ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చింది మొదలు అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం వినూత్నమైన, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్రంలో బీసీల కుల గణనకు సంకల్పించి ఆ వర్గాల చిరకాల వాంఛ నెరవేర్చారు. గద్దెనెక్క దల్చుకున్న ప్రతి పార్టీ అట్టడుగు వర్గాల ఉద్ధరణే ధ్యేయమని ప్రకటించటం మన దేశంలో రివాజు.
అధికారం వస్తే గిస్తే ఆ వర్గాల నేతల్లో కొందరికి మొక్కుబడిగా పదవులివ్వటం, ఆ వర్గాల ప్రజలను ఆర్థికంగా ఆదుకునే పేరుతో నామమాత్రంగా నిధులు విదల్చటం కూడా షరా మామూలే. కానీ జగన్‌మోహన్ రెడ్డి ఇందుకు భిన్నంగా సాధారణ ప్రజానీకానికి అన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే తన కేబినెట్‌లో 68 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు కేటాయించి ఔరా అనిపించారు.
సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తూ చట్టసభల్లో, స్థానిక సంస్థల పదవుల్లో అట్టడుగు కులాలకు ప్రాతినిధ్యం గణనీయంగా పెంచటమే కాదు... అన్ని రకాల నామి నేటెడ్ పదవుల్లో, నామినేషన్లపై ఇచ్చే పనుల్లో కూడా ఆ వర్గాలకు 50 శాతం కేటాయించాలని నిర్దేశించారు. వెనకబడిన కులాల్లో ఇంతవరకూ ఎవరి దృష్టీ పడని కులాలకు సైతం ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారి సామాజిక ఆర్థిక ప్రగతికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఆ క్రమంలో బీసీల కుల గణనకు పూనుకోవాలనుకోవటం అత్యంత కీలక నిర్ణయం.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతున్నా, జనాభాలో 56 శాతంగా ఉన్న బీసీ కులాలకు విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో పెద్దగా ప్రాధాన్యత లేదు. వివక్ష కారణంగా వెనకబాటుతనానికి గురవుతున్న కులాలను గుర్తించేందుకు 1979లో కేంద్రంలోని అప్పటి జనతా పార్టీ ప్రభుత్వం మండల్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ ఇచ్చిన సమగ్రమైన నివేదికను పట్టించుకుని తగిన చర్యలు తీసుకోవాలన్న స్పృహ ఎవరికీ లేని కారణంగా దశాబ్దంపాటు అది మూలనపడింది.
1989లో అప్పటి ప్రధాని వీపీ సింగ్ నేతృత్వంలోని సర్కారు ఆ నివేదిక దుమ్ము దులిపి ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించటం ఆ వర్గాల వారికి విద్య, ఉద్యోగావకాశాలను కల్పించటం మాత్రమే కాదు... దేశ రాజకీయాల గతినే మార్చేసింది. ఆ తర్వాత నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏదోమేరకు ఆ వర్గాల వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి.
అరకొరగానైనా ఆ వర్గాలకు రాజకీయ పదవులు దక్కుతున్నాయి. విద్య, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు ఇంకా పూర్తి స్థాయిలో అమలుకావటం లేదు. ఉన్నతశ్రేణి విద్యాసంస్థల్లోనూ, ఇతరత్రా ప్రభుత్వరంగ సంస్థ ల్లోనూ కోటా అమలు అంతంతమాత్రంగానే ఉన్నదని బీసీ వర్గాలు తరచు ఆరోపిస్తున్నాయి. జనాభాలో మెజారిటీ వర్గ ప్రజలు అభ్యున్నతి సాధించకుండా దేశం ఉన్నత స్థాయికి చేరుకోవటం సాధ్యమవుతుందా? దేశంలో చివరిసారి కులగణన బ్రిటిష్ పాలకుల హయాంలో 1931లో జరిగింది.
స్వతంత్ర భారతదేశంలో పదేళ్లకోసారి నిర్వహించే జనాభా లెక్కల సేకరణ 1951లో మొదలు కాగా, 2011లో జరిగిన జనాభా లెక్కల సేకరణ వరకూ బీసీ కులాల గణన జోలికే మన పాలకులు పోలేదు. పశుపక్ష్యాదుల లెక్కలు సైతం తెలుసుకోవాలనుకునే ప్రభుత్వాలకు బీసీ జనాభా గణన పట్టకపోవటం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఒకపక్క అట్టడుగు వర్గాల ఉద్ధరణ ధ్యేయమంటూ పథకాలు రూపొందించిన పాలకులు అవి లక్షిత వర్గాలకు చేరుతున్నాయో లేదోనన్న స్పృహ లేకుండా గడిపారు. అందువల్లే ఇన్నేళ్లుగా ఆశించిన ఫలితాలు రాలేదన్నది వాస్తవం.
వేళ్లమీద లెక్కించదగ్గ కులాలు మినహా ఇప్పటికీ చాలా బీసీ కులాలు సంక్షేమ పథకాల మాట అటుంచి కనీస అవసరాలు కూడా దక్కించుకోలేకపోతున్నాయి. మండల్ కమిషన్ నివేదిక ప్రకారం బీసీ కులాలు 2,666 కాగా సంక్షేమ ఫలాలు అందుకునే కులాలు అందులో పట్టుమని పదిశాతం కూడా ఉండటం లేదు. బీసీ జనాభా సంఖ్య ఎంతన్నది మిస్టరీగా మిగిలిపోవటం వల్ల ఆర్థికంగా, విద్యాపరంగా, ఉపాధిపరంగా ఆ వర్గాల స్థితిగతులేమిటన్నది ప్రభుత్వాలకు తెలియటం లేదు. రూపొందించే పథకాలు, అందు కోసం కేటాయించే నిధుల వ్యవహారం చీకట్లో తడుములాటగా సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో 341 రోజులపాటు సాగించిన 3,641 కిలోమీటర్ల ప్రజా సంకల్పయాత్రలో కోట్లాదిమంది అట్టడుగు ప్రజానీకం కష్టాలనూ, కడగళ్లనూ జగన్ కళ్లారా చూసినందువల్లే నవరత్నాల పేరిట అనేక సంక్షేమ పథకాలు పొందుపరిచి మేనిఫెస్టో రూపొందించారు. వాటిని అమలు చేస్తూనే ఇతరేతర వర్గాలకు లబ్ధి చేకూరేలా మరిన్ని పథకాలను ఆచరణలోకి తీసుకొచ్చి సంక్షేమ ఫలాలు సంపూర్ణంగా అందేలా చర్యలు తీసుకున్నారు. బీసీల జనాభా గణన పూర్తయితే ఇది మరింత పదునుతేరుతుందన్న ఆలోచన ఆయనది.
అందువల్లే ఈసారి జనాభా లెక్కల్లో బీసీ కులాలను గణించాలన్న బీసీ వర్గాలకు అందరికన్నా ముందు మద్దతు పలకటమేకాక, ఆ డిమాండ్‌ను సమర్థిస్తూ పార్లమెంటులో తమ పార్టీ ఎంపీలతో మాట్లాడించారు. రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ఆమోదింపజేశారు. బీసీల కుల గణన నిర్ణయానికి అనువుగా ఇప్పటికే ఆ దిశగా అడుగులేసిన రాష్ట్రాల్లో కార్యాచరణ ఏ విధంగా ఉందన్న అంశాన్ని అధ్యయనం చేసేందుకు, మార్గదర్శకాలు రూపొందించేందుకు కమిటీ ఏర్పాటు చేశారు. జాతీయ పక్షాలుగా ముద్రపడిన పార్టీలు సైతం బీసీ వర్గాల డిమాండ్‌పై నికరమైన విధానం ప్రకటించలేని నిస్సహాయతలో పడగా ఆదినుంచీ అందుకు మద్దతిస్తున్న జగన్‌మోహన్ రెడ్డి తన తాజా నిర్ణయంతో ఆ వర్గాలకు మరింత చేరువయ్యారు.
సీఎం జగన్ నిర్ణయం చరిత్రాత్మకం
Published Fri, Apr 14 2023 2:39 AM | Last Updated on Fri, Apr 14 2023 7:02 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment