సాక్షి, నంద్యాల జిల్లా: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు 3 గేట్ల ద్వారా దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. సందర్శకుల తాకిడితో జలాశయం కళకళలాడుతోంది. ఇన్‌ఫ్లో 4,60,040 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో : 1,41,560 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 880.90 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం : 198.3623 టీఎంసీలుగా కొనసాగుతోంది. కుడి గట్టు, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
నాగార్జునసాగర్ వైపు కృష్ణమ్మ బిరబిరా పరుగులు పెడుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి సోమవారం రాత్రి 7 గంటలకు 4,52,583 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 879.3 అడుగుల్లో 184.70 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ నుంచి భారీ వరద వస్తుండటం.. నీటి మట్టం గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో అధికారులు ప్రాజెక్టు మూడు గేట్లు పది అడుగుల మేర ఎత్తి 82వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.
కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదిలేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 23 వేల క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1,600 క్యూసెక్కులను తరలిస్తున్నారు. మరోవైపు.. శ్రీశైలం స్పిల్ వే గేట్లు, విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు విడుదల చేస్తున్న ప్రవాహం నాగార్జునసాగర్ వైపు పరుగులు తీస్తోంది. సాగర్‌లోకి సోమవారం సా.6 గంటలకు 54,772 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 512.6 అడుగుల్లో 136.13 టీఎంసీలకు చేరుకుంది. సాగర్ గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు కాగా.. పూర్తినిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు. సాగర్ నిండాలంటే ఇంకా 176 టీఎంసీలు అవసరం. ఎగువ నుంచి వరద ప్రవాహం ఇదే రీతిలో కొనసాగితే మరో ఆరేడు రోజుల్లో నాగార్జునసాగర్ నిండే అవకాశం ఉంటుంది.
స్థిరంగా వరద ప్రవాహం..
మహారాష్ట్ర, కర్ణాటకలలోని పశ్చిమ కనుమల్లో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కృష్ణా, ఉప నదుల్లో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. కృష్ణా ప్రధాన పాయ నుంచి ఆల్మట్టి డ్యాంలోకి 3 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా అంతేస్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. నారాయణపూర్ డ్యాంలోకి 2.90 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా 2.70 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక తెలంగాణలోని జూరాల ప్రాజెక్టులోకి 3.15 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా 3.11 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.
అలాగే, కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్రలో వరద ఉధృతి కొనసాగుతోంది. తుంగభద్ర డ్యాంలోకి 1.31 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 1.06 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్ నుంచి దిగువకు విడుదల చేస్తున్న ప్రవాహంతో మంత్రాలయం వద్ద తుంగభద్ర నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. నీటి మట్టం 311 మీటర్లు (సముద్ర మట్టానికి) కొనసాగుతుండటంతో మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు.
ఇక సుంకేశుల బ్యారేజ్‌లోకి 1.51 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. కేసీ కెనాల్‌కు 1,504 క్యూసెక్కులను వదులుతూ మిగులుగా ఉన్న 1.48 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఇటు సుంకేశుల నుంచి.. అటు జూరాల నుంచి వరద వస్తుండటంతో శ్రీశైలంలోకి చేరుతున్న ప్రవాహం గంట గంటకూ పెరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment