IMD Predicts Heavy Rain Forecast For AP Due To Cyclone Mandous - Sakshi
Sakshi News home page

ఏపీని తాకనున్న ‘మాండూస్‌’ 

Published Wed, Dec 7 2022 7:05 AM | Last Updated on Wed, Dec 7 2022 4:27 PM

Heavy Rain Forecast For AP Due To Cyclone Mandous - Sakshi

సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/సూళ్లూరుపేట: దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం సాయంత్రానికి వాయుగుండంగా బలపడింది. మంగళవారం రాత్రికి ఇది చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 1,020 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండం బుధవారం సాయంత్రానికి పశ్చిమ వాయవ్యదిశలో కదులుతూ మాండూస్‌ తుపానుగా బలపడి గురువారం ఉదయానికి నైరుతి బంగాళాఖాతంలోని ఉత్తర తమిళనాడు–పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరానికి సమీపంలోకి చేరుకుంటుంది. 

అనంతరం అదేదిశలో పయనిస్తూ 48 గంటల పాటు అదేప్రాంతంలో కొనసాగనుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం రాత్రి విడుదల చేసిన ప్రత్యేక బులెటిన్‌లో వెల్లడించింది. మాండూస్‌ తుపాను 9వ తేదీన తమిళనాడులోని మహాబలిపురం సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. తుపానుగానైనా లేకపోతే బలహీనపడి వాయుగుండంగానైనా తీరం దాటిన తరువాత ఇది చిత్తూరు వైపు కదులుతూ క్రమంగా ఇంకా బలహీనపడే అవకాశం ఉంది. దీని ప్రభావం 8, 9, 10 తేదీల్లో ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాలపై ఉండనుంది. ఈ జిల్లాల్లో అక్కడక్కడా భారీనుంచి అతిభారీ వర్షాలు పడతాయని, మిగిలినచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. 

గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉత్తర కోస్తాంధ్రలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. సముద్రం అలజడిగా మారుతుందని, అందువల్ల మత్స్యకారులు ఈ నెల 10వ తేదీ వరకు చేపలవేటకు వెళ్లవద్దని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే వెనక్కి తిరిగిరావాలని కోరింది. 

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కచ్చా ఇళ్లకు నష్టం వాటిల్లుతుందని, విద్యుత్, సమాచార, రవాణా వ్యవస్థలకు అంతరాయం కలుగుతుందని, చెట్లు కూలే ప్రమాదం ఉందని, పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని, పల్లపు ప్రాంతాలు ముంపునకు గురయ్యే వీలుందని పే­ర్కొంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జా­గ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీ.ఆర్‌.అంబేద్కర్‌ కోరారు. బుధ­వారం నుంచి ఈనెల 10వ తేదీ వరకు పులికాట్‌ సరస్సులో చేపలవేటకు వెళ్లవద్దని సూళ్లూరుపేట ఆర్డీవో కె.ఎం.రోజ్‌మాండ్‌ మత్స్యకారులకు సూచించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement