భీమవరం(పశ్చిమగోదావరి జిల్లా): స్థానిక సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా చేపట్టిన ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా గుర్తించిన సమస్యలను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసేందుకు ప్రభుత్వం సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసింది.
ప్రధానంగా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తోంది. దీనిలో భాగంగా జిల్లాలో చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం (జీజీఎంపీ) పనులు చురుగ్గా సాగుతున్నాయి. ప్రజాప్రతినిధులు గడపగడపకు కార్యక్రమంలో భాగంగా వారి దృష్టికి వచ్చిన మౌలిక వసతుల సమస్యలను గుర్తించి ఆయా పనులకు తీర్మానం చేయించి జీజీఎంపీ పనుల్లో నిధులు మంజూరు చేయించి త్వరితగతిన పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఏఏ పనులంటే.. సచివాలయ పరిధిలో ప్రభుత్వం మంజూరు చేసిన రూ.20 లక్షలతో రోడ్లు, డ్రెయిన్లు, తాగునీరు, పారిశుద్ధ్య, లైటింగ్ తదితర పనులు చేపడుతున్నారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో అత్యవసరమైన పనులకు ముందుగా ప్రాధాన్యమిస్తూ నిధులను వెచ్చిస్తున్నారు.
22.05 కిలోమీటర్ల మేర సీసీ రోడ్డు
జిల్లావ్యాప్తంగా జీజీఎంపీ నిధులతో 22.05 కిలోమీటర్లు మేర సీసీ రోడ్లు మంజూరు చేయగా ఇప్పటివరకు 8.02 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. సీసీ రోడ్లకు సంబంధించి మొత్తం 414 పనులు చేపట్టగా 95 పనులు పూర్తయ్యాయి.
జిల్లావ్యాప్తంగా 1,035 పనులు
జిల్లాలో ఇప్పటివరకూ 1,035 పనులు మంజూరు చేయగా 837 పనులు జరుగుతున్నాయి. సుమారు 100 పనులు పూర్తయ్యాయి. మరో 158 పనులు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు. జిల్లాలోని 19 మండలాలు, 6 మున్సిపాలిటీల్లో పనులు 80 నుంచి 90 శాతం మేర పురోగతిలో ఉన్నాయి. జీజీఎంపీ నిధులు మైనర్ పంచాయతీలకు వరంలా మారాయి. ఆయా నిధులతో మౌలిక వసతులు కల్పించడంతో గ్రామంలో సమస్యలు పరిష్కారమవుతున్నాయి. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
శాఖల వారీగా పనులు ఇలా..
పంచాయతీరాజ్ శాఖ ద్వారా 466 పనులు మంజూరు కాగా 424 పనులు చేపట్టారు. 42 పనులు చేపట్టాల్సి ఉంది.
ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ ద్వారా 172 పనులు మంజూరు కాగా 158 పనులు చేపట్టారు. 14 పనులు చేపట్టాల్సి ఉంది.
విద్యుత్ శాఖ ద్వారా 5 పనులు మంజూరు కాగా 3 పనులు చేపట్టారు. 2 పనులు చేపట్టాల్సి ఉంది.
మున్సిపాలిటీల్లో 392 పనులు మంజూరు కాగా 184 పనులు జరుగుతున్నాయి. 108 పనులు చేపట్టాల్సి ఉంది.
రోడ్డు, డ్రెయిన్ నిర్మాణం
ప్రభుత్వం మా గ్రామ సచివాలయానికి రూ.20 లక్షలు మంజూరు చేసింది. గడపగడపకూ కార్యక్రమంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ దృష్టికి సమస్యలను తీసుకువెళ్లగా ఆయన వెంటనే స్పందించి జీజీఎంపీ నిధులతో సీసీ రోడ్డు, డ్రెయిన్, కల్వర్ట్ నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. మూడు పనులు జరుగుతున్నాయి. చాలా సంతోషంగా ఉంది. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు.
– వీరవల్లి శ్రీనివాస్, సర్పంచ్, తోకలపూడి
జిల్లావ్యాప్తంగా పనులు
జిల్లావ్యాప్తంగా జీజీఎంపీ పనులు జరుగుతున్నాయి. సీసీ, గ్రావెల్ రోడ్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులు చేపట్టాం. కలెక్టర్ ఆదేశాలు, సలహాల మేరకు వేగంగా పనులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో సుమారు 100 పనులు పూర్తికాగా 837 పనులు సాగుతున్నాయి. వీటిని వేగంగా పూర్తిచేసేందుకు కృషిచేస్తున్నాం.
– కేఎస్‌ఎస్ శ్రీనివాస్, జిల్లా పంచాయతీరాజ్ ఈఈ, భీమవరం
Comments
Please login to add a commentAdd a comment