ప్రకాశం బ్యారేజీలోకి 7,03,839 క్యూసెక్కులు
సాగర్‌లోకి 3,04,115 క్యూసెక్కుల రాక
మున్నేరు, బుడమేరు, కీసర వాగుల్లో తగ్గిన వరద
సాక్షి, అమరావతి/విజయపురి సౌత్/శ్రీశైలం ప్రాజెక్ట్/సత్రశాల/గాందీనగర్ (విజయవాడ సెంట్రల్): నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాలు తెరిపివ్వడంతో కృష్ణా నదిలో వరద తగ్గుముఖం పట్టింది. మంగళవారం సాయంత్రం 7 గంటలకు ప్రకాశం బ్యారేజీలోకి 7,03,839 క్యూసెక్కులు చేరుతుండగా.. కాలువలకు 500 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 7,03,339 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ శాంతిస్తుండడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. కృష్ణా బేసిన్‌లో ఎగువన కూడా వరద ప్రవాహం తగ్గింది.
ఆల్మట్టి డ్యామ్‌లోకి 47 వేల క్యూసెక్కులు చేరుతుండగా.. విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువకు 20 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. నారాయణపూర్ డ్యామ్‌లోకి 20 వేల క్యూసెక్కులు చేరుతుండగా.. 8,272 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టులోకి 2 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 2.08 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్‌లోకి 47,911 క్యూసెక్కులు చేరుతుండగా.. దిగువకు 4,809 క్యూసెక్కులు వదులుతున్నారు.
కృష్ణా, తుంగభద్ర నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,61,292 క్యూసెక్కులు చేరుతుండగా.. స్పిల్‌వే, విద్యుత్ కేంద్రాల ద్వారా దిగువకు 3,38,604 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌లోకి 3,04,115 క్యూసెక్కులు చేరుతుండగా.. స్పిల్‌వే, విద్యుత్ కేంద్రం ద్వారా 2.90 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి 4 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. దిగువకు 3.40 లక్షల క్యూసెక్కులు వదిలేస్తున్నారు. మున్నేరు, బుడమేరు, కీసర తదితర వాగుల్లో వరద తగ్గిన నేపథ్యంలో బుధవారం ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి మరింత తగ్గనుంది.
Comments
Please login to add a commentAdd a comment