విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ప్రసంగిస్తున్న గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు 73 ఏళ్ల రాజ్యాంగ సారాన్ని మూడున్నరేళ్లలో ప్రభుత్వం అందించిందని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. వ్యవసాయం, విద్య, వైద్యంతో పాటు అన్ని రంగాలకు సమాన ప్రాధాన్యం ఇచ్చి అభివృద్ధి పథంలో నిలిపిందని, మనం అనుసరిస్తున్న విధానాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని చెప్పారు. మన ప్రభుత్వం చేతల ప్రభుత్వమని నిరూపిస్తూ దేశంలో ఎక్కడా లేనివిధంగా నిజమైన గ్రామ స్వరాజ్యాన్ని 43 నెలల్లోనే సాకారం చేశామన్నారు.
సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థ అందుకు దోహదం చేసిందన్నారు. ఇప్పటివరకు రూ.1.82 లక్షల కోట్లు అత్యంత పారదర్శకంగా లబ్ధిదారులకు చేరాయన్నారు. గురువారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి ప్రసంగించారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోపాటు మంత్రులు, అధికారులు ఇందులో పాల్గొన్నారు. గవర్నర్ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ..
పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్న గవర్నర్
వ్యవసాయంలో ముందడుగు
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న వ్యవసాయ రంగానికి, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. ఇప్పటి వరకు ఆర్బీకేల ద్వారా 29.77 లక్షల మంది రైతుల నుంచి 2.88 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.54,140 కోట్లు చెల్లించింది. వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ కింద కౌలు రైతులకు కూడా మేలు చేస్తోంది. మూడున్నరేళ్లలో 52.38 లక్షల మంది రైతులకు రూ.25,971 కోట్లు అందచేసింది.
దేశంలో సార్వత్రిక పంటల బీమాను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద గుర్తించిన అన్ని పంటలకు రైతుల తరపున ప్రీమియం వాటాను ప్రభుత్వమే చెల్లించింది. ఇప్పటివరకు రూ.6,684 కోట్ల విలువైన క్లెయిమ్‌లను పరిష్కరించింది. వైఎస్సార్ సున్నా వడ్డీ పంటరుణాల ద్వారా రూ.1,442.66 కోట్ల వడ్డీ రాయితీని నేరుగా 73.87 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేసింది.
విజయవాడలో జాతీయజెండాకు సెల్యూట్ చేస్తున్న గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్
గ్రామీణ పేదరిక నిర్మూలన
రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రత పింఛన్ల మొత్తాన్ని పెంచి నెలకు రూ.2,750 చొప్పున చెల్లిస్తోంది. ప్రతినెలా రూ.1,765 కోట్లను 64.06 లక్షల మంది లబ్ధిదారులకు ఒకటో తేదీన ఇంటివద్దే అందజేస్తోంది. మూడున్నరేళ్లలో పింఛన్ల కోసం రూ.63,303 కోట్లు ఖర్చు చేసింది. చిరు వ్యాపారులు, చేతివృత్తుల వారి కోసం జగనన్న తోడు పథకాన్ని ప్రవేశపెట్టింది. స్వయం సహాయక సంఘాలకు రూ.25,517 కోట్లను చెల్లించేందుకు వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రారంభించింది.
వైఎస్సార్ చేయూత కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేద మహిళల జీవనోపాధి కోసం రూ.18,750 కోట్లు వెచ్చించింది. వైఎస్సార్ కాపు నేస్తం కింద కాపు, బలిజ, తెలగ, ఒంటరి వర్గాలకు చెందిన 3,56,143 మంది మహిళలకు రూ.1,518 కోట్లను అందించింది. వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా 3,93,537 మందికి రూ.590 కోట్ల మొత్తాన్ని నేరుగా పంపిణీ చేసింది. రూ.40 కోట్ల వ్యయంతో 17.44 లక్షల ఎస్సీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తోంది.
రాజ్యాంగ నిర్మాతకు నివాళిగా విజయవాడలోని స్వరాజ్ మైదాన్‌లో రూ.268 కోట్ల అంచనా వ్యయంతో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తోంది. గ్రామ స్వరాజ్యం, పారదర్శక సేవలు లక్ష్యంగా ప్రవేశపెట్టిన సచివాలయాల వ్యవస్థతో 2.65 లక్షల మంది వలంటీర్లు ప్రజలకు నేరుగా సేవలు అందిస్తున్నారు.
నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు ద్వారా ఇప్పటివరకు రూ.33,544 కోట్లతో 18.63 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టగా 2.3 లక్షల గృహాలు పూర్తయ్యాయి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. సుమారు రూ.34 వేల కోట్లతో వైఎస్సార్ జగనన్న లేఅవుట్లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. పథకాలపై విస్తృత అవగాహన కల్పించేందుకు ఎమ్మెల్యేలు తమ పరిధిలోని అన్ని ఇళ్లను సందర్శించేలా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టింది.
గవర్నర్‌తో ఆప్యాయంగా సీఎం వైఎస్ జగన్
పరిశ్రమలు – వాణిజ్యం
రాష్ట్రంలో 2019 జూన్ నుంచి 2022 డిసెంబర్ 31 వరకు పెట్టుబడుల ప్రవాహం బలంగా ఉంది. రూ.54,236 కోట్ల పెట్టుబడితో 109 పెద్ద పరిశ్రమలను స్థాపించారు. ఎంఎస్‌ఎంఈ రంగంలో రూ.72,608 కోట్లతో 1,45,496 యూనిట్లు వచ్చాయి. వీటిద్వారా 11,19,944 మందికి ఉపాధి లభిస్తోంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ ‘టాప్ అచీవర్’గా ఎంపికైంది.
జూన్ 2022లో ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన రాష్ట్ర వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళికలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 స్థానంలో ఉంది. తలసరి ఆదాయం రూ.1,70,215కి పెరిగింది. మత్స్యకారుల కోసం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో 9 ఫిషింగ్ హార్బర్లు, మూడు ఓడరేవులను అభివృద్ధి చేస్తోంది.
ఉపాధిలో మిన్న..
ఉపాధిహామీలో భాగంగా 1,871 లక్షల పనిదినాలను కల్పించి ఆంధ్రప్రదేశ్ దేశంలో 5వ స్థానంలో ఉంది. రోడ్లు భవనాల శాఖ 5,181 కి.మీ పొడవైన వివిధ రహదారుల అభివృద్ధి పనులను రూ.2173 కోట్లతో చేపడుతోంది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద ఏడాది కాలంలో 992 కి.మీ. బీటీ రోడ్లు వేశారు.
జీవనాడికి ప్రాధాన్యం..
ఏపీకి జీవనాధారమైన పోలవరం ప్రాజెక్టుకు ప్రాధాన్యతనిస్తూ పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ, పెన్నార్ డెల్టా సిస్టం, కావలి కెనాల్, కనుపూరు కాలువల ఆయకట్టు స్థిరీకరణ పనులు పూర్తయ్యాయి. రూ.15,448 కోట్లతో బాబు జగ్జీవన్‌రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును చేపట్టింది.
పటిష్టంగా శాంతి భద్రతలు..
రాష్ట్ర పోలీసుల సమర్థతతో 2022లో నేరాలు గణనీయంగా తగ్గాయి. వినూత్న పోలీసింగ్ చర్యల ద్వారా ఇది సాధ్యమైంది. ఆపదలో ఉన్న మహిళలను తక్షణమే ఆదుకునేలా ప్రభుత్వం దిశ యాప్‌ను ప్రారంభించింది. ఇప్పటి వరకు 1.11 కోట్ల మంది యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. శాంతి భద్రతలను సమర్థంగా పరిరక్షించేందుకు 14 కొత్త పోలీసు సబ్ డివిజన్లు, 19 కొత్త సర్కిళ్లు, రెండు పోలీస్ స్టేషన్ల ఏర్పాటుతో పాటు 21 స్టేషన్లను అప్‌గ్రేడ్ చేసింది. వికేంద్రీకరణతో మొత్తం జిల్లాల సంఖ్య 26కి చేరింది. కొత్తగా ఏర్పాటైన వాటితో రెవెన్యూ డివిజన్లు 76కి పెరిగాయి.
వందేళ్ల తరువాత భూముల సర్వే
దేశంలో 100 ఏళ్ల తర్వాత సమగ్ర భూ సర్వే చేపట్టిన తొలి రాష్ట్రం మనదే. 2.26 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములు, 85 లక్షల ఎకరాల ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్లో విస్తరించిన 17,584 గ్రామాల్లో రీసర్వే ప్రాజెక్టు కొనసాగనుంది.
కనువిందుగా కవాతు
గణతంత్ర వేడుకల్లో నిర్వహించిన కవాతు ఆకట్టుకుంది. బెస్ట్ ఆర్డ్మ్ కంటింజెంట్‌గా ఇండియన్ ఆర్మీ నిలవగా, ఏపీఎస్పీ కర్నూలు బెటాలియన్ రెండో స్థానంలో నిలిచింది. నాన్ ఆర్డ్మ్ కంటింజెంట్ విభాగంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్, ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ (బాయ్స్) తొలి రెండు స్థానాలు సాధించాయి.
ఈ ఏడాది నుంచి కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతూ పరేడ్‌లో పాల్గొన్న ఒడిశా స్టేట్ పోలీస్ విభాగానికి ప్రత్యేక ప్రోత్సాహక బహుమతి అందజేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారామ్, శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు, మంత్రులు బొత్స సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న శకటాలు
గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించిన 13 శకటాలు రాష్ట్ర ప్రగతి, సంక్షేమానికి నిదర్శనంగా నిలిచాయి. గృహ నిర్మాణ శాఖ శకటం ప్రథమ బహుమతిని కైవశం చేసుకోగా పాఠశాల విద్యాశాఖ (డిజిటల్ విద్యాబోధన) శకటం రెండో స్థానంలో నిలిచింది. ఊరూరా అభివృద్ధి– ఇంటింటా సమృద్ధి నేపథ్యంతో రూపుదిద్దుకున్న గ్రామ, వార్డు సచివాలయాల శాఖ శకటం మూడో స్థానం దక్కించుకుంది.
మొదటి, మూడో ఉత్తమ శకటాలకు గృహ నిర్మాణ శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి గవర్నర్ చేతుల మీదుగా బహుమతులను అందుకోగా రెండో ఉత్తమ శకటానికి పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ విద్యార్థులతో కలసి స్వీకరించారు.
చదువులకు చేయూత
పేదరికం కారణంగా చదువులు ఆగిపోరాదని అమ్మ ఒడితోప్రభుత్వం ఏటా రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేస్తోంది. ఇప్పటి దాకా రూ.19,617 కోట్లను నేరుగా 44.49 లక్షల మంది తల్లుల ఖాతాల్లో జమ చేసింది. 84 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూరుతోంది. మన బడి – నాడు నేడు ద్వారా 45,484 ప్రభుత్వ పాఠశాలలు, 471 జూనియర్ కళాశాలలు, 151 డిగ్రీ కళాశాలలు, 3,287 హాస్టళ్లు, 55,607 అంగన్‌వాడీల్లో రూ.17,835 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాలను కల్పించింది. జగనన్న గోరుముద్ద కోసం ఇప్పటిదాకా రూ.3,239 కోట్లు ఖర్చు చేసింది. జగనన్న విద్యా కానుక ద్వారా 47 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూర్చేందుకు రూ.2,368 కోట్లు వెచ్చించింది.
జగనన్న విద్యా దీవెన కింద మొత్తం ఫీజులను రీయింబర్స్ చేస్తూ ఇప్పటివరకు 24,74,544 మంది విద్యార్థులకు రూ.9,051 కోట్లు చెల్లించింది. డిజిటల్ లెర్నింగ్ ఆవశ్యకతను గుర్తించి 4,59,564 మంది 8వ తరగతి విద్యార్థులకు రూ.778 కోట్ల విలువైన ప్రీలోడెడ్ బైజూస్ కంటెంట్‌తో పాటు రూ.688 కోట్ల విలువైన 5,18,740 ట్యాబ్‌లను పంపిణీ చేసింది.
విద్యార్థులతో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఆరోగ్యం – కుటుంబ సంక్షేమం
రాష్ట్రంలో 10,032 వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, 1,142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 177 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 53 ఏరియా ఆసుపత్రులు, 12 జిల్లా ఆసుపత్రులు, 11 టీచింగ్, ఇతర స్పెషాలిటీ ఆసుపత్రుల ద్వారా సేవలందిస్తోంది. ప్రతి మండలంలో రెండు పీహెచ్‌సీలు ఉండేలా కొత్తగా 88 ఆస్పత్రులను మంజూరు చేసింది. నాడు – నేడుతోపాటు కొత్త వైద్య కాలేజీల కోసం రూ.16,823 కోట్లు వ్యయం చేస్తోంది. వచ్చే రెండేళ్లల్లో ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 28కి పెరగనుంది.
16 హెల్త్ హబ్స్ ఏర్పాటు ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యసేవలను అందించనుంది. వైద్య శాఖలో ఖాళీలు లేకుండా 48,639 పోస్టులను భర్తీ చేసింది. చికిత్స వ్యయం రూ.వెయ్యి దాటిన అన్ని సేవలను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తెచ్చింది. రాష్ట్ర జనాభాలో దాదాపు 95 శాతం మంది పథకం పరిధిలో ఉన్నారు. 104, 108 సేవలను పునరుద్ధరించి 1,444 వాహనాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. డాక్టర్ వైఎస్సార్ తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలతోపాటు ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment