వైఎస్సార్...రైతును రాజుగా చేసిన నేత. అందుకే ఆయన భౌతికంగా దూరమై దశాబ్దం దాటినా జనం గుండెల్లో మాత్రం నేటికీ కొలువై ఉన్నారు. కరువు జిల్లా అనంతలో ఏ చెట్టును కదిపినా...ఏ ప్రాజెక్టును పలకరించినా వైఎస్సార్ పేరే వినిపిస్తుంది. ఇక రైతన్నతో వైఎస్సార్ గురించి ప్రస్తావిస్తే స్వర్ణయుగం కళ్లముందు కనిపిస్తుంది. ఆయన తనయుడు, ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా రైతు సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారు. వైఎస్సార్ జయంతి (జూలై 8వ తేదీ)ని రాష్ట్ర ప్రభుత్వం రైతు దినోత్సవంగా నిర్వహిస్తోంది.
సాక్షి,అనంతపురం: దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సువర్ణపాలనను తలపించేలా ఆయన తనయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా రైతుల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారు. గత రెండేళ్లుగా అడుగడుగునా అన్నదాతకు అండగా నిలుస్తున్నారు.
రెండేళ్లలోనే రూ.2,700 కోట్ల జమ
రాష్ట్ర సర్కారు అమలు చేస్తున్న పథకాలతో వ్యవసాయం, అనుబంధ శాఖలు పురోభివృద్ధి దిశగా పయనిస్తున్నాయి. ‘వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్’ కింద ఏటా ఖరీఫ్‌లో పెట్టుబడి సాయం కింద రెండేళ్ల కాలంలో రూ.1,938.72 కోట్లు జమ చేశారు. ‘వైఎస్సార్ సున్నావడ్డీ పంట రుణాలు’ పథకం కింద రెండేళ్లలో రూ.61.55 కోట్లు జమ చేశారు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతుల ఖాతాల్లోకి రూ.25.17 కోట్లు జమ చేశారు. ‘ఉచిత పంటల బీమా’ పథకం కింద రూ.628 కోట్లు ఇన్సూరెన్స్ మొత్తాన్ని నేరుగా చెల్లించారు. ఉద్యాన రైతులకు పంటల బీమా కింద రూ.51 కోట్ల పరిహారం ఇచ్చారు.
రైతు ఆత్మహత్యలకు సంబంధించి రెండేళ్ల కాలంలో 181 బాధిత కుటుంబాల ఖాతాల్లోకి రూ.10.59 కోట్ల మేర పరిహారం జమ చేశారు. కనీస మద్దతు ధరతో రైతుల నుంచి రూ.250 కోట్ల విలువైన పంట ఉత్పత్తులు కొనుగోలు చేశారు. ‘వైఎస్సార్ పశునష్ట పరిహారం పథకం’ కింద గత రెండేళ్లలో 3 వేల మందికి పైగా బాధితుల ఖాతాల్లోకి రూ.9 కోట్ల వరకు జమ చేశారు. మొత్తమ్మీద రెండు సంవత్సరాల రెండు నెలల కాలంలోనే వ్యవసాయ, అనుబంధ రంగాల కింద లబ్ధిదారులకు రూ.2,700 కోట్ల మేర బ్యాంకు ఖాతాల్లోకి జమ చేశారు. ఇక రైతు భరోసా కేంద్రాల వేదికగా రైతులకు సకల సదుపాయాలు కల్పిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment