సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ వైపు కృష్ణమ్మ బిరబిరా పరుగులిడుతోంది. కృష్ణా, దాని ఉప నదుల నుంచి ఆదివారం ఉదయం 9 గంటలకు శ్రీశైలం జలాశయంలోకి 2,48,866 క్యూసెక్కుల వరద రాగా రాత్రి 7 గంటలకల్లా 1,28,460 క్యూసెక్కులకు తగ్గింది. శ్రీశైలం ఏడు గేట్లు ఎత్తి పోతిరెడ్డిపాడుకు 11 వేలు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,054, హంద్రీ–నీవాకు 1,100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ గట్టు కేంద్రాల ద్వారా నిరంతరాయంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు.
దాంతో సాగర్‌లోకి 1,84,262 క్యూసెక్కుల వరద చేరుతోంది. ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో 548 అడుగుల్లో 204.305 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సాగర్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు. పూర్తిస్థాయి నీటి నిల్వ 312.045 టీఎంసీలు. అంటే సాగర్ నిండటానికి ఇంకా 98 టీఎంసీలు అవసరం. వరద ప్రవాహం ఇదే రీతిలో కొనసాగితే మరో వారంలో సాగర్ గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఆదివారం జలాశయానికి వరద పెరగడంతో నీటిమట్టం క్రస్ట్‌గేట్లను తాకింది. నీటిమట్టం రోజుకు ఏడు అడుగుల చొప్పున పెరుగుతోంది.
సాగర్‌కు దిగువన నదీ పరీవాహకంలో కురిసిన వర్షాలకు పులిచింతల ప్రాజెక్టులోకి కృష్ణా వరద ప్రవా హం నిలకడగా కొనసాగుతోంది. ఆదివారం 6,314 క్యూసెక్కులకు చేరడంతో పులిచింతల ప్రాజెక్టులో నీటినిల్వ 14.47 టీఎంసీలకు చేరుకుంది. తుంగభద్ర జలాశయంలోకి కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆదివారం 14,756 క్యూసెక్కులు చేరడంతో తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వ 85.58 టీఎంసీలకు చేరింది.
సోమశిలలోకి పెన్నా వరద ప్రవా హం శనివారంతో పోల్చితే ఆదివారం తగ్గింది. ఈ ప్రాజెక్టులో నీటినిల్వ 40.96 టీఎంసీలకు చేరుకుంది. కృష్ణాలో అనూహ్యంగా నీటి లభ్యత పెరిగిన నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు జలాల పంపిణీపై కృష్ణా బోర్డు కసరత్తు చేస్తోంది. నీటిలెక్కలు తేలాక శ్రీశైలం, సాగర్ ఆయకట్టులో రబీ పంటల సాగుకు నీటిని విడుదల చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment