West Godavari Kavadigundla Gubbala Mangamma Thalli Temple History And Interesting Facts In Telugu - Sakshi
Sakshi News home page

Gubbala Mangamma Thalli Temple History: అడవి మధ్యలో వెలసిన.. గుబ్బల మంగమ్మతల్లి

Published Sun, Dec 12 2021 12:11 PM | Last Updated on Sun, Dec 12 2021 4:50 PM

Gubbala Mangamma Thalli History In Telugu West Godavari - Sakshi

బుట్టాయగూడెం: అందమైన అడవి మధ్యలో వెలసిన మహిమగల అమ్మవారు గుబ్బల మంగమ్మ.. చుట్టూ ఎత్తైన కొండలు.. కనువిందు చేస్తూ గలగల పారే సెలయేర్ల సవ్వడుల నడుమ ఆహ్లాదాన్ని పంచే ప్రాంతంలో కొలువైన అమ్మవారు భక్తుల పూజలందుకుంటోంది. దట్టమైన అటవీ ప్రాంతంలో గుబ్బలు, గుబ్బలుగా ఉన్న గుహలో వెలవడంతో గుబ్బల మంగమ్మగా ప్రసిద్ధి చెందింది.

బుట్టాయగూడెం మండలం కామవరం సమీపంలో ఉన్న మంగమ్మ గుడి ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా పర్యాటకంగాను అందరినీ ఆకర్షిస్తోంది. గిరిజనుల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న మంగమ్మ భక్తుల కోర్కెలు తీర్చె తల్లిగా పేరు పొందింది. దీంతో ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు అమ్మవారిని భక్తి శ్రద్దలతో పూజించి తమ మొక్కులు తీర్చుకుంటారు. 

త్రేతాయుగంలోనే గుబ్బల మంగమ్మ ప్రస్తానం 
గుబ్బల మంగమ్మ గురించి ఎన్నో స్థలపురాణాలు ఉన్నాయి. త్రేతాయుగంలోనే వెలసినట్లు చెబుతుంటారు. ఈ అడవిలో కొందరు రాక్షసుల మధ్య జరిగిన యుద్ధం తీవ్రత ధాటికి మంగమ్మతల్లి నివసిస్తున్న గుహ కూలి పోయిందట. అమ్మ ఆగ్రహంతో ప్రకృతి అల్లకల్లోలం కాగా.. దేవతలు ప్రత్యక్షమై మంగమ్మతల్లిని శాంతింపచేసి ఈ ప్రాంతంలోనే అవతరించాలని కోరారు. సేలయేర్ల మధ్య గుబ్బల గుబ్బలుగా ఉన్న గుహలో వెలసిందని ప్రతీతి. సుమారు 55 ఏళ్ల క్రితం బుట్టాయగూడెంకు చెందిన కరాటం కృష్ణమూర్తి అడవిలో వెదురు గెడలు తెచ్చేందుకు వెళ్లారు.

తిరుగు ప్రయాణంలో ఎడ్లు అడుగు కూడా ముందుకు వేయకపోవడంతో.. బండిపై ఉన్న వెదురు కలపను దించేసి కూలీలతో పాటు కృష్ణమూర్తి ఇంటికి వచ్చేశారట. రాత్రి కృష్ణమూర్తికి మంగమ్మతల్లి కలలో కనిపించి వాగు వెంట కొంత దూరంలో ఉన్న గుహలో వెలిశానని.. తనను దర్శించుకున్నాక వెదురు తీసుకు వెళ్లాలని చెప్పింది. కృష్ణమూర్తి గుబ్బల మంగమ్మతల్లి వెలసిన ప్రదేశాన్ని దర్శించుకున్న అమ్మ వారికి పూజలు చేశారు. అప్పటి నుంచి ఏజెన్సీ ప్రాంతంతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు మంగమ్మతల్లిని దర్శించుకోవడం మొదలుపెట్టారు.

గిరిపుత్రులే పూజారులు 
ఆదివాసీల ఆరాధ్య దైవంగా కొలుస్తున్న గుబ్బల మంగమ్మకు గిరిజనులే పూజారులు. వారే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. గిరిజనులు పూజలు చేసి నైవేద్యాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. గుబ్బల మంగమ్మ తల్లి సన్నిధిలో అనేక మంది కొండరెడ్డి గిరిజనులు ఉపాధి పొందుతున్నారు. అడవిలో లభించే అటవీ ఉత్పత్తులు, రోకళ్లు, వెదురుతో అల్లిన చేటలు తదితర వస్తువులను విక్రయిస్తుంటారు.

మంగమ్మతల్లి దర్శనానికి వచ్చే భక్తులు గిరిజనులు తయారు చేసిన వస్తువులను కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు.   మంగమ్మతల్లి వెలిసిన సమీపంలోనే గానుగ చెట్టు ఉంది. ఈ చెట్టు సంతాన వృక్షంగా పేరొందింది. పిల్లలు పుట్టని దంపతులు అమ్మను దర్శించుకున్న అనంతరం పసుపు, కుంకుమ ఎర్రని వస్త్రంలో పెట్టి చెట్టుకొమ్మకు కడతారు. అలాచేస్తే అమ్మ అనుగ్రహంతో కడుపు పండుతుందని విశ్వాసం. 

ప్రతీ ఆదివారం 3 వేల మందికి పైగా రాక 
ప్రతీ ఆది, మంగళ, శుక్రవారాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కరోనా నేపథ్యంలో ఇటీవల భక్తుల రాక తగ్గింది. ప్రతి ఆదివారం 3 వేల మందికి పైగా భక్తులు వస్తుంటారు. మంగళ, శుక్రవారాల్లో 2 నుంచి 3 వేల మంది వరకూ వస్తారు. రద్దీ పెరగడంతో ఇటీవల ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌ సమస్యలు ఏర్పడుతున్నాయి. వర్షాకాలంలో వాగులు, వంకలు పొంగడం వల్ల రద్దీ తగ్గుతుంది. గుబ్బల మంగమ్మతల్లి గుడి వద్ద గత రెండేళ్ల నుంచి మూడు రోజుల పాటు జాతర నిర్వహిస్తున్నారు.  

అడవిలో ప్రయాణం ఆహ్లాదభరితం 
మంగమ్మతల్లి దర్శనానికి వెళ్లే భక్తులకు అడవి మార్గంలో ప్రయాణం ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. కామవరం దాటిన తరవాత కొంత దూరం వేళ్లే సరికి దట్టమైన అడవి ఉంటుంది. ఆ అడవిలో మరి కొంత దూరం వెళ్లిన తర్వాత గుబ్బల మంగమ్మతల్లి దర్శనం కలుగుతుంది. ప్రయాణంలో పచ్చని చెట్లు, ఎతైన కొండలు, ప్రకృతి రమణీయమైన  దృశ్యాలు కనువిందు చేస్తాయి. 

గుడికి ఎలా వెళ్లాలి.. 
గుడికి జంగారెడ్డిగూడెం నుంచి బుట్టాయగూడెం, దొరమామిడి, గాడిదబోరు, పందిరిమామిడిగూడెం మీదుగా వెళ్లొచ్చు. జంగారెడ్డిగూడెం నుంచి శ్రీనివాసపురం, రామారావుపేట సెంటర్, అంతర్వేదిగూడెం, పందిరిమామిడిగూడెం మీదుగా కూడా వెళ్లొచ్చు. తెలంగాణ నుంచి వచ్చే వారు అశ్వారావుపేట నుంచి రాచన్నగూడెం, పూచికపాడు మీదుగా వేపులపాడు, పందిరిమామిడిగూడెం మీదుగా దర్శనానికి రావచ్చు. అశ్వారావుపేట నుంచి పూచికపాడు, రామచంద్రాపురం మీదుగా అటవీమార్గంలో మంగమ్మతల్లిని దర్శించుకోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement