లడ్డూ ఆరోపణల్లో అడ్డంగా దొరికి పదే పదే అబద్ధాలు
డైవర్ట్ చేయడానికే డిక్లరేషన్ అంశం తెరపైకి తెచ్చారు
చంద్రబాబుపై మాజీ ఎంపీ మార్గాని భరత్ ఫైర్
సాక్షి, అమరావతి: మతకల్లోలాలు సృష్టించి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తిరుమలకు వెళ్లకుండా అడ్డుకోవాలని టీడీపీ భారీ కుట్ర చేసిందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆరోపించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి మాజీ సీఎం వైఎస్ జగన్‌కి అనుమతి లేదంటున్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా! అని ప్రశ్నించారు. కల్తీ లడ్డూ ఆరోపణలతో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు దాన్ని డైవర్ట్ చేయడానికి డిక్లరేషన్ అంశం తెరపైకి తెచ్చారని భరత్ మండిపడ్డారు.
చంద్రబాబు హిందుత్వాన్ని, తిరుమలను తన రాజకీయ ప్రయోజనాలకు ఎలా వాడుకుంటున్నారో, ఏ రకంగా కుటిల రాజకీయాలు చేస్తున్నారో వైఎస్ జగన్ అద్భుతంగా వివరించారని చెప్పారు. చంద్రబాబు చేసిన అపచారం కారణంగా రాష్ట్ర ప్రజలకు నష్టం కాకూడదని రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించినట్టు చెప్పారు. లడ్డూలో వాడే నెయ్యి కల్తీ జరిగిందని ఆరోపించిన చంద్రబాబు ఆధారాలు చూపించడంలో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీటీడీ ఈవో శ్యామలరావు, సీఎం చంద్రబాబు పరస్పర భిన్నమైన స్టేట్‌మెంట్లు ఇచ్చి ప్రజల్ని, కోట్లాది మంది శ్రీవారి భక్తుల్ని అయోమయానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. మీడియాతో చంద్రబాబు చెప్పిన మాటల్లో డొల్లతనం కనపడిందన్నారు. నెయ్యిని వాడారని చెబుతున్న చంద్రబాబు.. ఎక్కడ వాడారన్నది మాత్రం అప్రస్తుతం అంటున్నారని, ఆ వాడిన నెయ్యిలో కల్తీ ఉందా అంటే.. ఆ తర్వాత వచ్చిన నెయ్యిలో ఉంది అంటున్నారని భరత్ చెప్పారు.
చంద్రబాబు ఎలా హిందుత్వవాదో బీజేపీ చెప్పాలి
బూట్లు వేసుకుని పూజలు చేసే చంద్రబాబుకి హిందుత్వం పట్ల, హిందూ సంస్కృతి పట్ల అసలు నమ్మకం ఉందా.. అంటూ భరత్ ప్రశ్నించారు. హిందుత్వానికి టార్చ్ బేరర్స్ అని చెప్పుకునే బీజేపీకి ఇవన్నీ కనపడవా అని నిలదీశారు. తిరుమలలో శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చివేయించిన చంద్రబాబు హిందుత్వవాది ఎలా అవుతారో బీజేపీ పెద్దలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
లడ్డూ నాణ్యత పరీక్షల విషయంలో పదే పదే అబద్ధాలు చెబుతున్న చంద్రబాబుకి దశాబ్దాలుగా టీటీడీలో మూడు లేయర్ల టెస్టులు జరుగుతున్న విషయం కూడా తెలియకపోవడం బాధాకరమని అన్నారు. గతంలో ఏనాడూ నాణ్యత పరీక్ష కోసం బయటకు పంపలేదని చంద్రబాబు మరో పచ్చి అబద్ధం చెప్పారన్నారు. టీటీడీ వారు 2022లో బెంగళూరులోని ఐసీఏఆర్‌కి పరీక్షల కోసం పంపిన విషయం తెలుసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment