సాక్షి, అమరావతి: ఈ ఏడాది పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రైవేటు వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా రివైజ్డ్ ఫేజ్ –1 కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన అభ్యర్థులు సంబంధిత కాలేజీల్లో రిపోర్ట్ చేయవద్దని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం బుధవారం ప్రకటించింది. రాజమండ్రిలోని జీఎస్‌ఎల్ కళాశాలలో ఎండీ– రేడియో డయగ్నోసిస్ కోర్సులో 14 సీట్లకు నకిలీ అనుమతులు జారీ అయినట్లు నేసనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) మంగళవారం తెలిపింది.
దీంతో యాజమాన్య కోటా విద్యార్థుల ప్రవేశాల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. విశ్వవిద్యాలయం మళ్లీ తెలిపే వరకూ విద్యార్థులు కళాశాలల్లో రిపోర్ట్ చేయద్దని రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి కోరారు. ఇప్పటికే కళాశాలల్లో రిపోర్ట్ చేసిన, చేయని విద్యార్థులు విశ్వవిద్యాలయం నుంచి జారీ చేసే తదుపరి నిర్ణయం కోసం వెబ్‌సైట్‌ను చూస్తుండాలని సూచించారు.
ఎన్‌ఎంసీకి వైద్య, ఆరోగ్య శాఖ లేఖ
నంద్యాల జిల్లా శాంతీరామ్, విజయనగరం జిల్లా మహారాజా, తూర్పుగోదావరి జిల్లా జీఎస్‌ఎల్ వైద్య కళాశాలల్లో నకిలీ అనుమతులతో పీజీ సీట్లు పెంచినట్లు వెల్లడవడంతో గత నెలలో నిర్వహించిన తొలి దశ కౌన్సెలింగ్‌ను విశ్వవిద్యాలయం రద్దు చేసింది. ఎన్‌ఎంసీ నుంచి స్పష్టత తీసుకుని తిరిగి మొదటి నుంచి కౌన్సెలింగ్ నిర్వహించి సోమవారం సీట్లు కేటాయించింది. అయితే అనూహ్యంగా మంగళవారం మరో 14 సీట్లకు జీఎస్‌ఎల్ నకిలీ అనుమతులు ఉన్నాయంటూ ఎన్‌ఎంసీ పేర్కొంది.
దీంతో ఈ అంశంపై స్పష్టత కోసం వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ఎన్‌ఎంసీకి లేఖ రాశారు. ఎన్‌ఎంసీ నుంచి వివరణ వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. నకిలీ అనుమతులపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఎన్‌ఎంసీ సమాచారమిచ్చిందని తెలిపారు. ఫిర్యాదు వివరాలను కోరామని చెప్పారు. విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని తెలియజేశామన్నారు. మరో వైపు నకిలీ అనుమతుల అంశంపై మూడు కళాశాలలకు విశ్వవిద్యాలయం వీసీ నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment