గజ్జెకట్టిన పాటెళ్లిపోయింది | Folk Artist Vangapandu Prasada Rao Passes Away | Sakshi
Sakshi News home page

గజ్జెకట్టిన పాటెళ్లిపోయింది

Published Wed, Aug 5 2020 3:37 AM | Last Updated on Wed, Aug 5 2020 7:29 AM

Folk Artist Vangapandu Prasada Rao Passes Away - Sakshi

సాక్షి ప్రతినిధి, విజయనగరం/ పార్వతీపురంటౌన్‌/సాక్షి, అమరావతి: ‘ఏం పిల్లో ఎల్దమొస్తవా‘... అంటూ ప్రజలను ఉర్రూతలూగించిన ఉత్తరాంధ్ర జానపద శిఖరం, ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు(77) ఇకలేరు. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని వైకేఎం నగర్‌లో మంగళవారం వేకువ జామున ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. వంగపండు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. పదునైన పదాలకు సొంపైన బాణీలతో స్వయంగా కాలికి గజ్జె కట్టి ఆడి పాడే వంగపండు శ్రీకాకుళం గిరిజన, రైతాంగ పోరాటం నుంచి ఉద్భవించిన వాగ్గేయకారుడు. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు సబ్‌ కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వరులు దగ్గరుండి ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా వంగపండు అంత్యక్రియలను పూర్తి చేశారు. అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో వంగపండు రచించిన గీతాలను ఆలపిస్తూ విప్లవ జ్యోతికి తుది వీడ్కోలు పలికారు. వంగపండు కుమార్తె ఉష వైఎస్సార్‌సీపీలో ఉన్నారు. రాష్ట్ర సృజనా త్మక, సాంస్కృ తిక కమి షన్‌ చైర్‌ పర్సన్‌గా సేవలందిస్తున్నా రు. తండ్రి మరణవార్త తెలిసిన వెంటనే ఆమె పార్వతీపురం చేరుకున్నారు. తండ్రితో కలసి పలు ప్రదర్శనల్లో పాల్గొని విప్లవ గీతాలతో చైతన్యం రగిల్చారు. ఆ గుర్తులను తలచుకుని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.
తండ్రి భౌతిక కాయం వద్ద విలపిస్తున్న కుమార్తె వంగపండు ఉష  

విప్లవ గీతాలకు పెట్టింది పేరు
1943 జూన్‌లో పార్వతీపురం మండలం పెదబొండపల్లి గ్రామంలో జగన్నాథం, చినతల్లి దంపతులకు వంగపండు జన్మించారు. తన రచనలతో, పాటలతో ప్రజలను చైతన్యం చేశారు. 1972లో నాటి పీపుల్స్‌ వార్‌ సాం స్కృతిక విభాగమైన జన నాట్యమండలిని స్థాపించి 400కి పైగా జానపద గీతా లను రచించారు.

ముఖ్యమంత్రి జగన్‌ సంతాపం
ప్రజా గాయకుడు, కవి వంగపండు ప్రసాదరావు మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ‘వంగపండు ఇక లేరన్న వార్త ఎంతో బాధించింది. ఆయన వ్యక్తిగతంగా నాకు ఆప్తులు. జానపదాన్ని తన బాణీగా మార్చుకుని ‘‘పామును పొడిచిన  చీమలు’’న్నాయంటూ ఉత్తరాంధ్ర ఉద్యమానికి అక్షర సేనాధిపతిగా మారారు. తెలుగువారి సాహిత్య, కళారంగాల చరిత్రలో ఆయన ఓ మహాశిఖరంగా నిలిచిపోతారు. వంగపండు కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా’’ అని సీఎం ట్వీట్‌ చేశారు.  

చైతన్య స్ఫూర్తిని కోల్పోయాం..
వంగపండు మృతి పట్ల ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి సంతాపం తెలిపారు. జన పదాలతో ప్రజల గొంతుక వినిపించిన వంగపండు మృతితో చైతన్య స్ఫూర్తిని కోల్పోయామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. గళంతోనే జగత్తును కదిలించిన ప్రజాకవి వంగపండు మృతి పట్ల వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశాయి. సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, పి.మధు, ఏపీడబ్లు్యజేఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి జి.ఆంజనేయులు, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు, సీఐటీయూ నాయకుడు గఫూర్‌ తదితరులు సంతాపం తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement