srishailam project
-
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద: 3 గేట్లు ఎత్తివేత
సాక్షి, నంద్యాల జిల్లా: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు 3 గేట్ల ద్వారా దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. సందర్శకుల తాకిడితో జలాశయం కళకళలాడుతోంది. ఇన్‌ఫ్లో 4,60,040 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో : 1,41,560 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 880.90 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం : 198.3623 టీఎంసీలుగా కొనసాగుతోంది. కుడి గట్టు, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.నాగార్జునసాగర్ వైపు కృష్ణమ్మ బిరబిరా పరుగులు పెడుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి సోమవారం రాత్రి 7 గంటలకు 4,52,583 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 879.3 అడుగుల్లో 184.70 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ నుంచి భారీ వరద వస్తుండటం.. నీటి మట్టం గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో అధికారులు ప్రాజెక్టు మూడు గేట్లు పది అడుగుల మేర ఎత్తి 82వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదిలేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 23 వేల క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1,600 క్యూసెక్కులను తరలిస్తున్నారు. మరోవైపు.. శ్రీశైలం స్పిల్ వే గేట్లు, విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు విడుదల చేస్తున్న ప్రవాహం నాగార్జునసాగర్ వైపు పరుగులు తీస్తోంది. సాగర్‌లోకి సోమవారం సా.6 గంటలకు 54,772 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 512.6 అడుగుల్లో 136.13 టీఎంసీలకు చేరుకుంది. సాగర్ గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు కాగా.. పూర్తినిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు. సాగర్ నిండాలంటే ఇంకా 176 టీఎంసీలు అవసరం. ఎగువ నుంచి వరద ప్రవాహం ఇదే రీతిలో కొనసాగితే మరో ఆరేడు రోజుల్లో నాగార్జునసాగర్ నిండే అవకాశం ఉంటుంది. స్థిరంగా వరద ప్రవాహం..మహారాష్ట్ర, కర్ణాటకలలోని పశ్చిమ కనుమల్లో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కృష్ణా, ఉప నదుల్లో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. కృష్ణా ప్రధాన పాయ నుంచి ఆల్మట్టి డ్యాంలోకి 3 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా అంతేస్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. నారాయణపూర్ డ్యాంలోకి 2.90 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా 2.70 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక తెలంగాణలోని జూరాల ప్రాజెక్టులోకి 3.15 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా 3.11 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.అలాగే, కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్రలో వరద ఉధృతి కొనసాగుతోంది. తుంగభద్ర డ్యాంలోకి 1.31 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 1.06 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్ నుంచి దిగువకు విడుదల చేస్తున్న ప్రవాహంతో మంత్రాలయం వద్ద తుంగభద్ర నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. నీటి మట్టం 311 మీటర్లు (సముద్ర మట్టానికి) కొనసాగుతుండటంతో మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు.ఇక సుంకేశుల బ్యారేజ్‌లోకి 1.51 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. కేసీ కెనాల్‌కు 1,504 క్యూసెక్కులను వదులుతూ మిగులుగా ఉన్న 1.48 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఇటు సుంకేశుల నుంచి.. అటు జూరాల నుంచి వరద వస్తుండటంతో శ్రీశైలంలోకి చేరుతున్న ప్రవాహం గంట గంటకూ పెరుగుతోంది. -
విద్యుదుత్పత్తి పునరుద్ధరణకు రూ.కోటి
సాక్షి, దోమలపెంట (అచ్చంపేట): టీఎస్ జెన్కో పరిధిలోని శ్రీశైలం ఎడమగట్టు భూగర్భజలను విద్యుత్తు కేంద్రంలో 1, 2వ యూనిట్ల పునరుద్ధరణకు రూ.కోటిలోపే ఖర్చయిందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వరెడ్డి చెప్పారు. సోమవారం ఈ రెండు యూనిట్లను మంత్రి పునఃప్రారంభించారు. ఆగస్టు 20న షార్ట్ సర్క్యూట్ వల్ల భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో మంటలు చెలరేగి 9 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. యూనిట్ల పునరుద్ధరించిన అనంతరం మంత్రి జగదీశ్వర్‌రెడ్డి మాట్లాడారు. అగ్ని ప్రమాదంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిందని, దీంతో సుమారు 100 కోట్ల రూపాయల నష్టం ఏర్పడిందన్నారు. 15 నుంచి 20 రోజుల్లోనే విద్యుదుత్పత్తి చేపట్టాలనుకున్నా.. జెన్కో అధికారులకు కరోనా సోకడంతో ఆలస్యమైందన్నారు. మరో నాలుగు నెలల్లోనే 3, 5, 6వ యూనిట్లను పునరుద్ధరిస్తామని తెలిపారు. 4వ యూనిట్ పునరుద్ధరణకు మరికొంత సమయం పడుతోందని, ఇందులోనే ఎక్కువ నష్టం జరిగిందని పేర్కొన్నారు. అంతకుముందు ఈగలపెంటలో జెన్కో అతిథిగృహం కృష్ణవేణి వద్ద మంత్రికి జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు పూల మొక్కను ఇచ్చి సాదరంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో సందీప్ సుల్తానియా, జెన్కో హైడెల్ డైరెక్టర్ వెంకటరాజం, భూగర్భ కేంద్రం సీఈ ప్రభాకర్‌రావు, ఎస్ఈ సద్గుణరావు తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈ కేంద్రంలో మొత్తం ఆరు యూనిట్లు ఒక్కొక్కటి 150 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగి ఉన్నాయి. ప్రస్తుతం రెండు యూనిట్ల ద్వారా 300 మెగావాట్ల ఉత్పత్తిని చేపట్టారు. -
శ్రీశైలం విద్యుత్ కేంద్రంపై నిర్లక్ష్యం..
సాక్షి, నాగర్‌కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రం ప్రారంభం నుంచి ప్రమాదం వరకు కృష్ణానదిపై ఉన్న అన్ని జల విద్యుత్ కేంద్రాలతో పోలిస్తే విద్యుధుత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రమంతా విద్యుత్ వెలుగులు పంచిన ఈ వెలుగుల దివ్వెలో ఈ నెల 20న జరిగిన ప్రమాదంతో చీకట్లు కమ్ముకున్నాయి. భారీ అగ్నిప్రమాదానికి ఏడుగురు విద్యుత్ ఉద్యోగులు మరణించడంతోపాటు ఇద్దరు అమరాన్రాజ బ్యాటరీ కంపెనీకి చెందిన ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. పవర్‌హౌస్‌లోని ప్యానెల్బోర్డులు, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ వైర్లు కాలిపోయాయి. విద్యుత్ కాంతులతో మెరిసే ప్లాంట్‌లోని లోపలి దృశ్యం పొగతో నల్లగా మారింది. ఈ ప్రమాదంపై ఇప్పటికే సీఐడీ, నిపుణుల కమిటీ విచారణ కొనసాగుతుంది. మరోవైపు విద్యుత్ కేంద్రంలో పునరుద్ధరణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రెండు అంతస్తుల్లో నిండుకున్న నీటి తోడిపోత కొలిక్కివచ్చింది. అనుకోని ఘటనతో భారీగా నష్టం వాటిల్లిన శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పరిశీలిస్తే ప్రతి ఏటా రికార్డు స్థాయిలో విద్యుదుత్పత్తి చేయడం గమనార్హం. ఆది నుంచి అగ్రభాగమే రాష్ట్రానికే తలమానికంగా ఉన్న శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రం ప్రారంభించినప్పటికి నుంచి విద్యుదుత్పత్తిలో అగ్రభాగాన నిలుస్తూ తెలుగు రాష్ట్రాలకు విద్యుత్ వెలుగులు పంచింది. జపాన్ సాంకేతిక పరిజ్ఞానంతో ఆనాటి ఏపీఎస్ఈబీ ఆధ్వర్యంలో 1992లో భూగర్భ జల విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. సివిల్ పనులతోపాటు కేంద్రంలోని ఆరు యూనిట్ల నిర్మాణాలు 2003 వరకు పూర్తయ్యాయి. కాగా తొలి యూనిట్ 2001లో పూర్తవగా.. తదుపరి ప్రతి ఆరు నెలలకు ఒక యూనిట్ చొప్పున పూర్తయ్యాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ కేంద్రం పూర్తిస్థాయి విద్యుదుత్పత్తి సామర్థ్యం 900 మెగావాట్లు. 6 యూనిట్ల ద్వారా ప్రతిరోజు 900 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. నిలిచిన విద్యుదుత్పత్తి రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు పంచిన శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో ఈ నెల 20న జరిగిన ప్రమాదంతో ప్రస్తుతం ఉత్పత్తి పూర్తిస్థాయిలో నిలిచిపోయింది. కాంతివంతంగా ఉండే పవర్హౌస్లోపలి దృశ్యం పొగతో నల్లబారింది. ప్యా నల్ బోర్డులు, ట్రాన్స్ఫార్మర్లు కాలిబూడిదయ్యాయి. విద్యు త్ వైర్లు, పరికరాలు కాలిపోయాయి. బేస్బేలో టర్బైన్ల చు ట్టూ కాంక్రీట్, ఫోరింగ్ ధ్వంసమైంది. ప్రస్తుతం పునరుద్ధర ణ పనులను అధికారులు వేగవంతం చేశారు. ఇప్పటికే పా రిశుద్ధ్య పనులు పూర్తి కాగా.. బయటి నుంచి విద్యుత్ తీసుకొని పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. రెండు అంతస్తుల్లో నిండుకున్న లీకేజీ నీటిని మోటార్ల ద్వారా తోడిపోత కొలిక్కి వచ్చింది. త్వరలోనే యథావిధిగా విద్యుదుత్పత్తి చేస్తామని అధికారులు ప్రకటించినా జపాన్ నుంచి నిపు ణులు వచ్చిన తర్వాతనే ప్రారంభిస్తారని తెలుస్తుంది. అయి తే సీఐడీ అధికారులు, నిపుణుల కమిటీ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఆయా విభాగాల్లో పనిచేసే ఉద్యోగులను విచారించి వివరాలు నమోదు చేసుకున్నట్లు సమాచారం. మొత్తంగా రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు పంచిన శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో త్వరగా విద్యుదుత్పత్తి ప్రారంభం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇలా.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు 7 వేల మిలియన్ యూనిట్లకుపైగా విద్యుత్ ఉత్పత్తి చేసింది. 2014– 15లో 1,802.583 మి.యూ, 2015– 16లో 155.263 మి.యూ, 2016– 17లో 616.832 మి.యూ, 2017– 18లో 826.490 మి.యూ, 2018– 19లో 984.396 మి.యూ, విద్యుదుత్పత్తి చేశారు. అలాగే గతేడాది 1,289 మి.యూ, ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించుకోగా 1993 మి.యూ సాధించారు. ఇక ఈ ఏడాది (2020– 21) జూలై 17 నుంచి భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. అప్పటి నుంచి మొత్తం ఆరు యూనిట్ల ద్వారా 24 గంటల వ్యవధిలో 20 మి.యూచొప్పున విద్యుదుత్పత్తి చేశారు. ఈ ఏడాది లక్ష్యం 1,400 మి.యూ, కాగా ప్రమాదం జరిగిన నాటికి అంటే కేవలం 32 రోజుల్లోనే దాదాపుగా 656 మి.యూ, ఉత్పత్తి చేసినట్లు అధికార వర్గాల ద్వారా సమాచారం. ఈ విధంగా శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం ద్వారా మొత్తం 7,034 మి.యూ, విద్యుదుత్పత్తి చేపట్టారు. -
శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు
సాక్షి, కర్నూలు : శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా కృష్ణమ్మ తరలివస్తోంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులో 175 టీఎంసీల నీరు నిల్వకు చేరుకుంది. జూరాల రిజర్వాయర్ నుంచి, సుంకేసుల బ్యారేజీ నుంచి మొత్తం శ్రీశైలానికి 3లక్షల 63 వేల క్యూసెక్కుల నీరు వస్తుంది.(అల్ప పీడనం: మరో రెండు రోజుల పాటు వర్షాలు) కృష్ణా తుంగభద్ర నదుల ప్రవాహం రోజు రోజుకీ పెరుగుతోంది. బుధవారానికి మరింత వరద నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నట్లు జలవనరుల శాఖ ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం పెరగడంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి రాయలసీమ జిల్లాలకు నీటి విడుదలను పెంచారు.(గోదావరి జిల్లాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే) -
శ్రీశైలం జలాశయానికి ముప్పులేదు
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం జలాశయం భద్రతకు ఎలాంటి ముప్పులేదని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి డాక్టర్ అనిల్‌కుమార్ యాదవ్ స్పష్టంచేశారు. జలాశయం నిర్వహణపై నిర్లక్ష్యం అంటూ ప్రతిపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు చేస్తున్నదుష్ప్రచారాన్నిగురువారం ఆయన ఖండించారు. జలాశయం ఆనకట్టకు ఎలాంటి పగుళ్లూలేవని తెలిపారు. ఏటా జరిపే జలాశయం నిర్వహణ పనుల్లో భాగంగా ఈ ఏడాది ‘అండర్ వాటర్ వీడియోగ్రఫీ’ పనులను గోవాకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (ఎన్ఐఓ)కు.. బ్యాతిమెట్రిక్ సర్వే పనులను విశాఖ ఎన్ఐఓకు అప్పగించామన్నారు. ఈ సంస్థల ప్రతినిధులతో అక్టోబర్ 29న శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు చర్చించారని చెప్పారు. ఆ రెండు సంస్థలు ఇచ్చే నివేదికలను సీడబ్ల్యూసీ రిటైర్డ్ చైర్మన్ ఏబీ పాండ్య అధ్యక్షతన ఏర్పాటుచేసిన డ్యామ్ సేఫ్టీ కమిటీకి పంపుతామని.. ఆ కమిటీ చేసిన సూచనల మేరకు నిర్వహణ పనులు చేపడతామన్నారు. సీపేజీ పనులను శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు ఎప్పటికప్పుడు చేపడుతున్నారన్నారు. కాగా, శ్రీశైలం డ్యామ్ భద్రతకు ఎలాంటి ప్రమాదంలేదని సూపరింటెండెంట్ ఇంజినీరు చంద్రశేఖరరావు కూడా అన్నారు. వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా, డాక్టర్ రాజేంద్రసింగ్ మంగళవారం చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమన్నారు. -
జోరుగా జల విద్యుత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జల విద్యుదుత్పత్తి ఊపందుకుంది. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో డ్యాం ఎడమ గట్టు జల విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. రాష్ట్ర విద్యుత్ సంస్థల అంచనాలకు మించి ఈ ఏడాది జల విద్యుదుత్పత్తికి అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని 11 జల విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,400 మిలియన్ యూనిట్ల(ఎంయూ) జల విద్యుదుత్పత్తికి అవకాశం ఉందని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు తమ వార్షిక బడ్జెట్ నివేదికలో అంచనా వేశాయి. గత ఐదేళ్లలో జరిగిన జల విద్యుత్ నుంచి సగటు తీసి ఈ అంచనాకు వచ్చాయి. అయితే ఆదివారం నాటికి కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలోని జలాశయాల్లో ఈ ఏడాది ఇప్పటివరకు మొత్తం 504.9 టీఎంసీల వరద వచ్చి చేరగా.. వీటితో మొత్తం 1,424 ఎంయూల జల విద్యుదుత్పత్తికి అవకాశం ఉందని రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో) వర్గాలు అంచనా వేశాయి. గత శనివారం నాటికే 725.81 ఎంయూ జల విద్యుదుత్పత్తి జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలోని జలాశయాల్లో ఇంకా 308.1 టీఎంసీల నిల్వలు ఉన్నాయి. రాష్ట్రంలో 2,351.8 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం గల 11 జల విద్యుత్ కేంద్రాలు ఉండగా.. రోజుకు 25–30 మిలియన్ యూనిట్ల చొప్పున ఉత్పత్తి కొనసాగుతోంది. ఇక ప్రైవేటు కొనుగోళ్లు అక్కర్లేదు.. వర్షాభావంతో ఏటా జల విద్యుదుత్పత్తిపై ఆశలు ఆవిరవుతున్నాయి. ఉత్పత్తి లేకపోవడంతో లోటు పూడ్చుకోవడానికి డిస్కంలు ప్రైవేటు కంపెనీల నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్నాయి. 2014–15తో పోలిస్తే 2015–16లో 10 శాతమే జల విద్యుదుత్పత్తి జరిగినట్లు డిస్కంలు తమ వార్షిక బడ్జెట్ నివేదికలో పేర్కొన్నాయి. 2015–16లో సగటు విద్యుత్ కొనుగోలు వ్యయం యూనిట్ రూ.4.45కు పెరిగిందని, 2014–15తో పోల్చితే ఇది 53 పైసలు అధికమని ఇందులో నివేదించాయి. ఆశించిన మేరకు జల విద్యుదుత్పత్తి లేకపోవడంతో ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్ల కోసం డిస్కంలు ఏటా రూ.వందల కోట్ల అదనపు భారాన్ని మోస్తున్నాయి. 2015–16లో కేవలం 284.76 ఎంయూల జల విద్యుదుత్పత్తి జరగ్గా.. 2016–17లో 1,305.80 ఎంయూల ఉత్పత్తి జరిగింది. 2017–18లో ఇప్పటివరకు 725.81 ఎంయూల ఉత్పత్తి జరగ్గా ఏడాది ముగిసే నాటికి 1,500 ఎంయూలకు చేరే అవకాశాలున్నాయి. దీంతో డిస్కంలపై ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్ల భారం తగ్గనుంది. జెన్కోకు రూ.10 కోట్ల లాభం జల విద్యుదుత్పత్తి ప్రారంభం కావడంతో తెలంగాణలో విద్యుత్ మిగిలిపోతోంది. ఈ నేపథ్యంలో బయటి మార్కెట్లో, పవర్ ఎక్సే్ఛంజీలకు విద్యుత్‌ను విక్రయించి లాభాలు ఆర్జిస్తోంది. గత బుధవారం నుంచి ఆదివారం వరకు రోజుకు 3.5 మిలియన్ యూనిట్ల చొప్పున విద్యుత్ విక్రయిస్తూ రూ.12 కోట్ల వరకు తెలంగాణ జెన్కో ఆదాయం ఆర్జించింది. రూ.2 కోట్ల ఉత్పత్తి వ్యయంతో రూ.12 కోట్ల ఆదాయాన్ని గడించింది. థర్మల్ విద్యుదుత్పత్తి కోసం యూనిట్‌కు రూ.3.50 నుంచి రూ.3.45 వరకు వ్యయం అవుతుండగా.. జల విద్యుత్ విషయంలో మాత్రం యూనిట్‌కు దాదాపు రూపాయి ఖర్చు అవుతోంది. ఎక్కడెంత ఉత్పత్తి? ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రియదర్శిని జూరాలలో 162.21 ఎంయూలు, దిగువ జూరాలలో 152.65 ఎంయూలు, శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుదుత్పత్తి కేంద్రంలో 362.51 ఎంయూలు, నాగార్జునసాగర్ జల విద్యుదుత్పత్తి కేంద్రంలో 30 ఎంయూల విద్యుదుత్పత్తి జరిగింది. అలాగే చిన్న జల విద్యుత్ కేంద్రాలైన సింగూరులో 4.59 ఎంయూలు, నిజాంసాగర్‌లో 3.53 ఎంయూల జల విద్యుదుత్పత్తి జరిగింది. నాగార్జునసాగర్ నుంచి ఎడమ గట్టు కాల్వకు, పోచంపాడు రిజర్వాయర్ నుంచి కాకతీయ కెనాల్‌కు నీటిని విడుదల చేయాల్సి ఉంది. త్వరలో అక్కడి జల విద్యుత్ కేంద్రాల్లో సైతం ఉత్పత్తి ప్రారంభం కానుంది. -
సాగర్ వైపు కృష్ణమ్మ పరవళ్లు
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ వైపు కృష్ణమ్మ బిరబిరా పరుగులిడుతోంది. కృష్ణా, దాని ఉప నదుల నుంచి ఆదివారం ఉదయం 9 గంటలకు శ్రీశైలం జలాశయంలోకి 2,48,866 క్యూసెక్కుల వరద రాగా రాత్రి 7 గంటలకల్లా 1,28,460 క్యూసెక్కులకు తగ్గింది. శ్రీశైలం ఏడు గేట్లు ఎత్తి పోతిరెడ్డిపాడుకు 11 వేలు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,054, హంద్రీ–నీవాకు 1,100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ గట్టు కేంద్రాల ద్వారా నిరంతరాయంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. దాంతో సాగర్‌లోకి 1,84,262 క్యూసెక్కుల వరద చేరుతోంది. ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో 548 అడుగుల్లో 204.305 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సాగర్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు. పూర్తిస్థాయి నీటి నిల్వ 312.045 టీఎంసీలు. అంటే సాగర్ నిండటానికి ఇంకా 98 టీఎంసీలు అవసరం. వరద ప్రవాహం ఇదే రీతిలో కొనసాగితే మరో వారంలో సాగర్ గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఆదివారం జలాశయానికి వరద పెరగడంతో నీటిమట్టం క్రస్ట్‌గేట్లను తాకింది. నీటిమట్టం రోజుకు ఏడు అడుగుల చొప్పున పెరుగుతోంది. సాగర్‌కు దిగువన నదీ పరీవాహకంలో కురిసిన వర్షాలకు పులిచింతల ప్రాజెక్టులోకి కృష్ణా వరద ప్రవా హం నిలకడగా కొనసాగుతోంది. ఆదివారం 6,314 క్యూసెక్కులకు చేరడంతో పులిచింతల ప్రాజెక్టులో నీటినిల్వ 14.47 టీఎంసీలకు చేరుకుంది. తుంగభద్ర జలాశయంలోకి కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆదివారం 14,756 క్యూసెక్కులు చేరడంతో తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వ 85.58 టీఎంసీలకు చేరింది. సోమశిలలోకి పెన్నా వరద ప్రవా హం శనివారంతో పోల్చితే ఆదివారం తగ్గింది. ఈ ప్రాజెక్టులో నీటినిల్వ 40.96 టీఎంసీలకు చేరుకుంది. కృష్ణాలో అనూహ్యంగా నీటి లభ్యత పెరిగిన నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు జలాల పంపిణీపై కృష్ణా బోర్డు కసరత్తు చేస్తోంది. నీటిలెక్కలు తేలాక శ్రీశైలం, సాగర్ ఆయకట్టులో రబీ పంటల సాగుకు నీటిని విడుదల చేయనున్నారు. -
శ్రీశైలంలో 131.55 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులతోపాటు తెలంగాణలోని జూరాల జలాశయం నుంచి భారీగా వరదను దిగువకు విడుదల చేస్తుండటంతో ఆదివారం శ్రీశైలం జలాశయంలోకి 1,59,506 క్యూసెక్కుల ప్రవాహం చేరింది. జలాశయంలో ప్రస్తుతం 867.5 అడుగుల నీటిమట్టం వద్ద 131.55 టీఎంసీల నీటి నిల్వ ఉంది. దీంతో అధికారులు విద్యుదుత్పత్తి ప్రారంబించారు. జలాశయం నుంచి విడుదల చేస్తున్న నీటిలో 42,378 క్యూసెక్కులు నాగార్జున సాగర్‌కు చేరుతున్నాయి. గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాల కోసం కుడి కాలువకు 2 వేల క్యూసెక్కులు, హైదరాబాద్, నల్లగొండ తాగునీటి అవసరాల కోసం 1,436 క్యూసెక్కులను అధికారులు వదులుతున్నారు. ప్రస్తుతం నాగార్జున సాగర్‌లో 510.3 అడుగుల వద్ద 132.18 టీఎంసీల నిల్వ ఉంది. వరద ప్రవాహం ఇదే రీతిలో మరో నాలుగైదు రోజులు కొనసాగే అవకాశం ఉండటంతో శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల ఆయకట్టు కింద రబీ పంటల సాగుకు నీటిని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ శ్రీశైలం జలాశయానికి 125.29 టీఎంసీలు రాగా.. గతేడాది ఇదే రోజు నాటికి 235.60 టీఎంసీలు వచ్చింది. వచ్చే 15 రోజుల్లో ఎగువ నుంచి కనీసం 70 నుంచి 75 టీఎంసీల ప్రవాహం వచ్చే అవకాశం ఉండటంతో జలాశయంలో నీటి నిల్వ 200 టీఎంసీలు దాటే అవకాశం ఉంది. ఇందులో కనీసం 70 టీఎంసీలు రెండు రాష్ట్రాల తాగునీటి అవసరాలకు కేటాయించి.. మిగతా 130 టీఎంసీలను రబీలో ఆరుతడి పంటలకైనా నీటిని విడుదల చేసే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. -
శ్రీశైలానికి పెరుగుతున్న ఇన్‌ఫ్లో
శ్రీశైలంప్రాజెక్టు: శ్రీశైల జలాశయానికి ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి వచ్చే ఇన్‌ఫ్లో పెరుగుతోంది. సోమవారం 16వేల క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో మంగళవారం సాయంత్రం సమయానికి 35,645 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. జూరాల నుంచి 13వేల క్యూసెక్కులు, హంద్రీ నుంచి 250 క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి 22,395 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలో 53.2754 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. డ్యాం నీటిమట్టం 833.50 అడుగులుగా నమోదైంది. -
కదంతొక్కిన నిర్వాసితులు
►కొల్లాపూర్‌లో భారీర్యాలీ, మంత్రి జూపల్లి ఇంటి ముట్టడి ►పార్టీలు, ప్రజాసంఘాల నేతల మద్దతు ►శ్రీశైలం ముంపు బాధితులను ఆదుకోవాలని డిమాండ్ కొల్లాపూర్ : శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితులు కదం తొక్కారు. తమకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ముంపు బాధితుల పట్ల ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టారు. మంగళవారం కొల్లాపూర్‌లో భారీర్యాలీ నిర్వహించారు. వారి పోరాటానికి పలువురు ప్రజాసంఘాలు, రాజకీయపార్టీల నేతలు మద్దతు తెలిపారు. న్యాయమైన పోరాటానికి అండగా ఉంటామని భరోసాఇచ్చారు. అనంతరం స్థానిక మహబూబ్ ఫంక్షన్హాల్లో జరిగిన సభకు ముఖ్యఅతిథిగా హాజరైన ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం వల్ల సర్వస్వం కోల్పోయిన నిర్వాసితులను పైకి రానివ్వకుండా పాలకులు ముంచేస్తున్నారని మండిపడ్డారు. నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం ద ృష్టికి తీసుకెళ్తానన్నారు. జీఓ 98ను రద్దు చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర పన్నుతుందన్నారు. టీపీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటి మాట్లాడుతూ.. ఉద్యమాలతో మంత్రి అయిన హరీష్‌రావు ఇప్పుడు నిర్వాసితుల గురించి పట్టించుకోవడంలేదన్నారు. జిల్లాకు చెందిన మంత్రులపై ఒత్తిడి తీసుకొస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితులకు సూపర్‌న్యూమరీ పోస్టులు ఇవ్వాలని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రాంభూపాల్‌రెడ్డి కోరారు. జీఓ 98, జీఓ 68 అమలులో న్యాయపరమైన సమస్యలు ఉన్నాయన్నారు. సాంకేతిక కారణాలను సాకుగా చూపి తప్పించుకునేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులైన వారందరికీ ఉద్యోగాలు కల్పించాలన్నారు. ఉద్యమాల సత్తా ఏమిటో మంత్రి జూపల్లికి తెలుసని, స్పందించకుంటే ఆయనకు పరాభవం తప్పదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగూరావు నామాజీ, ప్రధాన కార్యదర్శి టి.ఆచారి అన్నారు. నిర్వాసితుల సమస్యలను అసెంబ్లీలో చర్చించేలా బీజేపీ ఎమ్మెల్యేలకు విన్నవిస్తామన్నారు. తెలంగాణ వచ్చాక కూడా సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేయాలా అని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి అన్నారు. కార్యక్రమంలో బీజేపీ మహిళామోర్చా రాష్ట్ర నాయకురాలు పద్మజారెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి బీరం హర్షవర్ధన్‌రెడ్డి, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ప స్పుల రామకృష్ణ, సీపీఐ జిల్లా నాయకులు ఫయాజ్, టీజేఏసీ, శ్రీశైలం ని ర్వాసిత నిరుద్యోగ సంఘాల నాయకులు చంద్రారెడ్డి, అనంతరెడ్డి, రా జారాంప్రకాశ్, సుబ్బయ్యయాదవ్, బాబుగౌడ్, కుర్మయ్య పాల్గొన్నారు.