ఎడమగట్టులోని భూగర్భజల విద్యుత్ కేంద్రంలో ప్రమాదం తర్వాత ఇలా..
సాక్షి, నాగర్‌కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రం ప్రారంభం నుంచి ప్రమాదం వరకు కృష్ణానదిపై ఉన్న అన్ని జల విద్యుత్ కేంద్రాలతో పోలిస్తే విద్యుధుత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రమంతా విద్యుత్ వెలుగులు పంచిన ఈ వెలుగుల దివ్వెలో ఈ నెల 20న జరిగిన ప్రమాదంతో చీకట్లు కమ్ముకున్నాయి. భారీ అగ్నిప్రమాదానికి ఏడుగురు విద్యుత్ ఉద్యోగులు మరణించడంతోపాటు ఇద్దరు అమరాన్‌రాజ బ్యాటరీ కంపెనీకి చెందిన ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. పవర్‌హౌస్‌లోని ప్యానెల్‌బోర్డులు, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ వైర్లు కాలిపోయాయి.
విద్యుత్ కాంతులతో మెరిసే ప్లాంట్‌లోని లోపలి దృశ్యం పొగతో నల్లగా మారింది. ఈ ప్రమాదంపై ఇప్పటికే సీఐడీ, నిపుణుల కమిటీ విచారణ కొనసాగుతుంది. మరోవైపు విద్యుత్ కేంద్రంలో పునరుద్ధరణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రెండు అంతస్తుల్లో నిండుకున్న నీటి తోడిపోత కొలిక్కివచ్చింది. అనుకోని ఘటనతో భారీగా నష్టం వాటిల్లిన శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పరిశీలిస్తే ప్రతి ఏటా రికార్డు స్థాయిలో విద్యుదుత్పత్తి చేయడం గమనార్హం.
ఆది నుంచి అగ్రభాగమే
రాష్ట్రానికే తలమానికంగా ఉన్న శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రం ప్రారంభించినప్పటికి నుంచి విద్యుదుత్పత్తిలో అగ్రభాగాన నిలుస్తూ తెలుగు రాష్ట్రాలకు విద్యుత్ వెలుగులు పంచింది. జపాన్ సాంకేతిక పరిజ్ఞానంతో ఆనాటి ఏపీఎస్‌ఈబీ ఆధ్వర్యంలో 1992లో భూగర్భ జల విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. సివిల్ పనులతోపాటు కేంద్రంలోని ఆరు యూనిట్ల నిర్మాణాలు 2003 వరకు పూర్తయ్యాయి. కాగా తొలి యూనిట్ 2001లో పూర్తవగా.. తదుపరి ప్రతి ఆరు నెలలకు ఒక యూనిట్ చొప్పున పూర్తయ్యాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ కేంద్రం పూర్తిస్థాయి విద్యుదుత్పత్తి సామర్థ్యం 900 మెగావాట్లు. 6 యూనిట్ల ద్వారా ప్రతిరోజు 900 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది.
నిలిచిన విద్యుదుత్పత్తి
రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు పంచిన శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో ఈ నెల 20న జరిగిన ప్రమాదంతో ప్రస్తుతం ఉత్పత్తి పూర్తిస్థాయిలో నిలిచిపోయింది. కాంతివంతంగా ఉండే పవర్‌హౌస్‌లోపలి దృశ్యం పొగతో నల్లబారింది. ప్యా నల్ బోర్డులు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిబూడిదయ్యాయి. విద్యు త్ వైర్లు, పరికరాలు కాలిపోయాయి. బేస్‌బేలో టర్బైన్ల చు ట్టూ కాంక్రీట్, ఫోరింగ్ ధ్వంసమైంది. ప్రస్తుతం పునరుద్ధర ణ పనులను అధికారులు వేగవంతం చేశారు. ఇప్పటికే పా రిశుద్ధ్య పనులు పూర్తి కాగా.. బయటి నుంచి విద్యుత్ తీసుకొని పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. రెండు అంతస్తుల్లో నిండుకున్న లీకేజీ నీటిని మోటార్ల ద్వారా తోడిపోత కొలిక్కి వచ్చింది.
త్వరలోనే యథావిధిగా విద్యుదుత్పత్తి చేస్తామని అధికారులు ప్రకటించినా జపాన్ నుంచి నిపు ణులు వచ్చిన తర్వాతనే ప్రారంభిస్తారని తెలుస్తుంది. అయి తే సీఐడీ అధికారులు, నిపుణుల కమిటీ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఆయా విభాగాల్లో పనిచేసే ఉద్యోగులను విచారించి వివరాలు నమోదు చేసుకున్నట్లు సమాచారం. మొత్తంగా రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు పంచిన శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో త్వరగా విద్యుదుత్పత్తి ప్రారంభం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇలా..
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు 7 వేల మిలియన్ యూనిట్లకుపైగా విద్యుత్ ఉత్పత్తి చేసింది. 2014– 15లో 1,802.583 మి.యూ, 2015– 16లో 155.263 మి.యూ, 2016– 17లో 616.832 మి.యూ, 2017– 18లో 826.490 మి.యూ, 2018– 19లో 984.396 మి.యూ, విద్యుదుత్పత్తి చేశారు. అలాగే గతేడాది 1,289 మి.యూ, ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించుకోగా 1993 మి.యూ సాధించారు. ఇక ఈ ఏడాది (2020– 21) జూలై 17 నుంచి భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి ప్రారంభమైంది.
అప్పటి నుంచి మొత్తం ఆరు యూనిట్ల ద్వారా 24 గంటల వ్యవధిలో 20 మి.యూచొప్పున విద్యుదుత్పత్తి చేశారు. ఈ ఏడాది లక్ష్యం 1,400 మి.యూ, కాగా ప్రమాదం జరిగిన నాటికి అంటే కేవలం 32 రోజుల్లోనే దాదాపుగా 656 మి.యూ, ఉత్పత్తి చేసినట్లు అధికార వర్గాల ద్వారా సమాచారం. ఈ విధంగా శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం ద్వారా మొత్తం 7,034 మి.యూ, విద్యుదుత్పత్తి చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment