
రాయచోటి: ప్రజా సేవే ధ్యేయంగా తాను పనిచేస్తానని, ప్రజల వద్ద తలదించుకునే పనిని ఎప్పుడూ చేయనని, ఆరోజు వస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. సాక్ష్యాధారాలు లేకుండా బురదజల్లే రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. రాయచోటిలో మంగళవారం తహసీల్దార్ రవిశంకర్ రెడ్డి, సబ్ రిజిస్ట్రార్ గురుస్వామిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
జిల్లా కేంద్రం అయిన తర్వాత ఇక్కడ భూముల విలువ బాగా పెరిగి, భూ దందాలపై ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. అంతకు ముందే తాను ప్రభుత్వ భూములు కాపాడాలని అధికారులకు సూచించానన్నారు. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భూమి రిజిస్ట్రేషన్ విషయంలో జరిగింది తప్పేనని, ఈ స్థలం కబ్జాకు గురైందన్న విషయం పత్రికల ద్వారానే తనకు తెలిసిందని అన్నారు.
రిజిస్ట్రేషన్లను ఎక్కడైనా చేసుకోవచ్చన్న చట్టం వల్ల రాయచోటికి సంబంధించిన 938 రిజిస్ట్రేషన్లు ఇతర ప్రాంతాల్లో జరిగాయని చెప్పారు. వీటిలో 275 రిజెక్ట్ అయ్యాయన్నారు. ఇలా వేరే ప్రాంతాల్లో ఎందుకు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారో వాటిని చేయించుకున్న వారికే ఎరుక అన్నారు.
లక్కిరెడ్డిపల్లె ఎస్సీల భూ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యేపైన కూడా తాను వ్యక్తిగత ఆరోపణలు చేయలేదని అన్నారు. ఆ ఘటనపై పూర్తి స్థాయిలో విచారించి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment