సాక్షి, విశాఖపట్నం: ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలంతా ఆసక్తి చూపారని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ హర్షం వ్యక్తం చేశారు. విశాఖ సర్క్యూట్ హౌస్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే నెల 3, 4 తేదీల్లో విశాఖలో నిర్వహించనున్న ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు’కు సంబంధించి ఢిల్లీలో మంగళవారం నిర్వహించిన సన్నాహక సదస్సులో 49 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారని చెప్పారు. వారితోపాటు వివిధ దేశాల అంబాసిడర్లు, అసోచామ్, ఫిక్కీ, సీఐఐ, నాస్కామ్ ప్రతినిధులు హాజరయ్యారని తెలిపారు.
రాష్ట్రంలో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతున్న విషయాన్ని పలువురు పారిశ్రామికవేత్తలు ప్రతినిధులకు వివరించారని చెప్పారు. దేశంలో 8వ అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వారంతా సుముఖత వ్యక్తం చేశారన్నారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’, ‘కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో దేశంలోనే రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందన్నారు. గతేడాదిలో ఏపీ 19 బిలియన్ డాలర్ల ఎగుమతులు సాధించిందని తెలిపారు. నీతి ఆయోగ్ వంటి సంస్థ కూడా రాష్ట్రంలో పారిశ్రామిక విధానాన్ని అభినందించిందని సీఎం వైఎస్ జగన్ వివిధ దేశాల ప్రతినిధులకు వివరించారని చెప్పారు.
రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి అంతా ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కాకుండా అన్ని ప్రాంతాలకు వికేంద్రీకరించాలన్నదే ప్రభుత్వ విధానమని వెల్లడించారు. రాష్ట్రంలో 13 రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలను వివిధ దేశాల ప్రతినిధులకు వివరించామన్నారు. దేశం మొత్తం మీద 11 ఇండస్ట్రియల్ కారిడార్లు ఉండగా.. ఇందులో మూడు కారిడార్లు ఆంధ్రప్రదేశ్‌లో ఉండటం మనకు కలిసివచ్చే అంశమని తెలిపారు. ఇందులో 49 వేల ఎకరాల భూమిని పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధం చేశామన్నారు. 974 కిలోమీటర్ల తీర ప్రాంతంలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి తీసుకుంటున్న చర్యల గురించి పారిశ్రామికవేత్తలకు వివరించామని చెప్పారు.
తిరుపతిలో ఇప్పటికిప్పుడు వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించడానికి ఉన్న అవకాశాలు గురించి చెప్పగా వారు అందుకు ఆకర్షితులయ్యారని వివరించారు. రెన్యువబుల్ ఎనర్జీలో భారీ పెట్టుబడులకు అవకాశం ఉందన్నారు. విశాఖలో మార్చి 3, 4వ తేదీల్లో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్, అదే నెల 28, 29 తేదీల్లో జరిగే జీ–20 సదస్సులు రాష్ట్ర భవిష్యత్‌ను మార్చే వేదికలు కాబోతున్నాయన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ఎవరు ముందుకొచ్చినా మౌలిక సదుపాయాలతోపాటు అనుమతుల మంజూరులో ప్రభుత్వం సరళంగా వ్యవహరిస్తుందని చెప్పారు.
లోకేశ్‌ను చూస్తే జాలేస్తోంది..
లోకేశ్‌ను చూస్తే తనకు జాలేస్తోందన్నారు. చంద్రబాబు తప్ప ఆయన కుటుంబ సభ్యులంతా లోకేష్‌ను నాయకుడిగా చూడాలనుకుంటున్నారన్నారు. చంద్రబాబుకు మాత్రం ఈ ఆలోచన లేదని చెప్పారు. కొడుకును నాయకుడిగా తీర్చిదిద్దాలనే ఆలోచన ఆయనకు ఉంటే.. లోకేశ్ చేపట్టిన పాదయాత్ర తొలి సభకైనా హాజరయ్యేవారన్నారు. అధికారం విషయంలో చంద్రబాబుకు కొడుకైనా, మామైనా ఒకటేనని తెలిపారు.
పవన్ కల్యాణ్‌కు నాయకత్వ లక్షణాలు లేవన్నారు. ఏ రాజకీయ పార్టీ అధినాయకుడైనా తన పార్టీ జెండా ప్రతి గ్రామంలో ఎగరాలని భావిస్తారని, అలాగే అన్ని సీట్లకు పోటీ చేసి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారని చెప్పారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం 25 నుంచి 30 సీట్లకు బేరం ఆడుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. కాపులను చంద్రబాబు కాళ్ల దగ్గర పెట్టాలనుకుంటున్నారని ఆరోపించారు.
రాజు ఎక్కడి నుంచి పాలిస్తే అదే రాజధాని..
ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి రాజు అని, రాజు రాష్ట్రంలో ఎక్కడి నుంచి పాలన చేస్తే అదే రాజధాని అవుతుందన్నారు. దీనిపై చర్చ అవసరం లేదన్నారు. గతంలో రాజ్యసభలో కేంద్రం.. రాజధాని ఏర్పాటు అధికారం రాష్ట్రాలకే ఉంటుందని పేర్కొన్న విషయాన్ని అమర్‌నాథ్ గుర్తు చేశారు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడే సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు ఉంటాయన్నారు.
ప్రొసీజర్ ప్రకారమే ముఖ్యమంత్రి విశాఖకు వస్తారన్నారు. వివిధ శాఖల కార్యాలయాలకు భవనాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో చర్చనీయాంశమైన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మీడియా అడిగిన ప్రశ్నకు అది ఫోన్ ట్యాపింగో.. రికార్డింగో తేలాల్సి ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment