికేళం.. యూరప్ పయనం!
Published Mon, Oct 5 2020 4:14 AM | Last Updated on Mon, Oct 5 2020 4:14 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment