మృతి చెందిన టెక్కలి మాజీ ఎమ్మెల్యే బమ్మిడి నారాయణస్వామి (ఫైల్)
సాక్షి, శ్రీకాకుళం: టెక్కలి మాజీ ఎమ్మెల్యే బమ్మిడి నారాయణస్వామి (92) బుధవారం తన సొంత గ్రామమైన నందిగాం మండలం రాంపురంలో మృతి చెందారు. దీంతో టెక్కలి ని యోజకవర్గంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సాయంత్రం టీ తాగిన తర్వాత బాత్రూమ్‌కు వెళ్లి తిరిగి వచ్చి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందారు. ఎమ్మెల్యేగా పనిచేసినా సాధారణ వ్యక్తి మాదిరిగానే జీవించడం నారా యణస్వామి ప్రత్యేకత. 2019 సాధారణ ఎన్నికల ముందు ఆయన వైఎస్సార్‌సీపీలోకి చేరారు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఈయన అల్లుడు సింగుపురం మోహన్‌రావు ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు.
సొంత భూమిని కోల్పోయి..
నారాయణ స్వామి 1978–83 కాలంలో జనతా పార్టీ తరఫున టెక్కలి సమితికి ఎమ్మెల్యేగా సేవ చేశారు. రాజకీయాల్లో ఎలాంటి స్వలాభం చూసుకోకుండా ప్రజా సేవ చేసి రాంపురం ప్రాంతంలో పూర్వీకుల నుంచి ఉన్న 89 ఎకరాల సొంత భూములు పూర్తిగా కోల్పోయారు. 1978 సంవత్సరంలో టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు మండలాలు కలిపి టెక్కలి సమితిగా ఉండేది. అప్పట్లో ప్రతి మండలం ఫిర్కాగా ఉండేది. 1978 సంవత్సరంలో జనతా పార్టీ తరఫున టెక్కలి సమితికి ఎమ్మెల్యేగా సీటు వచ్చిన తర్వాత నారాయణస్వామి గెలుపు కోసం ప్రజలంతా స్వచ్ఛందంగా సుమారు 86 వేల రూపాయలు విరాళాలు సేకరించారు.
ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం, నౌపడ జూనియర్ కళాశాల మంజూరు, రావివలస సబ్‌స్టేషన్ ఏర్పాటు, టెక్కలిలో పాలకేంద్రం, అగ్ని మాపక శాఖా కార్యాలయం ఏర్పాటు, నందిగాం మండలంలో గ్రామాలకు రహదారుల సదుపాయం కల్పించారు. అంతే కాకుండా అప్పట్లో ఏపీ ఎలక్ట్రిసిటీ బో ర్డులో సభ్యునిగా ఉండడంతో, టెక్కలి నియోజకవర్గంతో పాటు హరిశ్చంద్రాపురం నియోజకవర్గంలో గ్రామాలకు విద్యుత్ సదుపాయం కల్పించారు. ఎన్టీఆర్ హయాంలో 1983లో కర్షక పరిషత్ పర్సన్ ఇన్‌చార్జిగానూ సేవలు అందించారు. ఈయన మృతిపై వైఎస్సార్‌సీపీ నాయకులు కిల్లి కృపారాణి, దువ్వాడ శ్రీనివాస్, పేరాడ తిలక్, సంపతిరావు రాఘవరావు, కె.రామ్మోహన్‌రావు తో పాటు పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment