మత వివాదాల కుట్రలను అడ్డుకున్నాం | Governor Biswabhusan Harichandan Comments In Republic Day Celebrations | Sakshi
Sakshi News home page

మత వివాదాల కుట్రలను అడ్డుకున్నాం

Published Wed, Jan 27 2021 3:25 AM | Last Updated on Wed, Jan 27 2021 8:27 AM

Governor Biswabhusan Harichandan Comments In Republic Day Celebrations - Sakshi

విజయవాడలో జరిగిన గణతంత్ర వేడుకల్లో మాట్లాడుతున్న గవర్నర్‌ విశ్వభూషణ్‌

విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయ రంగాలకు, అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. కులం, మతం, రాజకీయాలకు అతీతంగా ప్రతి పథకానికి లబ్ధిదారులను పారదర్శకంగా, వంద శాతం సంతృప్త స్థాయిలో ఎంపిక చేస్తోంది. రాష్ట్రాభివృద్ధికి స్పష్టమైన అజెండా కలిగి ఉంది.    
– గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌  

సాక్షి, అమరావతి: ‘భిన్నత్వంలో ఏకత్వం అనేది మన సిద్ధాంతం. అయితే ప్రజల మధ్య మతపరమైన వివాదాల సృష్టికి కొందరు కుట్రలు చేస్తున్నారు. ఇది చాలా బాధ కలిగించింది. ఇలాంటి చర్యలను ప్రభుత్వం సమర్థవంతంగా అడ్డుకుంది’ అని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. సాహసోపేతమైన నాయకత్వం, నవతరం, యువతరంతో కూడిన రాష్ట్ర మంత్రి మండలి ఏపీని దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో పని చేస్తోందని చెప్పారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో మంగళవారం 72వ గణతంత్ర దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. కోవిడ్‌ విపత్కర సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రశంసనీయమన్నారు. కోవిడ్‌ టెస్టుల నిర్వహణలో దేశ వ్యాప్తంగా ప్రశంసలు పొందిందన్నారు. ప్రస్తుతం వ్యాక్సినేషన్‌ కార్యక్రమం సజావుగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకుందని, సంక్షేమ కార్యక్రమాలన్నీ ఎలాంటి ఆటంకం లేకుండా అమలవుతున్నాయని చెప్పారు. గవర్నర్‌ ఇంకా ఏమన్నారంటే..
గణతంత్ర వేడుకలకు వస్తున్న గవర్నర్‌ హరిచందన్‌. చిత్రంలో సీఎం జగన్, ఉన్నతాధికారులు   

ప్రాంతాల మధ్య సమతుల్య అభివృద్ధి 
► ప్రాంతీయ సమానాభివృద్ధి కోసం పరిపాలన వికేంద్రీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. విశాఖను పరిపాలన రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా ఏర్పాటు నిర్ణయంతో ప్రాంతాల మధ్య సమతుల్య అభివృద్ధి ఉండేలా చూస్తాం.
► రాష్ట్రం పెట్టుబడిదారులకు, పర్యాటకులకు అనుకూలమైన గమ్యస్థానంగా ఉండబోతోంది. 2020–23 కొత్త పారిశ్రామిక విధానం ద్వారా పరిశ్రమల స్థాపన, ఉపాధి కల్పనపై దృష్టి సారించింది. రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.   
► విజయవాడ నడిబొడ్డున భారత రాజ్యాంగకర్త బీఆర్‌ అంబేడ్కర్‌ 125 అడుగుల కాంస్య విగ్రహం, స్మారక ఉద్యానవనం ఏర్పాటు కాబోంది.  

రైతాంగానికి అన్ని విధాలా భరోసా
► ప్రభుత్వం ఇప్పటి వరకు వివిధ సంక్షేమ పథకాల కింద రూ.79,715.53 కోట్లను నేరుగా లబ్ధిదారులకు అందించింది. రైతు భరోసా కింద రెండు విడతల్లో 51.59 లక్షల మంది రైతులకు రూ.13,101 కోట్ల లబ్ధి.
► రాష్ట్రంలో 10,641 రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాల సరఫరా నుంచి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాల వరకు వసతుల కల్పన. 
► రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు. రూ.5,460 కోట్లతో రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ ద్వారా 14.96 లక్షల మెట్రిక్‌ టన్నుల వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు. వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల కింద 14.26 లక్షల మంది రైతులకు రూ.289 కోట్ల లబ్ధి. గత ప్రభుత్వ బకాయిలు రూ.904 కోట్ల చెల్లింపు. 
► ఉచిత విద్యుత్‌ సబ్సిడీకి రూ.17,430 కోట్లు వెచ్చింపు. ఉచిత విద్యుత్‌ కోసం రూ.1,700 కోట్లతో కొత్త ఫీడర్ల ఏర్పాటు. రూ.1,968 కోట్లతో ఉచిత పంటల బీమా. వైఎస్సార్‌ జలకళ పథకం ద్వారా రూ.4 వేల కోట్లతో బోర్ల తవ్వకానికి శ్రీకారం. జగనన్న జీవక్రాంతి పథకం కింద రూ.18.69 కోట్లతో 2,49,151 గొర్రెలు, మేకల పంపిణీ. వైఎస్సార్‌ జగనన్న భూ హక్కు ద్వారా భూముల సమగ్ర సర్వే కార్యక్రమం ప్రారంభం. 

విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు 
► జగనన్న అమ్మ ఒడి కింద 44.49 లక్షల తల్లుల ఖాతాల్లో రూ.13,121 కోట్లు జమ. జగనన్న విద్యా కానుక కింద రూ.648 కోట్లతో 42,34,322 మంది విద్యార్థులకు స్కూల్‌ కిట్లు. జగనన్న గోరుముద్ద కింద రూ.1,456 కోట్లతో 36,88,618 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, జగనన్న విద్యా దీవెన కింద ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.4,101 కోట్లు చెల్లింపు. జగనన్న వసతి దీవెన కింద హాస్టల్, భోజన ఖర్చులకు ఏటా రూ.20 వేల వరకు సాయం. ఇందుకు రూ.1,221 కోట్లు చెల్లింపు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం ప్రారంభం. 
► మనబడి నాడు–నేడు కింద 45,484 స్కూళ్లు, 471 జూనియర్‌ కళాశాలలు, 171 డిగ్రీ కాలేజీలు, 3,287 çహాస్టళ్లు, 55,607 అంగన్‌వాడీ కేంద్రాల్లో మూడు దశల్లో రూ.16,500 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన. 55,607 అంగన్‌వాడీ కేంద్రాలు వైఎస్సార్‌ ప్రీప్రైమరీ స్కూళ్లుగా మార్పు. 

సంక్షేమం కొత్తపుంతలు..
► రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుంచి ప్రభుత్వం రేషన్‌ డోర్‌ డెలివరీని ప్రారంభించనుంది. ఇందుకోసం రూ.830 కోట్ల వ్యయంతో ప్రభుత్వం 9,260 మొబైల్‌ వాహనాలను ప్రారంభించింది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలనే సంకల్పంతో ముందడుగు వేస్తోంది. ఇందులో భాగంగా గత డిసెంబర్‌ 25న 31 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీని చేపట్టింది. రెండు దశల్లో 17 వేల వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో 28.30 లక్షల ఇళ్లు వస్తాయి. మొదటి విడతగా రూ.28,084 కోట్లతో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం మొదలైంది. 
► వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి 95 శాతం మంది ప్రజలు. ఇప్పటిదాకా రూ.3 వేల కోట్లతో 9.89 లక్షల మందికి ప్రయోజనం. ఈ పథకం పరిధిలోకి వచ్చే వ్యాధుల సంఖ్య 1,059 నుంచి 2,436కు పెంపు. వైఎస్సార్‌ కంటి వెలుగు కింద రూ. 53.85 కోట్లతో 67.69 లక్షల మందికి కంటి పరీక్షలు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.2 వేల కోట్లతో 10,500 వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ల నిర్మాణానికి శ్రీకారం. 108, 104 సేవల కోసం 1,088 అంబులెన్స్‌ల కొనుగోలు. 
► వైఎస్సార్‌ ఆసరా పథకం కింద మొదటి దశలో 8.71 లక్షల డ్వాక్రా గ్రూపులకు చెందిన 87 లక్షల మంది మహిళల ఖాతాల్లో రూ.6,792 కోట్లు జమ. వైఎస్సార్‌ చేయూత కింద 45 నుంచి 60 ఏళ్ల లోపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 23 లక్షల మంది మహిళలకు నాలుగేళ్లలో రూ.75 వేల సాయంలో భాగంగా మొదటి విడత డబ్బు జమ.  
► వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కింద ఇప్పటి వరకు రూ.26,553 కోట్లు చెల్లింపు. 62 లక్షల మందికి ప్రయోజనం. మహిళలకు నామినేటెడ్‌ పోస్టులు, నామినేషన్‌ పనుల్లో 50 శాతం రిజర్వేషన్ల కల్పన. వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం కింద కాపు మహిళలకు ఏటా రూ.15 వేల చొప్పున ఇప్పటి వరకు రూ. 4,092 కోట్లు చెల్లింపు.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement