విప్లవాత్మక పరిపాలన  | CM YS Jagan direction in YSRCP Leaders conference | Sakshi
Sakshi News home page

విప్లవాత్మక పరిపాలన 

Published Tue, Oct 10 2023 3:59 AM | Last Updated on Tue, Oct 10 2023 12:49 PM

CM YS Jagan direction in YSRCP Leaders conference - Sakshi

విజయవాడలో జరిగిన వైఎస్సార్‌సీపీ ప్రతినిధుల సదస్సులో అభివాదం చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా విప్లవాత్మక మార్పులతో 52 నెలలుగా సుపరిపాలన అందిస్తున్నామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. గత పాలకులకు భిన్నంగా మేనిఫెస్టోలో పొందుపరిచిన 99 శాతం వాగ్దానాలను అమలు చేయడం ద్వారా జగన్‌ చెప్పాడంటే చేస్తాడని.. మాట నిలబెట్టుకుంటాడని.. కష్టమైన, నష్టమైనా అండగా ఉంటాడనే మంచి పేరును దేవుడి దయతో తెచ్చుకోగలిగామన్నారు. సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా ప్రజలకు మన ప్రభుత్వం చేసిన మంచే మన ధైర్యం.. మన బలం.. మన ఆత్మవిశ్వాసమని పార్టీ ప్రతినిధులకు ఉద్బోధించారు.

సోమవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన వైఎస్సార్‌సీపీ ప్రతినిధుల సదస్సులో గత 52 నెలలుగా అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా ప్రజలకు చేసిన మంచిని వివరిస్తూ  సీఎం జగన్‌ సుదీర్ఘంగా ప్రసంగించారు. మనం చేసిన మంచితో ప్రతి ఇంట్లో.. ప్రతి గ్రామంలో.. ప్రతి నియోజకవర్గంలో మార్పులు కళ్లెదుటే కనిపిస్తున్నప్పుడు 175కు 175 శాసనసభ స్థానాల్లోనూ గెలుపే లక్ష్యంగా అడుగులు వేయాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులను సమన్వయం చేసుకుంటూ ప్రతి గ్రామాన్ని సందర్శించి ప్రతి ఇంటికీ వెళ్లి మనం చేసిన మంచిని వివరిస్తూ ప్రతిపక్షాల తీరును ఎండగట్టి అక్కచెల్లెమ్మల ఆశీస్సులు తీసుకుంటూ అడుగులు ముందుకు వేయించాల్సిన బాధ్యత మీ భుజస్కందాలపై పెడుతున్నానని మార్గనిర్దేశం చేశారు. బహుశా మార్చి, ఏప్రిల్‌లో ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. టీడీపీ, జనసేన సహా విపక్షాల తీరుపై సీఎం జగన్‌ పదునైన విమర్శలతో విరుచుకుపడ్డారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేస్తూ ప్రజలతో మరింతగా మమేకమయ్యేందుకు చేపట్టనున్న ఎనిమిది కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ప్రకటించారు. సదస్సులో సీఎం జగన్‌ ఏమన్నారంటే..  

అధికారం మనకు బాధ్యత మాత్రమే.. 
దేవుడి దయతో ప్రజలిచ్చిన అధికారం అన్నది మనకి బాధ్యతను మాత్రమే నేరి్పందని తెలియచేస్తూ వారికి తొలి సేవకుడిగా మీ ముందు మాట్లాడుతున్నా. అలా బాధ్యతగా వ్యవహరించాం  కాబట్టే ఈ 52 నెలల్లో పౌరసేవల డెలివరీ విధానం, డీబీటీ ద్వారా విప్లవాత్మక మార్పులు తెచ్చాం. మూడు ప్రాంతాల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ మూడు రాజధానులను ప్రకటించే నిర్ణయం తీసుకున్నాం. 26 జిల్లాలను ఏర్పాటు చేశాం.

ఎప్పుడూ చూడని విధంగా గ్రామ స్ధాయిలో సచివాలయ వ్యవస్ధ, ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ వ్యవస్ధను తేగలిగాం. ప్రభుత్వ పథకాలను అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికీ అందించగలుగుతామా? ఇది సాధ్యమేనా? అనుకునే పరిస్థితుల నుంచి ఎక్కడా లంచాలు, వివక్షకు తావులేకుండా పారదర్శకంగా అందించే విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టగలిగాం.   

డీబీటీలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకు 75 శాతానికిపైనే 
ఎన్నికల సమయంలో మాత్రమే నాయకులు మేనిఫెస్టో గురించి చెబుతారు. ఎన్నికలు కాగానే చెత్తబుట్టలో వేసిన గత పాలకులకు భిన్నంగా మేనిఫెస్టోలో చెప్పిన 99 శాతం వాగ్దానాలు అమలు చేయడం ద్వారా జగన్‌ చెప్పాడంటే చేస్తాడని, మాట నిలబెట్టుకుంటాడని, కష్టమైనా నష్టమైనా అండగా ఉంటాడనే మంచి పేరును దేవుడి దయతో నాలుగున్నరేళ్ల పాలనలో తెచ్చుకోగలిగాం.

అన్ని సామాజిక వర్గాలు, ప్రాంతాలను గుండెల నిండా ప్రేమతో అభిమానించాం. నా ఎస్సీలు, నా ఎస్టీలు, బీసీలు, మైనార్టీలంటూ.. ప్రతి మాటకు ముందు నా అనే మాటకు అర్ధం చెబుతూ రూ.2.35 లక్షల కోట్లను డీబీటీ ద్వారా బటన్‌ నొక్కి నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేశాం. నా అనే మాటకు అర్ధం చెబుతూ  నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకు 75 శాతానికి పైచిలుకు ఇవ్వగలిగాం.  

80 శాతానికిపైగా ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే  
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రం మొత్తమ్మీద ఇప్పటివరకూ 4 లక్షల  ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఉంటే కేవలం ఈ నాలుగున్నరేళ్లలో మరో 2.07 లక్షలు ప్రభుత్వ ఉద్యోగాలను కొత్తగా మీ బిడ్డ ప్రభుత్వం ఇవ్వగలిగింది. ఇందులో నా  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఏకంగా 80 శాతం పైచిలుకు ఉద్యోగాలను ఇవ్వగలిగాం. 31 లక్షల ఇళ్ల పట్టాలను నా అక్కచెల్లెమ్మల చేతుల్లో పెట్టగలిగాం. 22 లక్షల ఇళ్లు ఈ రోజు వారి పేరుతో వేగంగా కడుతున్నాం.

ఇందులో అత్యధికంగా 80 శాతం పైచిలుకు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మల చేతుల్లో పెట్టగలిగాం. సామాజిక న్యాయం అనే పదానికి అర్ధం చెబుతూ గతంలో ఎప్పుడూ చూడని విధంగా నామినేటెడ్‌ పోస్టులు, నామినేటెడ్‌ కాంట్రాక్టుల్లో ఏకంగా 50 శాతం నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చట్టం చేసి మరీ ఇవ్వగలిగాం.   

పేదలకు తోడుగా నిలబడ్డాం.. 
విద్య, వైద్య వ్యవసాయ రంగాలు బాగుంటేనే మారుమూల పల్లెల్లో పేద కుటుంబాలకు మంచి జరుగుతుందని నమ్మి ఈ మూడు రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. పేదరికం పోవాలని, పేదరికంలో ఉన్నవాళ్లు పైకి రావాలని, పేదరికం అడ్డు రాకూడదని ఈ మూడు స్తంభాలను బలపర్చాం. రైతులు, రైతు కూలీలు, మహిళలకు తోడుగా నిలిచాం. నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రాంతాలవారీగా, సామాజిక వర్గాల వారీగా గుర్తించిన ప్రతి సమస్యకూ ఈ 52 నెలల కాలంలో పరిష్కారం చూపగలిగాం.    

నా సేనానులు.. దళపతులు 
ఈ రోజు ఇక్కడికి వచ్చిన పార్టీ జిల్లా అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, రీజనల్‌ కో ఆర్డినేటర్లు, జేసీఎస్‌ కో ఆర్డినేటర్లు, నియోజకవర్గాల పరిశీలకులు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ అధ్యక్షులు, ఏఎంసీ అధ్యక్షులు, పార్టీ సీనియర్‌ నేతలు, జెడ్పీటీసీలు,ఎంపీపీలు, జిల్లా పరిషత్‌ అధ్యక్షులు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్లు, కార్పొరేటర్లు.. ఒక్క మాటలో చెప్పాలంటే పార్టీ గుర్తు మీద ఎన్నికైన మండలం, ఆపై స్థాయిలో ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు, వారితో పాటు  సమావేశానికి వచ్చిన వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నా మంత్రిమండలి సహచరులందరికీ మీ తమ్ముడిగా, అన్నగా నిండు మనసుతో స్వాగతం పలుకుతున్నా. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ రెండు మెట్లు ఎదిగి మరో రెండు మెట్లు ఎదగడానికి సిద్ధంగా ఉన్న ప్రజాసేవకులు, నా సేనానులే. ఇక్కడకు రాలేని నా కుటుంబ సభ్యులైన ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు, కార్యకర్తలు అందరూ నా దళపతులే.  

జనవరి 1 నుంచి మరో నాలుగు కార్యక్రమాలు
అక్టోబరు 25 నుంచి మొదలయ్యే నాలుగు కార్యక్రమాలు జనవరి 15 వరకు జరుగుతాయి. అవే కాకుండా జనవరి 1 నుంచి మరో నాలుగు కార్యక్రమాలు కూడా మొదలవుతాయి.  

జనవరి 1 నుంచి పెన్షన్‌ పెంపు.. 
నా అవ్వాతాతలకు, నా వితంతు అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ రూ.3,000 వరకూ పెంచుకుంటూ పోతామని చెప్పిన పెన్షన్‌ పెంపు కార్యక్రమానికి జనవరి 1న శ్రీకారం చుడతాం. ఈ కార్యక్రమం జనవరి 10వ తారీఖు వరకు 10 రోజుల పాటు జరుగుతుంది. గత ప్రభుత్వ హయాంలో కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్‌లు ఇస్తే ఇవాళ మీ బిడ్డ హయాంలో 66 లక్షల మందికి పెన్షన్‌లిస్తున్నాడన్న విషయాన్ని చెప్పాలి. మన ప్రభుత్వం రాకమునుపు ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు పెన్షన్‌ల ఖర్చు కేవలం రూ.400 కోట్లు కాగా ఈ రోజు మీ బిడ్డ చిరునవ్వుతో భరిస్తున్న భారం నెలకు అక్షరాలా రూ.2,000 కోట్లు అని వివరించాలి.   

జనవరి 10 నుంచి వైఎస్సార్‌ చేయూత
జనవరి 10 నుంచి రెండో కార్యక్రమం వైఎస్‌ఆర్‌ చేయూత మొదలవుతుంది. జనవరి 10 నుంచి జనవరి 20 వరకు ప్రతి గ్రామంలోనూ జరుగుతుంది. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ వైఎస్‌ఆర్‌ చేయూత కార్యక్రమం ద్వారా ఇప్పటికే మూడు దఫాల్లో రూ.14,129 కోట్లు ఇచ్చాం. జనవరిలో ఇవ్వబోయేది కూడా కలుపుకొంటే ఈ ఒక్క కార్యక్రమానికే ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో  రూ.75 వేలు ఇచ్చినట్లవుతుంది. అంతే కాకుండా వారికి బ్యాంకు రుణాలతో తోడ్పాటు అందిస్తున్నాం. అక్కచెల్లెమ్మలు విజయగాధలను అందరికీ తెలియచేసే ఈ పండుగ వాతావరణంలో మీరందరూ భాగస్వాములై వారి ఆశీస్సులు తీసుకోవాలి.  

జనవరి 20 నుంచి వైఎస్సార్‌ ఆసరా.. 
జనవరి 20 నుంచి 30వతేదీ వరకు వైఎస్‌ఆర్‌ ఆసరా కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం చివరి విడత నిధుల్ని చెల్లిస్తూ జగనన్న మాట నిలబెట్టుకుంటున్నాడని చెప్పాలి. నాలుగు దఫాలుగా నా అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటానని చెప్పా. మన ప్రభుత్వం రాకమునుపు పొదుపు సంఘాల ఎన్‌పీఏలు, అవుట్‌ స్టాండింగ్‌లు 18 శాతం కాగా ఈరోజు కేవలం 0.3 శాతం మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే మూడు దఫాలుగా ఆసరా కార్యక్రమం ద్వారా రూ.19,178 కోట్లు అక్కచెల్లెమ్మల చేతిలో పెట్టాం. చివరి విడతగా మరో రూ.6500 కోట్లు నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన మాట ప్రకారం జనవరి 20 నుంచి 30 వరకు ఆసరా ద్వారా చెల్లించి తోడుగా ఉండే కార్యక్రమం జరుగుతుంది. కేవలం వైఎస్‌ఆర్‌ ఆసరా ద్వారానే దాదాపు రూ.26 వేల కోట్లు వారి చేతిలో పెట్టాం. సున్నావడ్డీ ద్వారా మరో రూ.5వేల కోట్లు ఇచ్చాం. 

ఫిబ్రవరి: మళ్లీ జగనన్ననే తెచ్చుకుందాం  
ఇక ఫిబ్రవరిలో మళ్లీ జగనన్ననే తెచ్చుకుందాం కార్యక్రమాన్ని చేపట్టాలి. ఇది జగనన్న పంపించిన మేనిఫెస్టో అని చెబుతూ ప్రతి ఇంటికీ తీసుకుని వెళ్లే కార్యక్రమం చేస్తాం. ఫిబ్రవరిలో ఈ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత మార్చిలో ఎన్నికలకు సన్నద్ధం కావాలి కాబట్టి మనం చేసిన మంచిని గ్రామ గ్రామాన, ఇంటింటా అందరికీ తెలియజేసేలా, పర్యవేక్షించే బాధ్యతను మీ భుజస్కంధాలపై మోపుతున్నాం. మీలో ప్రతి ఒక్కరూ ఇక్కడ తెలుసుకున్న ప్రతి అంశంపైన గ్రామస్ధాయిలో అవగాహన కలిగించాలి.   

ఎన్నికల తర్వాతా.. జనంలోనే 
మన మాదిరిగా ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా నిరంతరం జనంలో ఉన్న పార్టీ దేశంలో మరొకటి లేదని సగర్వంగా తెలియజేస్తున్నా. కోవిడ్‌ సమయంలో ఆదాయాలు తగ్గినా కూడా మాటకు కట్టుబడి ప్రజలకు మంచి చేశాం. మన బలం మాట నిలబెట్టుకోవడం. మన బలం విశ్వసనీయత అన్న పదానికి నిజమైన అర్ధం చెప్పడం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుపేద వర్గాలకు నిండు మనసుతో చేసిన మంచి మన బలం. 87 శాతం పైచిలుకు ఇళ్లల్లో మనం చేసిన మంచే కనిపిస్తుంది. నాలుగున్నరేళ్లలో మనం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో కళ్లెదుటే స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు మరి వై నాట్‌ 175? మనమంటే గిట్టని వారు ఎన్ని చెబుతున్నా అది కచ్చితంగా సాధ్యమే.   

ఇక మరింతగా ప్రజల్లోకి..
ఇప్పుడు అక్టోబరులో ఉన్నాం. బహుశా ఎన్నికలు మార్చి, ఏప్రిల్‌లో జరుగుతాయి. ఇన్ని అడుగులు మనం వేశాం. రాబోయే నెలల్లో వేసే అడుగుల గురించి మీ అందరితో నా ఆలోచనలను ఇవాళ పంచుకుంటా. వాటిని మీరు గ్రామస్ధాయిలోకి తీసుకెళ్లి కచ్చితంగా, బాగా అమలయ్యేలా మీరు పర్యవేక్షించాలి. ఈ బాధ్యతను మీరు తీసుకోవాలి. గ్రామ స్ధాయిలో సమావేశాలను నిర్వహించి గొప్పగా అడుగులు పడేలా చర్యలు తీసుకోవాలి.   

జగనన్న ఆరోగ్య సురక్ష.. 
నాలుగు కార్యక్రమాల్లో ఒకటి.. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం. ఇది ఇప్పటికే  జరుగుతోంది. మీరు మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మీవల్ల ప్రజలకు మరింత ఉపయోగం ఈ కార్యక్రమం ద్వారా జరగాలి. గత నెల 30న మొదలుపెట్టిన ఈ కార్యక్రమం నవంబరు 10 వరకు కొనసాగుతుంది. ప్రివెంటివ్‌ కేర్‌లో దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా అడుగులు వేస్తున్నాం. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా సచివాలయాల పరిధిలో 15 వేల క్యాంపులను అర్బన్, రూరల్‌ ప్రాంతాల్లో నిర్వహిస్తున్నాం.

మొత్తంగా 1.60 కోట్ల ఇళ్లను కవర్‌ చేస్తున్నాం. ప్రతి గ్రామాన్ని, ప్రతి ఇంటిని మ్యాపింగ్‌ చేస్తున్నాం. ఉచిత పరీక్షలకు శ్రీకారం చుట్టాం. ప్రతి గ్రామంలో ప్రతి ఇంటినీ జల్లెడ పడుతున్నాం. ఆ ఇంట్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా వారిని చేయిపట్టుకుని నడిపించడమే కాకుండా అన్ని రకాలుగా తోడుగా ఉంటూ అడుగులు వేయిస్తున్నాం. మొత్తం 5 దశలలో నిర్వహిస్తున్నాం. ఐదో దశ కీలకం. మీరు ఎక్కువగా నిమగ్నం కావాల్సిన దశ ఇదే. ఇక మీదట ఈ కార్యక్రమం నిరంతర ప్రక్రియగా జరుగుతుంది. గ్రామాల్లో ప్రతి 6 నెలలకొకమారు ఈ క్యాంపు జరుగుతుంది.  

‘‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌..’’ 
ఇక రెండో కార్యక్రమం.. ‘‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’’. ప్రజలందరి ఆశీస్సులతో వారికి మరింత సేవ చేయడానికి, మరింత మంచి చేయడానికి కొనసాగాల్సిన అవసరాన్ని వివరించే కార్యక్రమమే ఇది. ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలని వివరిస్తూ ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ అనే కార్యక్రమం నవంబరు 1 తేదీ నుంచి మొదలవుతుంది. డిసెంబరు 10 వరకు దాదాపు 40 రోజులపాటు జరుగుతుంది. ఇందులో రెండు ముఖ్యమైన దశలుంటాయి. మొదటిది మన గ్రామాల్లోని సచివాలయాలను సందర్శించడం. రెండో దశగా రాష్ట్రంలో ఉన్న 1.60 కోట్ల ఇళ్లకు, ప్రతి గడపకూ వెళ్లేలా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి.

గ్రామంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఎంతమందికి లబ్ధి జరిగింది? వీటికి సంబంధించిన బోర్డుల ఆవిష్కరణ కార్యక్రమంలో మీరంతా పాల్గొనాలి. ఆ తర్వాత  గ్రామంలో పార్టీ జెండా ఎగరవేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. స్ధానిక పెద్దల ఇంటికి వెళ్లి వారి ఆశీస్సులు పొందాలి. ఈ 52 నెలల కాలంలో గ్రామం నుంచి రాజధానుల వరకు మన ప్రభుత్వం ఎన్నెన్ని మార్పులు తెచ్చిందో ఇటీవల స్వాతంత్ర దినోత్సవం రోజు నా ప్రసంగంలో సుదీర్ఘంగా వివరించా.

అందులో ప్రతి అంశాన్ని మండలస్ధాయి నాయకత్వం అర్ధం చేసుకోవాలి. గ్రామ స్ధాయి నాయకత్వానికే కాకుండా పెద్దలందరికీ వివరించే కార్యక్రమం జరగాలి. సచివాలయ కన్వీనర్లు, వలంటీర్లు, గృహ సారధులు ప్రతి ఇంటినీ, ప్రతి గడపనూ విధిగా సందర్శించాలి. 99 శాతం వాగ్ధానాలను పూర్తి చేసిన విషయాన్ని మేనిఫెస్టో చూపిస్తూ వివరించాలి. అదే సమయంలో మన సచివాలయ కన్వీనర్లు, గృహ సారధులు  2014లో గత ప్రభుత్వం ప్రకటించిన మేనిఫెస్టోను కూడా చూపించాలి. ప్రతి వాగ్ధానాన్ని వాళ్లు ఎలా ఎగ్గొట్టారో, ప్రజలను ఎలా మోసం చేశారో వివరించాలి. ఆ మోసాల గురించి ప్రతి ఇంట్లో టైం తీసుకుని వినయంగా, సుదీర్ఘంగా చెప్పే కార్యక్రమం చేయాలి.   

బస్సు యాత్రలు.. 
మూడో కార్యక్రమంగా బస్సు యాత్రలు అక్టోబరు 25వ తేదీన మొదలవుతాయి. డిసెంబరు 31 వరకు దాదాపు 60 రోజుల పైచిలుకు జరిగే కార్యక్రమమిది. రాష్ట్రవ్యాప్తంగా మూడు ప్రాంతాల్లో బస్సు యాత్రలు జరుగుతాయి. ఒక్కో టీమ్‌లో పార్టీకి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సీనియర్‌ నాయకులంతా ఉంటారు. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో మీటింగ్‌లు ఆ నియోజకవర్గంలో జరుగుతాయి. రోజూ రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో మూడు మీటింగ్‌లు జరుగుతాయి.

ఒక్కో రోజు ఆ ప్రాంతంలోని అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించి మీటింగ్‌ పెట్టి ప్రభుత్వం చేసిన మంచి గురించి, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, మారిన మన ప్రభుత్వ స్కూళ్లు, ఆసుపత్రుల గురించి, మారిన మన వ్యవసాయం గురించి, జరిగిన అభివృద్ధి గురించి వివరిస్తూ స్ధానికంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాయంత్రానికి మూడు ప్రాంతాల్లో మూడు పబ్లిక్‌ మీటింగ్‌లు, బస్సు పైనుంచే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

సభకు స్ధానిక ఎమ్మెల్యే లేదా అసెంబ్లీ కన్వీనర్‌ అధ్యక్షత వహిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా 60 రోజుల పాటు ప్రతిరోజూ మూడు ప్రాంతాల్లో మూడు మీటింగ్‌లు ఉంటాయి. మీరంతా ఈ బస్సు యాత్ర కార్యక్రమంలో పాల్గొని మమేకం కావాలి. ఇది మామూలు బస్సు యాత్ర కాదు. ఒక సామాజిక న్యాయ యాత్ర. పేదవాడికి జరిగిన మంచిని వివరించే యాత్ర. 60 రోజుల్లో మొత్తం 175 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు జరుగుతాయి.   

ఆడుదాం ఆంధ్రా.. 
వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమం అయిపోయిన తర్వాత నాలుగో కార్యక్రమంగా డిసెంబర్‌ 11 నుంచి  ‘ఆడుదాం ఆంధ్రా’ మొదలవుతుంది. ఇది డిసెంబర్‌ 11 నుంచి సంక్రాంతి వరకు అంటే జనవరి 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహించే క్రీడా సంబరం. ఆడుదాం ఆంధ్రా ద్వారా నైపుణ్యం ఉన్నవారిని గ్రామస్ధాయి నుంచి గుర్తించి ప్రోత్సహించడం ప్రభుత్వ ఉద్దేశం.

భారతదేశ టీమ్‌లో వైనాట్‌ ఆంధ్రప్రదేశ్‌? అనే రీతిలో కార్యక్రమం జరగాలి. ఈ కార్యక్రమం 45 రోజుల పాటు జరుగుతుంది. గ్రామ, వార్డు సచివాలయాల నుంచి మొదలై మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్ధాయిలో ఈ క్రీడా సంబరాలు జరుగుతాయి. మన గ్రామంలో మరుగునపడి ఉన్న మన పిల్లల టాలెంట్‌ను దేశానికే పరిచయం చేసే కార్యక్రమం ఇది. ఇక నుంచి ఈ కార్యక్రమం ఏటా జరుగుతుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement