సంక్షేమ సర్కారు ఆదర్శ పాలన | Biswabhusan Harichandan says Andhra Pradesh is his second home | Sakshi
Sakshi News home page

సంక్షేమ సర్కారు ఆదర్శ పాలన

Published Wed, Feb 22 2023 3:35 AM | Last Updated on Wed, Feb 22 2023 3:35 AM

Biswabhusan Harichandan says Andhra Pradesh is his second home - Sakshi

మంగళవారం విజయవాడలో జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ను సత్కరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: సమాజంలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన దేశానికి ఆదర్శ­ప్రాయమని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌ను దేశానికి రోల్‌ మోడ­ల్‌గా తీర్చిదిద్దారని అభినందించారు. రాజకీయ నేతల అంతిమ లక్ష్యం ప్రజా సంక్షేమం, అభివృద్ధి, సమాజ శ్రేయస్సే కావాలని, సీఎం జగన్‌ దీన్ని ఆచ­రణలో చూపిస్తున్నారని చెప్పారు.

ఛత్తీస్‌­గఢ్‌ గవ­ర్నర్‌గా బదిలీపై వెళ్తున్న హరి­చంద­న్‌కు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విజయవాడలో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ గవర్నర్‌ను ఘనంగా సత్కరించి జ్ఞాపిక బహూకరించారు. కార్యక్రమంలో గవర్నర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే..

అందరికీ సంక్షేమ ఫలాలు ఆశ్చర్యమే
రాష్ట్ర ప్రజల కోసం ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుండటం సంతోషదాయకం. సమాజంలో ఏ వర్గాన్ని విస్మరించకుండా సంక్షేమ పథకాలను  అందిస్తుండటం నిజంగా అబ్బురం. వీటిపై మేం చాలాసార్లు చర్చించుకున్నాం. ఇన్ని సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేసేందుకు అన్ని నిధులు ఎలా సమకూరుస్తున్నారని ముఖ్యమంత్రి జగన్‌ను అడిగితే అంతా దేవుడి ఆశీర్వాదమని వినమ్రంగా బదులిచ్చారు. చిత్తశుద్ధితో పథకాలను ఆయన విజయవంతంగా అమలు చేస్తున్నారు.

దేశానికి ఆదర్శంగా ఆర్బీకేలు
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు దేశానికి ఆదర్శప్రాయం. ఆయన కోరికపై ఓసారి వాటిని సందర్శించి ముగ్దుడినయ్యా.  సమాజంలో దాదాపు 70 శాతం ఉన్న రైతుల అన్ని అవసరాలను ఒకేచోట తీర్చేలా ఆర్బీకేలను తీర్చిదిద్దారు.

భూసార పరీక్షలు నిర్వహణ నుంచి విత్తనాలు, ఎరువుల పంపిణీ వరకు అన్ని సేవలు అక్కడే అందిస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా రైతులు తమ పంటలను ఆర్బీకేల ద్వారా సరైన ధరకు విక్రయించగలుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టిన రైతు భరోసా కేంద్రాలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసినప్పుడు చెప్పా. 

కోవిడ్‌ సమర్థంగా కట్టడి
కోవిడ్‌ మహమ్మరిని సమర్థంగా కట్టడి చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయవంతమయ్యారు. అన్ని వ్యవస్థలు, ప్రభుత్వ శాఖలను సమర్థంగా సమన్వయపరిచారు. వైద్యులు, వైద్య సిబ్బంది, సమాజంలో వివిధ వర్గాలు స్పందించిన తీరు అమోఘం. ఆరోగ్యశ్రీ ఓ అద్భుతమైన పథకం. అదే తరహాలో కేంద్రం ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని అమలు చేస్తోంది. 

రాజ్యాంగ సంప్రదాయాన్ని పాటించారు
సీఎం జగన్‌ సదా రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమ కోసం పని చేస్తున్నారు. ప్రజల సంక్షేమం, రాష్ట్రం, దేశం అభివృద్ధి, సమాజానికి మేలు చేయడమే రాజకీయ నేతల అంతిమ లక్ష్యం కావాలి. అవన్నీ ముఖ్యమంత్రి జగన్‌ ఆచరణలో చూపిస్తున్నారు. గవర్నర్‌తో సత్సంబంధాలను కొనసాగించి గొప్ప రాజ్యాంగ సంప్రదాయాన్ని పాటించారు.

ప్రజలకు సంబంధించిన పలు అంశాలపై మేం తరచూ సంప్రదింపులు జరిపాం. ప్రజల శ్రేయస్సే అత్యంత ప్రాధాన్యత అంశంగా మేమిద్దరం భావించాం. అందుకే సమస్యల పరిష్కారం కోసం మెరుగైన రీతిలో చర్యలు తీసుకోగలిగాం. ముఖ్యమంత్రి జగన్‌తో అనుబంధాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటా. ఆయన్ను మా కుటుంబ సభ్యుడిగా భావిస్తా.

ప్రజా ప్రభుత్వం సజావుగా పని చేసేలా..
గవర్నర్‌ హోదాలో శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య సుహృద్భావపూర్వక వాతావరణాన్ని నెలకొల్పి ప్రజా ప్రభుత్వం సజావుగా సాగేలా చొరవ తీసుకున్నా. అందులో చాలావరకు సఫలీకృతమైనట్లు భావిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్‌ను విడిచివెళ్లడం కాస్త బాధగానే ఉంది. విధి నిర్వహణలో భాగంగా చత్తీస్‌గఢ్‌ వెళ్తున్నా. ఏపీ ప్రజలు కనబరిచిన ప్రేమాభిమానాలు, ఆదరణను ఎప్పటికీ మరవలేను. ఆంధ్రప్రదేశ్‌ను నా రెండో ఇల్లుగా భావిస్తున్నా. నాకు సహకరించిన సీఎం జగన్, మంత్రులు, ప్రజలందరికీ కృతజ్ఞతలు. 

ప్రజా ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం
► గవర్నర్‌ హరిచందన్‌ వీడ్కోలు కార్యక్రమంలో సీఎం జగన్‌
► రాజ్యాంగ విలువలకు పెద్దపీట వేశారు
► వ్యవస్థల మధ్య సమన్వయం ఎలా ఉండాలో చూపారు

గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రజా ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందించి రాజ్యాంగ విలువలకు పెద్దపీట వేశారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. గవర్నర్‌గా మూడేళ్ల పదవీ కాలంలో రాజ్యాంగ వ్యవస్థల మధ్య సమన్వయం ఎలా ఉండాలో ఆచరణలో గొప్పగా చూపించారన్నారు.

ఓ ఆత్మీయుడైన పెద్దమనిషిగా గవర్నర్‌ వ్యవస్ధకు నిండుతనం తెచ్చారని ప్రశంసించారు. చత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా వెళుతున్న విశ్వభూషణ్‌ హరిచందన్‌కు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు, ప్రభుత్వం తరపున శుభాకాంక్షలతోపాటు ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు చెప్పారు. గవర్నర్‌కు వీడ్కోలు కార్యక్రమం సందర్భంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే..
గవర్నర్‌ వీడ్కోలు సభలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

విద్యావేత్త, న్యాయ నిపుణుడు, స్వాతంత్య్ర సమరయోధుడు..
గవర్నర్లకు, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య సంబంధాలపై ఈమధ్య కాలంలో చాలా సందర్భాలలో వార్తలు చూస్తూనే ఉన్నాం. మన రాష్ట్రం మాత్రం అందుకు భిన్నం. ఓ తండ్రిలా, పెద్దలా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఇక్కడి ప్రజా ప్రభుత్వానికి మన గవర్నర్‌ సంపూర్ణంగా సహకరించి వాత్సల్యం చూపారు. గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఉన్నత విద్యావేత్త, న్యాయ నిపుణుడు. వీటన్నింటికీ మించి ఆయన స్వాతంత్య్ర సమరయోధుడు కూడా.

ఒడిశా ప్రభుత్వంలో నాలుగుసార్లు మంత్రిగా పని చేసి తాను బాధ్యతలు నిర్వహించిన ప్రతి శాఖలోనూ తనదైన ముద్ర చూపారు. ఒడిశా అసెంబ్లీకి ఐదుసార్లు ఎన్నికైన ఆయన 2000 ఎన్నికల్లో సమీప ప్రత్యర్ధిపై 95 వేల మెజార్టీ సాధించి రికార్డు సృష్టించారు. న్యాయవాదిగా కూడా పనిచేసిన బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఒడిశా హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ యాక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరించి  న్యాయవాదుల సంక్షేమం, హక్కుల కోసం నిరంతరం పాటుపడ్డారు.

ఆయన సతీమణి సుప్రవ హరిచందన్‌ వెన్నుదన్నుగా నిల్చి ఎన్నో విజయాలకు కారణమయ్యారు. ఆమెకి కూడా రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వం, నా కుటుంబం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో విశ్వభూషణ్‌ హరిచందన్‌ దంపతులు నిండు నూరేళ్లు జీవించి ఇంకా ఎంతో సేవ చేయాలని మనసారా కోరుకుంటున్నా. ఆయనతో పంచుకున్న తీపి జ్ఞాపకాలు మా మనసులో ఎప్పటికీ నిలిచి ఉంటాయి.

వెంకన్న చిత్రపటం బహూకరణ
వీడ్కోలు సందర్భంగా తంజావూరు శైలిలో రూపొందించిన తిరుమల శ్రీవారు, పద్మావతి అమ్మవార్ల చిత్రాలతో కూడిన మెమెంటోను గవర్నర్‌ హరిచందన్‌కు సీఎం జగన్‌  బహూకరించారు. జ్ఞాపికను అందించే ముందు సీఎం జగన్‌ తన పాదరక్షలు విడిచి పెట్టి చిత్రపటాన్ని అందించగా గవర్నర్‌ కూడా తన పాదరక్షలను వదిలేసి జ్ఞాపికను స్వీకరించారు. గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ గౌరవార్థం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందులో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, వివిధ వర్గాల ప్రముఖులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement