పీహెచ్‌సీల్లో స్పెషలిస్ట్ క్లినిక్‌లకు ఉద్వాసన
గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం కోసం 152 మంది స్పెషలిస్ట్ వైద్యులను నియమించిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
వారిని తొలగిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌సీ) వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రవేశపెట్టిన స్పెషలిస్ట్ క్లినిక్‌లకు టీడీపీ ప్రభుత్వం ఉద్వాసన పలికింది. క్లినిక్‌ల నిర్వహణ కోసం 8 స్పెషాలిటీల్లో నియమించిన 152 మంది వైద్యులను ఈ నెలాఖరుకు తొలగించాలని వైద్య శాఖ అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలను ఆదేశించింది. ఎన్‌హెచ్‌ఎం కింద కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ కార్యక్రమానికి 2024–25లో అనుమతులు ఇవ్వనందున స్పెషలిస్టు వైద్యులను తొలగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
స్పెషలిస్ట్ వైద్య సేవల కోసం గ్రామీణ ప్రాంత ప్రజలు వ్యయ ప్రయాసలకోర్చి పట్టణాలు, నగరాల్లోని సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా గతంలో దీన్ని ప్రవేశపెట్టారు. ఈమేరకు డెర్మటాలజీ, ఈఎన్‌టీ, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పల్మనాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్ విభాగాల్లో వైద్యులను 2021లో నియమించారు.
వీరిలో ఒక్కో వైద్యుడు రోజుకు రెండు పీహెచ్‌సీల్లో రెండేసి గంటల చొప్పున స్పెషలిస్ట్ క్లినిక్‌లు నిర్వహిస్తూ వచ్చారు. ఇలా వారంలో 12 పీహెచ్‌సీల్లో సేవలు అందించేవారు. తద్వారా మధుమేహం, రక్తపోటు లాంటి జీవన శైలి జబ్బులను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి అవసరమైన చికిత్స అందించేవారు.
వివిధ వ్యాధిగ్రస్తులపై ప్రభావం
రక్తపోటు, మధుమేహం, ఎముకలు, గైనిక్ సంబంధిత సమస్యలతో బాధపడే గ్రామీణ ప్రజలు స్పెషలిస్ట్ వైద్యులను సంప్రదించాలంటే ఏరియా, జిల్లా ఆస్పత్రులు లేదంటే బోధనాస్పత్రులకు వెళ్లాల్సి ఉంటుంది. వృద్ధులు, మహిళలు, నడవలేని స్థితిలో ఉన్న వారు ప్రయాణాలు చేసి పట్టణాలు, నగరాలకు వెళ్లాలంటే ఇది ఇబ్బందికరంగా మారింది. ఈ అవస్థలను నివారించేందుకు గత ప్రభుత్వం స్పెషలిస్టు క్లినిక్‌లను అందుబాటులోకి తెచ్చింది.
టీడీపీ ప్రభుత్వం తొలగించిన స్పెషలిస్టు డాక్టర్లు ఇలా
స్పెషాలిటీ వైద్యుల సంఖ్య
డెర్మటాలజీ 17
ఈఎన్‌టీ 16
జనరల్ సర్జరీ 18
జనరల్ మెడిసిన్ 22
పల్మనాలజీ 10
గైనకాలజీ 22
ఆర్థోపెడిక్స్ 29
పీడియాట్రిక్స్ 18
Comments
Please login to add a commentAdd a comment