కడప అగ్రికల్చర్: రైతు దేశానికి వెన్నెముక. రైతు సుభిక్షంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్న నానుడిని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిజం చేస్తున్నారు. రైతన్నలకు అడుగడుగునా అండగా నిలుస్తూ వ్యవసాయానికి కావాల్సిన అన్ని రకాల సేవలను అందిస్తూ ఆదుకుంటున్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి విత్తనం నుంచి పంట విక్రయం వరకు రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. అన్నదాతల ఆధునిక దేవాలయాలుగా పేరుగాంచిన ఆర్‌బీకే లలో నిరంతరాయంగా సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ప్రతి ఆర్‌బీకేకు ఒక వలంటీర్‌ను నియమించింది. ప్రస్తు తం రైతు భరోసా కేంద్రాలలో వ్యవసాయ పంటలసాగు ఆధారంగా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్, విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ పనిచేస్తున్నారు.
వీరే ఆర్‌బీకే ఇన్‌చార్జులుగా వ్యవహరిస్తారు. అయితే వీరంతా ఎక్కువ సమయాన్ని క్షేత్రస్థాయిలో గడపాల్సి వస్తోంది. ప్రధానంగా పంటలసాగు సమయంలో ఈ క్రాపు బుకింగ్ ప్రక్రియ కోసం రోజుల తరబడి పంట పొలాల్లో ఉండాల్సి వస్తోంది. దీంతోపాటు వారంలో ఒక రోజు పొలంబడి కార్యక్రమం నిర్వహించాల్సి ఉంటుంది. వీటితోపాటు మండల, సబ్ డివిజన్, జిల్లాస్థాయిలో నిర్వహించే సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలకు వీరంతా హాజరు కావాలి. ఇలాంటి సమయాల్లో రైతు భరోసా కేంద్రాలను మూసివేయాల్సి వస్తుంది. దీంతో రైతులు అత్యవసర సమయాల్లో ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు.అలాంటి పరిస్థితిలో వ్యవ ప్రయాసాలతో మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలకు పరుగులు తీయాల్సి వస్తుంది. ఈ సమస్యను తెలుసుకున్న ముఖ్యమంత్రి మరో అడుగు ముందుకేసి రైతులకు ఈ సమస్య కూడా ఉండకూడదని భావించి సమస్య పరిష్కారానికి ప్రతి ఆర్‌బీకేకు ఒక వలంటీర్‌ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి చొరవతో ఇక రైతు భరోసా కేంద్రాలలో రైతులకు నిరంతర సేవలు అందే అవకాశం ఏర్పడింది.
దేశానికే ఆదర్శంగా ఆర్‌బీకేలు..
గ్రామస్థాయిలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు కావడంతో రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించింది. విత్తన ఎంపిక, ఎరువులు, పురుగు మందులు, పంట విక్రయాలు వంటి అన్ని రకాల సేవలు ఉన్న ఊర్లోనే అందుతున్నాయి. దీంతోపాటు ప్రైవేటు ఎరువులు, రసాయనిక మందుల డీలర్లు అడ్డుగోలుగా అధిక ధరలకు విక్రయించేవారు. ఎమ్మార్పీపై బస్తాకు రూ.50 నుంచి రూ.100 అధికంగా వసూలు చేసేవారు. ఆర్‌బీకేలు ఏర్పాటు అయిన తర్వాత వారి ఆగడాలకు మరింత అడ్డుకట్ట పడింది. తాజాగా వలంటీర్ల నియామకంతో మరో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టినట్లయింది.
రైతులకు మరింత చేరువలో ఆర్‌బీకేలు..
జిల్లాలో 432 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 414 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. ప్రతి ఆర్‌బీకేకు ఒక వలంటీర్ నియామక ప్రక్రియ కూడా పూర్తి అయింది. ఇది వరకే ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించి వీరి ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజల చెంతకు చేరుస్తున్నారు. ప్రస్తుతం ఎంపిక చేసిన 414 మంది వలంటీర్లకు ఆయా మండల కేంద్రాలలో శిక్షణ తరగతులను ప్రారంభించారు. డిజటల్ కియోస్క్ ద్వారా ఎరువులు, విత్తనాల, పురుగు మందులు ఆర్డర్ పెట్టడం, పంపిణీ చేయడం వంటి అన్ని కార్యక్రమాలు ఆర్‌బీకే ఇన్‌చార్జుల పర్యవేక్షణలో వలంటీర్లు చేపడతారు.
చాలా సంతోషం
రైతు భరోసా కేంద్రాల ద్వారా మాకు అన్ని రకాల సేవలు అందుతున్నాయి. అయితే ప్రస్తుతం పనిచేస్తున్న అగ్రికల్చర్, హార్టికల్చర్ అసిస్టెంట్లు ఏదైనా పనిమీద బయటకు వెళితే ఆర్‌బీకేలను మూసివేయాల్సి వస్తోంది. అత్యవసర సమయాల్లో ఇబ్బందులు పడకతప్పడం లేదు. ఈ సమస్య పరిష్కారానికి వలంటీర్‌ను నియమించడం సంతోషంగా ఉంది.
–ఎస్. శ్రీనివాసులరెడ్డి, గోపులాపురం, రాజుపాలెం మండలం
వలంటీర్లకు సమ్రగ శిక్షణ
జిల్లాలోని ప్రతి రైతు భరోసా కేంద్రానికి ఒక వలంటీర్‌ను నియమించాం. వీరికి ఆర్‌బీకే నిర్వహణపై శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తాం. ప్రస్తుతం ఈ శిక్షణ ప్రారంభమైంది. ఆర్‌బీకే ఇన్‌చార్జులు క్షేత్రస్థాయిలోకి వెళ్లిన సందర్భంలో రైతులకు వీరు అన్ని రకాల సేవలు అందించాల్సి ఉంది.
– అయితా నాగేశ్వరరావు, జిల్లా వ్యవసాయ అధికారి
Comments
Please login to add a commentAdd a comment