వరుస క్రమంలో జీవోలను అప్‌లోడ్ చేయాల్సిందే
ఇందుకోసం ఏం చేస్తున్నారో చెప్పాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ వెబ్‌సైట్‌లో కొన్ని జీవోలు మాత్రమే అప్‌లోడ్ చేసి.. మిగిలిన వాటిని ప్రజలకు తెలియకుండా రహస్యంగా ఉంచడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. జీవోలన్నింటినీ ఎలా పడితే అలా కాకుండా ప్రజలకు అర్థమయ్యేందుకు వీలుగా.. ఓ వరుస క్రమంలో అప్‌లోడ్ చేయాల్సిందేనని తేలి్చచెప్పింది. ఏదైనా జీవోలో రహస్య సమాచారం ఉంటే.. ఆ విషయాన్ని కూడా జీవో ద్వారా తెలపాలని ఆదేశించింది. దీని వల్ల మొత్తం ప్రక్రియ పారదర్శకంగా ఉంటుందని.. ప్రజలకు సమాచారం తెలిసే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది.
అలాగే జీవోలను గతంలో మాదిరిగా వరుస క్రమంలో జీవోఐఆర్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
జీవోలను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఉంచకపోవడం సమాచార హక్కు చట్ట నిబంధనలకు విరుద్ధమంటూ నెల్లూరుకు చెందిన జీఎంఎన్‌ఎస్ దేవి, గుంటూరుకు చెందిన కె.శ్రీనివాసరావు, అనంతపురం జిల్లాకు చెందిన ఎస్.ఆర్.ఆంజనేయులు, బాపట్ల జిల్లాకు చెందిన సింగయ్య తదితరులు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది.
ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సింగమనేని ప్రణతి వాదనలు వినిపిస్తూ, జీవోలన్నీ అప్‌లోడ్ చేస్తున్నామని చెప్పారు. పిటిషనర్ తరఫు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌బాబు స్పందిస్తూ.. గతంలో మాదిరిగా వరుస క్రమంలో జీవోలను అప్‌లోడ్ చేయడం లేదన్నారు. దీని వల్ల జీవోల వివరాలు తెలిసే అవకాశం లేదని చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ.. జీవోలను ఓ వరుస క్రమంలో అప్‌లోడ్ చేయాల్సిందేనని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment