ఉంటే కౌంటర్లు దాఖలు చేయాలని పిటిషనర్లకు ధర్మాసనం ఆదేశం
తదుపరి విచారణ సోమవారానికి వాయిదా
స్టేటస్ కో ఉత్తర్వులవల్ల రూ.243 కోట్లు నిలిచిపోయాయి
అందువల్ల వాటిని సవరించాలని కోరిన యాజమాన్యం
ధర్మాసనాన్ని అభ్యర్థించిన విశాఖ ఉక్కు యాజమాన్యం
ఈ ప్రభుత్వం వచ్చాక పోలీసులు వేధిస్తున్నారని ధర్మాసనానికి పాల్ ఫిర్యాదు
రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేయాలన్న హైకోర్టు
సాక్షి, అమరావతి: కర్మాగార ఆర్థిక అవసరాల నిమిత్తం తమ సొంత ఆస్తులను విక్రయించుకునే హక్కు తమకుందని, గతంలో ఇచ్చిన స్టేటస్‌కో ఉత్తర్వులవల్ల తమ ఆస్తుల విక్రయ ప్రక్రియ నిలిచిపోయిందని, అందువల్ల ఆ ఉత్తర్వులను సవరించాలంటూ విశాఖ ఉక్కు యాజమాన్యం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై అభ్యంతరం ఉన్న పిటిషనర్లు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
ఈ కౌంటర్లు శుక్రవారం కల్లా దాఖలు చేయాలని స్పష్టంచేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ జగడం సుమతి ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.
ప్రైవేటీకరణపై వ్యాజ్యాలు..
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌తో పాటు సువర్ణరాజు అనే వ్యక్తి కూడా వేర్వేరుగా పిల్‌లు దాఖలు చేశారు. అలాగే, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, రేషన్ కార్డుదారులకు ఉద్యోగాలిస్తామన్న గత హామీ మేరకు ఉద్యోగాలిచ్చేలా ఆదేశాలివ్వాలంటూ కూడా పలువురు వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యాలన్నింటిపై జస్టిస్ దుర్గాప్రసాదరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతూ వస్తోంది. గతవారం ఈ వ్యాజ్యాలు విచారణకు రాగా, విశాఖ యాజమాన్యం తరఫు సీనియర్ న్యాయవాది డబ్ల్యూబీ శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం తాము సొంతగా ఏపీఐఐసీ, హౌసింగ్ బోర్డు నుంచి భూములు కొన్నామని, ఇలా తాము కొనుగోలు చేసిన 24.99 ఎకరాల భూమినే అమ్ముకుంటున్నామని తెలిపారు.
అయితే, హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌కో ఉత్తర్వులవల్ల భూముల విక్రయం ఆగిపోయిందన్నారు. అందువల్ల ఈ ఉత్తర్వులను సవరించాలని కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. యాజమాన్యం స్వీయ ఆస్తుల విక్రయంపై అభ్యంతరం ఉన్న పిటిషనర్లను కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే.
ఆ ఉత్తర్వులతో రూ.243 కోట్లు నిలిచిపోయాయి..
తాజాగా.. ఈ వ్యాజ్యాలు మంగళవారం మరోసారి విచారణకు వచ్చాయి. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది డబ్ల్యూబీ శ్రీనివాస్ తమ అనుబంధ పిటిషన్ గురించి ప్రస్తావించారు. అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు. ఆస్తుల విక్రయాల ద్వారా రూ.243 కోట్లు రావాల్సి ఉందని.. స్టేటస్‌కో ఉత్తర్వులవల్ల ఆ డబ్బు నిలిచిపోయిందన్నారు. దీంతో ధర్మాసనం స్పందిస్తూ.. కౌంటర్లు వేయని వాళ్లు శుక్రవారంకల్లా దాఖలు చేయాలని మరోసారి ఆదేశించి తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు : కేఏ పాల్
తనను కోర్టులోకి, కోర్టు హాలులోకి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని.. కొత్త ప్రభుత్వం వచ్చాకే ఇలా చేస్తున్నారని కేఏ పాల్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తే తనను అడ్డుకుంటున్న విషయం తెలుస్తుందన్నారు. దీంతో ధర్మాసనం ఒకింత తీవ్రంగా స్పందిస్తూ, ఎవరా పోలీసులు అంటూ ఆరా తీసి, అలా అయితే పోలీసులపై హైకోర్టు రిజిస్ట్రార్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని పాల్‌కు న్యాయస్థానం సూచించింది. తాము కూడా చర్యలకు ఆదేశాలిస్తామని చెప్పింది. ఒకవేళ మీరు చెబుతున్నది అబద్ధమని తేలితే చర్యలకు సిద్ధంగా ఉండాలని పాల్‌కు ధర్మాసనం తేల్చిచెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment