కోనో కార్పస్ చెట్ల కొట్టివేతపై హైకోర్టు ధర్మాసనం
చెట్ల కొట్టివేతపై పూర్తి వివరాలివ్వాలని ప్రభుత్వానికి ఆదేశం
మీరెన్ని చెట్లు నాటారో చెప్పాలని పిటిషనర్లకు ఆదేశం
విచారణ నవంబర్ 6కి వాయిదా
సాక్షి, అమరావతి : మానవాళికి ముప్పుగా పరిణవిుంచినప్పుడు ఏ చెట్లనైనా కొట్టేయడంలో తప్పేమీ లేదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం అభిప్రాయపడింది. కోనో కార్పస్ చెట్ల విషయంలో అలాంటి ముప్పు ఉందని భావించే వాటిని నరికేస్తుండవచ్చని తెలిపింది. జమ్ము కశ్మీర్‌లో ఇలాగే ఓ రకం చెట్ల నుంచి వచ్చే దూది లాంటి పదార్థం వల్ల అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, చివరికి ఇంటి నుంచి బయటకు వచ్చే ప్రతి వ్యక్తీ మాస్క్ ధరించాల్సి వచ్చేదని తెలిపింది.
కోనో కార్పస్ చెట్ల విషయంలో కూడా అలాంటి పరిస్థితి ఉండొచ్చునని, అందుకే వాటిని తొల గించాలని నిర్ణయించి ఉంటారని చెప్పింది. కోనో కార్పస్ చెట్లను కొట్టేయకుండా, ఇవి మానవాళికి హానికరమో కాదో తేల్చేందుకు నిపుణుల కమిటీని నియమించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి, నాగార్జున వర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ డాక్టర్ కె.బయపురెడ్డి, హైదరాబాద్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కె.రామచంద్రారెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై సీజే ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) విష్ణుతేజ వాదనలు వినిపిస్తూ.. కోనో కార్పస్ చెట్లపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయని, వాటి ఆధారంగా కాకినాడ, నెల్లూరు జిల్లాల్లో దాదాపు 645 చెట్లు కొట్టేశారన్నారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు స్పందిస్తూ.. శాస్త్రీయ అధ్యయనం చేయకుండా చెట్లను కొట్టేయడం సరికాదన్నారు.
వాదనలు విన్న ధర్మాసనం ఈ విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అసలు చెట్లు నాటేందుకు మీరేం చర్యలు తీసుకున్నారు? ఇప్పటివరకు ఎన్ని నాటారు వంటి వివరాలను తమ ముందుంచాలని పిటిషనర్లను ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 6కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment