29న కొత్త జిల్లాలకు తుది రూపు? | Final look for Andhra Pradesh new districts on March 29th | Sakshi
Sakshi News home page

29న కొత్త జిల్లాలకు తుది రూపు?

Published Sat, Mar 26 2022 3:34 AM | Last Updated on Sat, Mar 26 2022 2:28 PM

Final look for Andhra Pradesh new districts on March 29th - Sakshi

సాక్షి, అమరావతి: కొత్త జిల్లాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం శాసన సభలోని తన చాంబర్‌లో ఉన్నతాధికారులతో సమీక్షించారు. కొత్తగా ఏర్పాటయ్యే 13 జిల్లాల్లో ఉగాది పండుగ నుంచి పరిపాలన కార్యకలాపాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన వినతులపై సీఎం అధికారులతో కూలంకషంగా చర్చించారు. ఈ వినతులను పరిగణనలోకి తీసుకొని ఈ నెల 29వ తేదీన కొత్త జిల్లాల తుది రూపం ఖరారు చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అధికారులు ముందుగా ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన వినతులను సీఎంకు వివరించారు.

వాటిపై సీఎం లోతుగా చర్చించారు. ఎచ్చర్లను శ్రీకాకుళం జిల్లాలోనే ఉంచేందుకు సీఎం అంగీకరించారని గురువారం అసెంబ్లీలో సీనియర్‌ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు చెప్పిన విషయం తెలిసిందే. అలాగే నర్సాపురం కేంద్రంగా జిల్లా చేయాలని స్థానిక ఎమ్మెల్యేతో పాటు పలువురు నాయకులు సీఎంని కలిసి విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు శాసన సభ్యులు కొత్త జిల్లాలపై తమ విజ్ఞప్తులను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వీటన్నింటిపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. వీటిని పరిగణనలోకి తీసుకొని కొత్త జిల్లాలకు తుది రూపం ఇవ్వనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మ, భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ సాయిప్రసాద్, ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement