ఇప్పటివరకు సహాయక చర్యలు ప్రారంభించని ప్రభుత్వం
సాక్షి, అమరావతి : భారీ వర్షాలు, వరదలకు ఏజెన్సీ ప్రాంతం అతలాకుతలమవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం కనీసం కూడా స్పందించడంలేదు. ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని విలీన మండలాలు, మరికొన్ని గిరిజన మండలాల్లో గ్రామాలు మునిగిపోయి జనం జలదిగ్బంధంలో చిక్కుకుపోయినా ఎవరూ పట్టించుకోవడంలేదు.
శనివారం సాయంత్రం వరకు 20 మండలాల్లో 200కి పైగా గ్రామాలు మునిగిపోయినా పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేయలేదు. దీంతో అక్కడి జనం నానా బాధలు పడుతున్నారు. ఇళ్లల్లోకి నీరు వచ్చి, కరెంటులేక, నిత్యావసరాలు దొరక్కపోవడంతోపాటు కనీసం మంచినీరు లేక విలవిల్లాడుతున్నారు.
వరద పెరిగాక జనాన్ని తరలిస్తారట..
గోదావరి వరద పెరిగి మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేశాకే పునరావాస కేంద్రాల గురించి ఆలోచించాలని అధికారులు సూచించడంతో ఎక్కడా పునరావాస కేంద్రాలు ఏర్పాటుకాలేదు. దీంతో ప్రజలు కనీస సౌకర్యాలు లేక ఇళ్లల్లోకి నీరు చేరినా అక్కడే ఉండక తప్పని పరిస్థితి నెలకొంది. గోదావరి వరద పెరిగేలోపు ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వున్నా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. వరద పెరిగాక సహాయ, పునరావాస కేంద్రాలకు తరలించవచ్చని అధికారులు భావించడంతో వందలాది గ్రామాల ప్రజలు ముంపు గ్రామాల్లోనే చిక్కుకుపోయారు.
Comments
Please login to add a commentAdd a comment