కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలు.. ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనకు మాత్రమే అలవాటు పడిన భారతీయులు ఇప్పుడు పర్యాటక ప్రాంతాలను సైతం ఫ్యామిలీతో కలిసి చుట్టేసేందుకు ఇష్టపడుతున్నారు. దేశంలోనూ ఇప్పుడు ఫ్యామిలీ పర్యటనల ట్రెండ్ నడుస్తోంది. ఉరుకుల, పరుగుల జీవితంలో కొద్దిపాటి విరామం దొరికినా ఫ్యామిలీ టూర్లకు చెక్కేస్తున్నారు.
సాక్షి, అమరావతి: చారిత్రక, సాంస్కృతిక నగరాలతో పాటు అందమైన బీచ్‌ల ఒడ్డున కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా సేదతీరేందుకు భారతీయులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇందులో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి దేశంలోని గోవా వెళ్లేందుకు ఇష్టపడుతుండగా.. అంతర్జాతీయంగా అత్యంత ప్రజాదరణ పొందిన పర్యాటక గమ్యస్థానంగా దుబాయ్ కొనసాగుతోంది. డిజిటల్ ట్రావెల్ ప్లాట్‌ఫామ్ ‘అగోడా’ సర్వే ప్రకారం పర్యాటకులు ప్రత్యేక థీమ్‌లతో కూడిన టూర్లను ఎంపిక చేసుకుంటున్నారు.
సౌకర్యవంతమైన బస, ఆకట్టుకునే ప్రదేశాలు, సముద్రపు తీరంలో సేద తీరడం, ఎకో పర్యాటకంలో ప్రశాంతంగా గడిపేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే బీచ్ పర్యాటకానికి ప్రసిద్ధి చెందిన గోవాను తొలి ఎంపికగా చేసుకుంటున్నారు. ఆ తర్వాత చారిత్రక దర్శనీయ స్థలాలైన ఢిల్లీ, ముంబై, సాంస్కృతిక నగరాలు జైపూర్, పుదుచ్చేరి నగరాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా దుబాయ్‌తో పాటు ఆగ్నేయాసియా దేశాల్లో పర్యటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సింగపూర్, మాల్దీవులు, బాలి (ఇండోనేషియా), ఫుకెట్ (థాయ్‌లాండ్)కు క్యూ కడుతున్నారు. అగోడా ఫ్యామిలీ ట్రావెల్ ట్రెండ్ సర్వేలో ప్రపంచ వ్యాప్తంగా 14వేల కుటుంబాల నుంచి ప్రతిస్పంద నలను సేకరించింది.
పర్యటనలు.. షాపింగ్ కోసమే ఎక్కువ ఖర్చు
అమెరికన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక కూడా 88 శాతం మంది భారతీయులు ఫ్యామిలీ పర్యటనలు, షాపింగ్‌ల కోసం ఖర్చు చేసేందుకు వెనుకాడటం లేదని చెబుతోంది. 2023లోనూ టూర్లు, పర్యటనలకే ప్రాధాన్యత ఇస్తామని భారతీయులు స్పష్టం చేసినట్టు ఆ నివేదిక స్పష్టం చేసింది.
10 మంది పట్టణ భారతీయుల్లో 8 మంది సెలవుల సీజన్‌లో ప్రయాణాలకు సిద్ధమవుతున్నారు. కొందరు పని ఒత్తిడి నుంచి బయటపడేందుకు, కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నట్టు తేలింది. ఈ విధానం 2021తో పోలిస్తే భారీగా పెరిగినట్టు అమెరికన్ ఎక్స్‌ప్రెస్ సర్వే పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment