సాక్షి, అమరావతి: సహకార రంగానికి పూర్వ వైభవం వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రుణాల మంజూరు, ఎరువులు, విత్తనాల పంపిణీ లాంటి కార్యక్రమాలతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు గతంలో నిత్యం కోలాహలంగా కనిపించేవి. పాలక వర్గాల్లో రాజకీయ జోక్యంతోపాటు దీర్ఘకాలం పాతుకుపోయిన సిబ్బంది సహకార స్ఫూర్తికి భంగం కలిగించారు. టీడీపీ పాలనలో పాలకవర్గాలు ఇష్టారీతిన వ్యవహరించాయి. రాష్ట్రంలో 13 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులుంటే 10 బ్యాంకులపై 51 విచారణలు జరుగుతుండటం గమనార్హం. దాదాపు 200 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో భారీ అక్రమాలు, అవినీతిపై సహకార ట్రిబ్యునళ్లలో కేసులున్నాయి. కొన్ని సంఘాలపై ఏసీబీ, సీఐడీ విచారణలు కూడా జరుగుతున్నాయి.
వేతన స్కేళ్లను తెచ్చిన వైఎస్సార్..
రైతులకు విత్తనాలు, ఎరువులు సీజన్‌లో అందించాల్సిన సహకార సంఘాలు నష్టాల ఊబిలో కూరుకుపోయి చేతులెత్తేయడం, కనీసం రుణాలివ్వలేని దుస్థితికి చేరుకోవడంతో సహకార వ్యవస్థ ప్రక్షాళనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. నాబార్డు అనుబంధ సంస్థ నాబ్‌కాన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ సూచనలకు అనుగుణంగా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో 2,106 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉండగా 811 సంఘాలు నష్టాల్లో కూరుకుపోయినట్లు నాబ్‌కాన్స్ నివేదిక స్పష్టం చేస్తోంది. వైద్యనాథన్ కమిటీ సిఫారసుల మేరకు సహకార సంఘాల ఉద్యోగులను కేంద్ర ప్రభుత్వం నాబార్డు పరిధిలోకి తెచ్చింది. ఈ క్రమంలో మహానేత వైఎస్సార్ 2009లో ఉద్యోగులకు వేతన స్కేళ్లను అమలులోకి తెచ్చారు. దీని ప్రకారం ప్రతి ఐదేళ్లకు ఉద్యోగులకు వేతన సవరణ చేయాలి. అయితే ఆ తరువాత ప్రభుత్వాలు సహకార ఉద్యోగుల సమస్యలను పట్టించుకోలేదు.
అమూల్‌తో ఒప్పందం..
ఎన్నికల సమయంలో పశుపోషకులకు ఇచ్చిన హామీని అమలు చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పాల ఉత్పత్తుల తయారీ, అమ్మకాల్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమూల్‌తో ఒప్పందం చేసుకుంది. సహకార సంఘాల చట్టానికి అనుగుణంగా పనిచేస్తున్న సంఘాల్లో మహిళా పాల ఉత్పత్తిదారులకు సభ్యత్వం కల్పించడంతోపాటు పాడిపశువుల కొనుగోలుకు ఆర్థిక సాయం చేస్తోంది. ప్రైవేట్ డెయిరీల కంటే అధిక రేటుకు పాల ఉత్పత్తిదారుల నుంచి కొనుగోలు చేస్తోంది. తొలిదశలో ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో పాలసేకరణ కేంద్రాలను ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా మూడు దశల్లో రూ.6,551 కోట్ల వ్యయంతో 9,899 గ్రామాల్లో పాల సేకరణ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది.
ధాన్యం కొనుగోలు కేంద్రాల బాధ్యత...
రైతుల నుంచి ధాన్యం కొనుగోలు బాధ్యతను ప్రాథ«మిక వ్యవసాయ సహకార సంఘాలకు ప్రభుత్వం అప్పగిస్తోంది. సంఘాలను ఆర్ధికంగా బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం తీసుకుంది. సేకరణ ద్వారా వచ్చే కమిషన్‌తో సంఘాలకు కొంత ఆదాయం సమకూర్చేలా చర్యలు చేపట్టింది.
48 కస్టమ్ హైరింగ్ సెంటర్లు..
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా వరికోత, నాట్లు వేసే భారీ యంత్రాలను అద్దెకు ఇచ్చే విధానాన్ని ప్రభుత్వం అమలులోకి తెస్తోంది. ఇందుకోసం మండల స్ధాయిలో కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలోని 48 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు భారీ యంత్రాల కొనుగోలుకు రుణం ఇవ్వనుంది. ఒక్కో సంఘానికి రూ.50 లక్షల నుంచి రూ.1.30 కోట్ల వరకు రుణం అందచేస్తారు.
పాలనపరమైన అంశాల్లో కీలక నిర్ణయాలు..
ఉద్యోగులకు నిర్ణీత వ్యవధిలో వేతన సవరణ, సిబ్బందికి కనీస విద్యార్హతలు, బదిలీలు, చనిపోయిన వారి అంత్యక్రియలకు ఆర్థిక సాయం లాంటి నిర్ణయాలు తీసుకోవడంపై ఉద్యోగ వర్గాల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది.
విప్లవాత్మక మార్పులు..
రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తోంది. ఎరువులు, విత్తనాలు, రుణాల మంజూరు, యాంత్రిక పరికరాలను అద్దెకు ఇచ్చే విధానాలతో సంఘాలు ఆర్థికంగా బలోపేతం అవుతాయి. అమూల్‌తో ఒప్పందం వల్ల మహిళా పాల ఉత్పత్తిదారుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. వినూత్న విధానాలతో ఆర్థిక ప్రయోజనాలు కలిగించే దిశగా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది.
– వాణీ మోహన్, సహకార శాఖ కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment