తెలుగు వాళ్లు ప్రతిభావంతులు: కేంద్ర మంత్రి | Foreign Minister Jaishankar Talk On Andhra Pradesh In Amaravati | Sakshi
Sakshi News home page

తెలుగు వాళ్లు ప్రతిభావంతులు: కేంద్ర మంత్రి జయశంకర్

Published Sat, Feb 6 2021 1:21 PM | Last Updated on Sat, Feb 6 2021 2:48 PM

Foreign Minister Jaishankar Talk On Andhra Pradesh In Amaravati - Sakshi

సాక్షి, అమరావతి: తెలుగు వాళ్లలో ప్రతిభావంతులు ఉన్నారని, తాను ఎక్కడికి వెళ్లినా తెలుగు వాళ్లని కలుస్తానని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ అన్నారు. ఆయన శనివారం ఏపీ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో కరోనా నియంత్రణ అదుపులో ఉందని, కోవిడ్ వ్యాక్సిన్ దేశ ప్రజలకు త్వరలో అందుబాటులోకి వస్తుందన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ పురోగాభివృద్ధికి ఉపయోగపడుతుందని తెలిపారు. దేశంలో కరోన విస్తరించినప్పుడు ఎటువంటి సేవలు అందుబాటులో లేవని, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నేడు దేశంలో వాక్సినేషన్ అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. వైద్య సదుపాయాలను విస్తరించామని, కరోనా వ్యాప్తి తరువాత దేశంలో పరిశ్రమ రంగం కుదేలయిందని, లాక్‌డౌన్ కారణంగా ఆర్ధికంగా నష్టపోయామన్నారు. కరోన తరువాత 11 శాతం వృద్ధి దేశంలో ఉందని, కేంద్ర మంత్రి బడ్జెట్‌ను 6 స్థంబాలుగా విభజించి ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. బడ్జెట్‌లో అనేక రంగాలకు పెద్దపీట వేసి గాడిలో పెట్టేందుకు చర్యలు చేపట్టారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో 1600 కోవిడ్ కేంద్రాలను ఏర్పాటు చేసిందని,  వైద్య రంగంలో సమూల మార్పుల దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు.

బడ్జెట్‌లో రూ.2లక్షల కోట్లతో ఉత్పత్తి రంగాన్ని ఆదుకోవడానికి చర్యలు చేపట్టామని తెలిపారు. ఉద్యోగాల కల్పన కోసం టెక్స్‌టైల్‌ కార్పొరేషన్ ఏర్పాటు చేయబోతున్నామని, దేశంలో 5 మెట్రో ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. వైజాగ్ కేంద్రంగా  ఫిషింగ్ హార్బర్ ఏర్పటుకు కేంద్రం అనుమతి ఇచ్చిందన్నారు. కరోనా సమయంలో దేశంలో ఎక్కడా లేని విధంగా డీబీటీల ద్వారా పేదలను అదుకున్నామని, ఏపీని పెట్టుబడుల కేంద్రంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. ఏపీలో త్వరలో  మూడు  క్లస్టర్స్  ఏర్పాటు కాబోతున్నాయని, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారతదేశం ఆర్ధికంగా స్థిరపడుతుందన్నారు. బడ్జెట్‌పై చాలామంది విమర్శలు చేస్తున్నారని, రాష్ట్రాల వారిగా బడ్జెట్‌ను చూడాల్సిన అవసరం లేదని తెలిపారు. 

రాష్ట్రాల విమర్శలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరంలేదని, ఆయా రాష్ట్రాల అభివృద్ధిని పరిగణనలోకి తీసుకొని బడ్జెట్‌ను రూపొందించామని పేర్కొన్నారు. రాజకీయాల కోసం బడ్జెట్‌పై విమర్శలు చూస్తున్నారని, ఏపీలో గ్లోబల్ ఇంపాక్ట్ ఉందని, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం చర్యలు చేపడుతుందన్నారు. చైనా సరిహద్దుల వెంబడి జరుగుతున్న వివాదంపై కేంద్రం చర్యలు చేపడుతోందని, కేంద్ర రక్షణా శాఖ మంత్రి ఇప్పటికే సరిహద్దుల వెంబడి పర్యటించి పరిస్థితులు తెలుసుకున్నారని వ్యాఖ్యానించారు. రక్షణా రంగానికి అధికంగా నిధులు కూడా కేటాయించారని, కేంద్ర మంత్రుల బృందం ఈ  అంశంపై భేటీ అవుతుందా లేదా ఇప్పుడే చెప్పలేమన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ  అంశం నా పరిధిలోకి రాదన్నారు. సంబంధిత శాఖ మంత్రులు ఈ అంశం పై స్పందిస్తారని పేర్కొన్నారు. ప్రధానితో అన్ని దేశాల అధ్యక్షులకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement