సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులతోపాటు తెలంగాణలోని జూరాల జలాశయం నుంచి భారీగా వరదను దిగువకు విడుదల చేస్తుండటంతో ఆదివారం శ్రీశైలం జలాశయంలోకి 1,59,506 క్యూసెక్కుల ప్రవాహం చేరింది. జలాశయంలో ప్రస్తుతం 867.5 అడుగుల నీటిమట్టం వద్ద 131.55 టీఎంసీల నీటి నిల్వ ఉంది. దీంతో అధికారులు విద్యుదుత్పత్తి ప్రారంబించారు. జలాశయం నుంచి విడుదల చేస్తున్న నీటిలో 42,378 క్యూసెక్కులు నాగార్జున సాగర్‌కు చేరుతున్నాయి. గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాల కోసం కుడి కాలువకు 2 వేల క్యూసెక్కులు, హైదరాబాద్, నల్లగొండ తాగునీటి అవసరాల కోసం 1,436 క్యూసెక్కులను అధికారులు వదులుతున్నారు. ప్రస్తుతం నాగార్జున సాగర్‌లో 510.3 అడుగుల వద్ద 132.18 టీఎంసీల నిల్వ ఉంది.
వరద ప్రవాహం ఇదే రీతిలో మరో నాలుగైదు రోజులు కొనసాగే అవకాశం ఉండటంతో శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల ఆయకట్టు కింద రబీ పంటల సాగుకు నీటిని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ శ్రీశైలం జలాశయానికి 125.29 టీఎంసీలు రాగా.. గతేడాది ఇదే రోజు నాటికి 235.60 టీఎంసీలు వచ్చింది. వచ్చే 15 రోజుల్లో ఎగువ నుంచి కనీసం 70 నుంచి 75 టీఎంసీల ప్రవాహం వచ్చే అవకాశం ఉండటంతో జలాశయంలో నీటి నిల్వ 200 టీఎంసీలు దాటే అవకాశం ఉంది. ఇందులో కనీసం 70 టీఎంసీలు రెండు రాష్ట్రాల తాగునీటి అవసరాలకు కేటాయించి.. మిగతా 130 టీఎంసీలను రబీలో ఆరుతడి పంటలకైనా నీటిని విడుదల చేసే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
Published Mon, Sep 25 2017 2:16 AM | Last Updated on Wed, Aug 1 2018 3:59 PM
Advertisement