sumathi
-
‘విశాఖ ఉక్కు’ ఆస్తుల విక్రయంపై అభ్యంతరం ఉందా?
సాక్షి, అమరావతి: కర్మాగార ఆర్థిక అవసరాల నిమిత్తం తమ సొంత ఆస్తులను విక్రయించుకునే హక్కు తమకుందని, గతంలో ఇచ్చిన స్టేటస్కో ఉత్తర్వులవల్ల తమ ఆస్తుల విక్రయ ప్రక్రియ నిలిచిపోయిందని, అందువల్ల ఆ ఉత్తర్వులను సవరించాలంటూ విశాఖ ఉక్కు యాజమాన్యం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై అభ్యంతరం ఉన్న పిటిషనర్లు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కౌంటర్లు శుక్రవారం కల్లా దాఖలు చేయాలని స్పష్టంచేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ జగడం సుమతి ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.ప్రైవేటీకరణపై వ్యాజ్యాలు..విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌తో పాటు సువర్ణరాజు అనే వ్యక్తి కూడా వేర్వేరుగా పిల్లు దాఖలు చేశారు. అలాగే, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, రేషన్ కార్డుదారులకు ఉద్యోగాలిస్తామన్న గత హామీ మేరకు ఉద్యోగాలిచ్చేలా ఆదేశాలివ్వాలంటూ కూడా పలువురు వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై జస్టిస్ దుర్గాప్రసాదరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతూ వస్తోంది. గతవారం ఈ వ్యాజ్యాలు విచారణకు రాగా, విశాఖ యాజమాన్యం తరఫు సీనియర్ న్యాయవాది డబ్ల్యూబీ శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం తాము సొంతగా ఏపీఐఐసీ, హౌసింగ్ బోర్డు నుంచి భూములు కొన్నామని, ఇలా తాము కొనుగోలు చేసిన 24.99 ఎకరాల భూమినే అమ్ముకుంటున్నామని తెలిపారు. అయితే, హైకోర్టు ఇచ్చిన స్టేటస్కో ఉత్తర్వులవల్ల భూముల విక్రయం ఆగిపోయిందన్నారు. అందువల్ల ఈ ఉత్తర్వులను సవరించాలని కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. యాజమాన్యం స్వీయ ఆస్తుల విక్రయంపై అభ్యంతరం ఉన్న పిటిషనర్లను కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ ఉత్తర్వులతో రూ.243 కోట్లు నిలిచిపోయాయి..తాజాగా.. ఈ వ్యాజ్యాలు మంగళవారం మరోసారి విచారణకు వచ్చాయి. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది డబ్ల్యూబీ శ్రీనివాస్ తమ అనుబంధ పిటిషన్ గురించి ప్రస్తావించారు. అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు. ఆస్తుల విక్రయాల ద్వారా రూ.243 కోట్లు రావాల్సి ఉందని.. స్టేటస్కో ఉత్తర్వులవల్ల ఆ డబ్బు నిలిచిపోయిందన్నారు. దీంతో ధర్మాసనం స్పందిస్తూ.. కౌంటర్లు వేయని వాళ్లు శుక్రవారంకల్లా దాఖలు చేయాలని మరోసారి ఆదేశించి తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు : కేఏ పాల్తనను కోర్టులోకి, కోర్టు హాలులోకి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని.. కొత్త ప్రభుత్వం వచ్చాకే ఇలా చేస్తున్నారని కేఏ పాల్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తే తనను అడ్డుకుంటున్న విషయం తెలుస్తుందన్నారు. దీంతో ధర్మాసనం ఒకింత తీవ్రంగా స్పందిస్తూ, ఎవరా పోలీసులు అంటూ ఆరా తీసి, అలా అయితే పోలీసులపై హైకోర్టు రిజిస్ట్రార్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని పాల్‌కు న్యాయస్థానం సూచించింది. తాము కూడా చర్యలకు ఆదేశాలిస్తామని చెప్పింది. ఒకవేళ మీరు చెబుతున్నది అబద్ధమని తేలితే చర్యలకు సిద్ధంగా ఉండాలని పాల్‌కు ధర్మాసనం తేల్చిచెప్పింది. -
మెరుపులా వచ్చి కాపాడింది
పశ్చిమబెంగాల్లోని పుర్బ మేదినీపూర్ రైల్వేస్టేషన్లో... ప్లాట్‌ఫామ్‌పై నిల్చున్న ఒక వ్యక్తి ఉన్నట్టుండి పట్టాలపై తలపెట్టి పడుకున్నాడు. అటు నుంచి రైలు వస్తోంది. అవతలి ప్లాట్‌ఫామ్‌పై ఉన్న కె.సుమతి అనే రైల్వే కానిస్టేబుల్ మెరుపు వేగంతో పరుగెత్తుకు వచ్చి అతడిని పట్టాల మీది నుంచి బలవంతంగా లాక్కెళ్లింది. ఏమాత్రం ఆలస్యం అయినా అతడు చనిపోయేవాడు. దీనికి సంబంధించిన సీసీటీవి ఫుటేజిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీ ఎఫ్), ఇండియా ట్విట్టర్లో పోస్ట్ చేస్తే సుమతిపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ‘రైల్వేశాఖ మాత్రమే కాదు యావత్ దేశం గర్వించదగిన మహిళ’ ‘అంకితభావంతో కూడిన విధి నిర్వహణకు మానవత్వం, సాహసం తోడైతే... ఆ పేరు సుమతి’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో నెటిజనుల నుంచి వచ్చాయి. గత సంవత్సరం జార్ఖండ్‌లోని టాటానగర్ రైల్వేస్టేషన్లో మహిళా కానిస్టేబుల్ ఎస్కే మీనా ఒక వ్యక్తి రైలుకింద పడకుండా కాపాడిన వీడియో వైరల్ అయింది. -
తాళి కట్టే టైమ్‌కి ప్రియుడి ఎంట్రీ.. వరుడి చేతిలో..
తిరువొత్తియూరు (చెన్నై): వరుడి చేతిలో ఉన్న తాళిని లాక్కుని వధువు మెడలో కట్టడానికి యత్నంచిన ప్రేమికుడిని వధువు సోదరుడు, బంధువులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన ఘటన చెన్నై తండయార్ పేటలో జరిగింది. సినిమా తరహాలో జరిగిన ఈ వ్యవహారం అక్కడున్న వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది. వివరాల్లోకి వెళితే.. చెన్నై తండయారుపేటకు చెందిన సుమతి (20). ఈమెకు అదే ప్రాంతానికి చెందిన రాజ్ (21) నౌక ఇంజినీర్‌తో నాలుగు నెలల క్రితం వివాహ నిశ్చితార్థం జరిగింది. తండయార్‌పేట నేతాజీ నగర్లో శుక్రవారం వివాహం జరగాల్సి ఉంది. ఇరు కుటుంబాల వారు వివాహ ఏర్పాట్లు పూర్తి చేశారు. ముహూర్తం దగ్గర పడుతున్న సమయంలో సుమారు 7 గంటలకు మంగళ వాయిద్యాలు వాయిస్తుండగా వరుడు తాళిని తీసుకుని వధువు మెడలో కట్టేందుకు సిద్ధమయ్యాడు. చదవండి: (‘104’ మృత్యు మార్గాలు.. ఈ దారుల్లోనే అత్యధిక ప్రమాదాలు) సరిగ్గా అదే సమయంలో అక్కడ నిలబడి ఉన్న యువకుడు ముందుకు దూసుకువచ్చి వరుడి చేతిలో ఉన్న తాళిని లాక్కుని వధువు మెడలో కట్టడానికి ప్రయత్నించాడు. ఇది చూసిన అక్కడి వారు అందరూ ఒక్క క్షణం నివ్వెర పోయారు. అక్కడే నిలబడి ఉన్న వధువు అన్న, బంధువులు యువకుడి చేతి నుంచి తాళి లాక్కుని అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో యువకుడు తండయార్ పేటకు చెందిన సుందరేష్ (25)గా గుర్తించారు. చాకలి పేటలోని ప్రముఖ నగల దుకాణంలో సుమతితో కలిసి పని చేసేవాడని నిర్ధారించారు. వీరిద్దరు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారని, తల్లిదండ్రులను ఒప్పించలేక వివాహం జరుగుతున్న సమయంలో ఈ చర్యకు ప్రయత్నించినట్లు తెలిసింది. వివాహం జరిగిన సమయంలో అతను బంధువుగా వచ్చి ఏమి తెలియనట్లు పక్కన నిలబడి సరిగ్గా వివాహం జరిగే సమయంలో హఠాత్తుగా తాళి కట్టడానికి ప్రయత్నించినట్లు తెలిసింది. అయితే జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. వధువు బంధువులు, వరుడి కుటుంబ సభ్యులతో మాట్లాడినా ఫలితం లేకపోయింది. -
వినయమే బలం.. ‘నువ్వు నాకంటే తక్కువ’ అని విర్రవీగితే ఇక అంతే!
ఒకడు బాగా రాస్తాడు, ఒకడికి జ్ఞాపకశక్తి బాగా ఉంటుంది. ఒకడు బాగా పాడతాడు, ఒకడు బాగా అలంకారం చేస్తాడు, ఒకడు బాగా మాట్లాడతాడు...ఏది ఉన్నా అది భగవంతుడు వాడికి ఇచ్చిన విభూతి. ‘‘యద్యత్ విభూతిరాతిమత్ సత్వం శ్రీమదూర్జిత మేవనా/తత్తదేవావగచ్ఛత్వం మమ తేజోంశ సంభవమ్’’ అంటాడు గీతాచార్యుడు. ఎక్కడెక్కడ ఏ ఉత్కృష్టమయిన ప్రాణి ఉన్నా అది పరమేశ్వరుడి విభూతి. ‘అది ఈశ్వరుడు నాకు అనుగ్రహించిన మహత్తరమైన శక్తి’ అని ఎవరయితే నమస్కారం పెట్టి వినయంతో బతుకుతుంటాడో వాడు వృద్ధిలోకి వస్తాడు. ఇదంతా నా మహిమే.. నాతో సాటిరాగల వాడు లేడు.. అని విర్రవీగుతాడో వాడు ఎప్పటికీ ముందుకు పోలేడు. పాడయి పోతాడు. ‘నువ్వు నాకంటే తక్కువ’ అని ఎవర్నయినా తూలనాడుతూ తక్కువచేసి ప్రవర్తిస్తే... అవతలి వాడు సాధనచేసి ఏదో ఒకరోజు నిన్ను దాటిపోతాడు. నిజంగా అవతలివాడు నీకన్నా తక్కువ అనిపించినప్పుడు సానుభూతితో, ప్రేమతో పెద్ద మనసు చేసుకొని వాడిని వృద్ధిలోకి తీసుకురావడానికి నీ వంతు ప్రయత్నం నీవు చేయడం ధర్మం అవుతుంది. అది లేనప్పుడు... ‘‘కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతింబొందరే?/వారేరీ సిరిమూటగట్టుకుని పోవంజాలరే? భూమిపై/ బేరైనంగలదే? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశఃకాములై/యీరే కోర్కులు? వారలన్ మరచిరే యిక్కాలమున్ భార్గవా!’’ ఈ పద్యం మనందరికీ తెలిసిందే. అంటే పొగరుబోతు తనంతో నీవు బావుకునేదేమీ ఉండదు. వినయంతో ప్రవర్తించిన వాళ్ళను చరిత్ర ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటుంది. సంస్కృత భాగవతాన్ని అద్భుతంగా ఆంధ్రీకరించిన పోతనామాత్యుడు ఎక్కడా ఆ ప్రతిభ తనదికానే కాదన్నాడు. ‘‘పలికెడిది భాగవతమట/పలికించు విభుండు రామభద్రుండట /నేపలికిన భవహరమగునట/పలికెద; వేరొండు గాథ పలుకగనేలా!’’ అన్నాడు. నేను కానే కాదు, ఆ రామచంద్రమూర్తి నా వెనుక ఉండి నాచేత దానిని ఆంధ్రీకరింప చేస్తున్నాడు. ఆయన నాతో ఏది చేయిస్తున్నాడో అదే చేస్తాను తప్ప మరొకటి చేసే శక్తి నాకు లేదు... అని నిలబడినందుకు తరతరాలుగా ప్రజలు ఆ మహాకవిని గుండెల్లో పెట్టుకుని అభిమానిస్తున్నారు. హనుమ కూడా... ‘లంకకు వెళ్లిరాగల శక్తి నాకు పుష్కలంగా ఉంది’ అన్లేదు. రామచంద్ర మూర్తి బంగారు కోదండాన్ని పట్టుకొని అక్షయ బాణ తూణీరం లోంచి ఒక బాణాన్ని తీసి వింటినారిని సంధించి ఆకర్ణాంతం లాగి విడిచిపెట్టినప్పుడు రాముడి శక్తి బాణంలోకి వెళ్ళి లక్ష్యం మీద ఎలా పడుతుందో ఆయన అనుగ్రహంతో ఆయన శక్తి నాలో ప్రవేశించినందువల్ల లంకాపట్టణానికి వెళ్ళగలుగుతున్నాను తప్ప నాకుగా ఆ శక్తి లేదు’ అని సవినయంగా చెప్పుకొన్న కారణంతో సదా రాముడి కనుసన్నలలో మెలిగే అదృష్టాన్ని పొందాడు హనుమ. అందుకే ఈరోజున రాముడి గుడి లేని ఊరు లేనట్టే, హనుమంతుడి విగ్రహం లేని వీథి లేదు. వినయం అంటే అదీ. బలవంతుడనాకేమని ...అని చెప్పిన బద్దెన గారే సుమతీ శతకంలో మరో చోట ఇలా అంటారు. ‘‘అధరము గదిలియు గదలక / మధురములగు భాషలుడిగి మౌనవ్రతుడై/ అధికార రోగపూరిత బధిరాంధక శవము జూడబాపము సుమతీ’’... అధికారంతో విర్రవీగుతూ ఎవరితో మాట్లాడనివాడు అధికారం అన్నరోగం సోకి శవంగా మారినవాడు...అని ఘాటుగా విమర్శించారు. ఇష్టమైన ఆహార పదార్థాలను ఆస్వాదిస్తూ తిన్నట్లుగా తెలుగులో ఉన్న మంచి పద్యాలను కూడా జ్ఞాపకం పెట్టుకొంటే జీవితంలో అక్కరకు వస్తాయి. (సుమతీ శతక నీతి పద్యాలు ఇంతటితో సమాప్తం) బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
‘బాల భటులు’ సిద్ధం.. దేశ పోలీసు చరిత్రలో తొలిసారి
సాక్షి, హైదరాబాద్: ‘నేను పొందిన అవగాహన తో నన్ను నేను రక్షించుకోవడంతో పాటు సమాజాన్ని సంరక్షిస్తానని, నా పాఠశాలలో ఉన్న పిల్లలు, పెద్దలు ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే వారికి సహాయం చేస్తానని, సలహాలు సూచనలు ఇస్తానని, సైబర్ పోలీసులకు, షీ–టీమ్స్‌కు సమాజానికి మధ్య వారధిగా ఉంటానని ప్రమాణం చేస్తున్నా’ మంగళవారం తెలంగాణలోని 1650 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ‘బాల భటులు’ చేసిన ప్రమాణమిది. దేశ పోలీసు చరిత్రలోనే తొలిసారిగా తెలంగాణ పోలీసులు ఈ ప్రయోగం చేశారు. సైబర్ నేరాలను నిరోధించడానికి రాష్ట్ర మహిళ భద్రత విభాగం అమల్లోకి తెచ్చిందే ‘సైబర్ కాంగ్రెస్’. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు సైబర్ అంబాసిడర్లుగా తీర్చిదిద్దారు. విద్యాశాఖ అధికారులతో కలసి వర్చువల్‌గా 3 నెలల పాటు శిక్షణ ఇచ్చారు. ఈ బాల భటులు మంగళవారం నుంచి అధికారికంగా రంగంలోకి దిగారు. మొత్తం 33 జిల్లాల్లోని జిల్లా పరిషత్ స్కూళ్లలో జరిగిన కార్యక్రమాల్లో బాల భటులకు బ్యాడ్జీలు అందించారు. నగరంలోని మహబూబియా స్కూల్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మహిళా భద్రత విభాగం అదనపు డీజీ స్వాతి లక్రా, డీఐజీ సుమతి పాల్గొన్నారు. వీరి పర్యవేక్షణలో సైబర్ నేరాలపై చైతన్యం, అవగాహన కల్పించేందుకు సైబ్–హర్ క్యాంపెయినింగ్ జరిగింది. దీనికి కొనసాగింపుగా సైబర్ కాంగ్రెస్ చేపట్టారు. ఒక్కో పాఠశాల నుంచి ఇద్దరు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఉన్న పాఠశాలలను 16 యూనిట్లుగా చేశారు. విద్యా శాఖ, పోలీసు విభాగంతో పాటు స్వచ్ఛంద సంస్థ యంగిస్తాన్ ఫౌండేషన్‌తో కలసి మహిళా భద్రత విభాగం పని చేసింది. ఒక్కో ప్రభుత్వ పాఠశాల నుంచి 8, 9 తరగతులు చదువుతున్న ఇద్దరిని ఎంపిక చేశారు. వీరికి సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఇతరుల్లో అవగాహన పెంచడంతో పాటు బాధితులకు సహకరించే విధానాలు నేర్పారు. స్థానిక పోలీసుస్టేషన్లకు చెందిన ఇన్స్పెక్టర్లు అనుసంధానకర్తలుగా పని చేస్తారు. మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాలపై దృష్టి పెట్టారు. సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా చైతన్యం కలిగించడంతో పాటు బాలికల భద్రతకు భంగం వాటిల్లకూడదనే లక్ష్యంతో ముందుకెళ్లారు. ఈ విద్యార్థులకు సైబర్ నేరాలపై ప్రతి వారం ఆన్లైన్లో తరగతులు నిర్వహించారు. ఎదురయ్యే సమస్యలను తెలియజేయడంతో పాటు వాటికి పరిష్కార మార్గాలను నేర్పారు. ఇంటర్నెట్ను ఎలా సద్వినియోగం చేసుకోవాలో వివరిస్తూ విద్యార్థుల నుంచి సమాచారం సేకరించారు. ఆన్లైన్ నేపథ్యంలో... కరోనా నేపథ్యంలో విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు తప్పనిసరయ్యాయి. చేతికి స్మార్ట్ఫోన్లు రావ డంతో క్లాసులతో పాటు యాప్‌ల వినియోగం, ఆన్ లైన్ గేమ్స్‌కు అలవాటు పడ్డారు. దీన్ని సైబర్ నేరగాళ్లు క్యాష్ చేసుకోవడంతో అనేకమంది విద్యా ర్థులు సైబర్ నేరగాళ్ల వల్లో చిక్కుతున్నారు. పర్యవేక్షణ లేని కొందరు పెడదారి పడుతున్నారు. వీటన్నింటికీ పరిష్కారంగా ఈ సైబర్ అంబాసిడర్లను రంగంలోకి దింపారు. సుశిక్షితులైన ఈ 3,300 మంది తమను తాము కాపాడుకోవడంతో పాటు సహ విద్యార్థులు, తల్లిదండ్రులు, స్నేహితులు, పరిచయస్తులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పి స్తారు. బాధితులుగా మారిన వారికి పోలీసులు, షీ–టీమ్స్ ద్వారా సహాయసహకారాలు అందేలా కృషి చేస్తారు. తొలి విడతలో సైబర్ అంబాసిడర్లుగా మారిన 3,300 మందిలో 1,500 మంది బాలురు కాగా, 1,800 మంది బాలికలు ఉన్నారు. -
మహిళలపై నేరాలకు సైబర్ ల్యాబ్‌తో చెక్: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: మహిళలు, చిన్నారులపై జరిగే సైబర్ నేరాలను అరికట్టేందుకు సైబర్ ల్యాబ్ దోహ దపడుతుందని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. ఈ తరహా నేరాలను నివారించేందుకు రాష్ట్ర పోలీసుశాఖలో సైబర్ ల్యాబ్ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర మహిళాభద్రత విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ సైబర్ ల్యాబ్‌పై మహిళా భద్రత విభాగం అడిషనల్ డి.జి.స్వాతిలక్రా, సైబర్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఫోరెన్సిక్ పరిశోధనాకేంద్రం (సి.ఆర్.సి.ఐ.డి.ఎఫ్) అధికారుల మధ్య కుదిరిన అవగాహనాఒప్పందంపై శుక్రవారం డీజీపీ సమక్షంలో సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో డి.ఐ.జి సుమతి, సి.ఆర్.సి.ఐ.డి.ఎఫ్ డైరెక్టర్ ప్రసాద్ పాటిబండ్ల తదితరులు హాజరయ్యారు. డీజీపీ మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో 50 శాతమున్న మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని, దీనిలో భాగంగానే సైబర్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. మహిళలపై జరిగే నేరాలకు సంబంధించి ఫిర్యాదులు అందినప్పుడే వాటిని అరికట్టడం సాధ్యమవుతుందని, సైబర్ నేరాలపట్ల ప్రజల్లో అవగాహన కలి్పంచేందుకు సైబర్ ల్యాబ్ చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలిపారు. 2020–21ను సైబర్ సేఫ్టీ సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో సైబర్ నేరాల నియంత్రణ, పరిష్కారానికి సైబర్ ల్యాబ్ దోహదపడుతుందని స్వాతిలక్రా అన్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్ స్ట్రాగాం, ట్విట్టర్ తదితర సామాజిక మాద్యమాల ద్వారానే ఈ నేరాలు జరుగుతున్నాయని వెల్లడించారు. మహిళలు, పిల్లలపై నేరాల నియంత్రణ, దేశంలోనే తొలిసారిగా ఈ సైబర్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసినట్టు వివరించారు. -
బెస్ట్ కోవిడ్ వారియర్ ఆఫీసర్‌గా డీఐజీ సుమతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బెస్ట్ కోవిడ్ వారియర్ విమెన్ ఆఫీసర్‌గా డీఐజీ బడుగుల సుమతిని డీజీపీ ఎంపిక చేశారు. కోవిడ్ విజృంభించిన వేళ దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్డౌన్ కాలంలో పోలీసులు అందించిన సేవలు మరువలేనివి. మన రాష్ట్రంలో దాదాపు ఆరు వేలకుపైగా పోలీసులు వైరస్ బారిన పడగా.. దాదాపు 70 మంది పోలీసులు అమరులయ్యారు. ఈ నేపథ్యంలో లాక్డౌన్ కాలంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళా పోలీసు అధికారుల వివరాలు అందజేయాలని నేషనల్ విమెన్ కమిషన్ (ఎన్సీ డబ్ల్యూ) అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. దీంతో తెలంగాణ నుంచి డీఐజీ బడుగుల సుమతి పేరుని సోమవారం డీజీపీ డాక్టర్ ఎం.మహేందర్ రెడ్డి ఖరారు చేశారు. (చదవండి: ఆన్లైన్ క్లాసులు.. ఓ కంట కనిపెట్టండి) డీఐజీ సుమతి లాక్డౌన్ కాలంలో డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలో సేవలందించారు. లాక్డౌన్ కాలంలో పేదలు, వలస కూలీలు, అన్నార్థులకు ఎక్కడికక్కడ ఆహారం, మందులు, బియ్యం, దుస్తులు చేరేలా నిరంతరం పర్యవేక్షించారు. అదే విధంగా అత్య వసర సేవలు, రాష్ట్రంలోనికి రావాల్సిన దిగు మతులు, ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన ఎగుమతులకు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగించే బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించారు. -
ఆలోచింపజేసే చిత్రం
‘‘తెరవెనుక’ సినిమా ట్రైలర్ బాగుంది. ఒక ఆడపిల్ల తండ్రి తన కూతురికి జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు ఇవ్వడానికి పోలీస్ స్టేషన్‌కు వచ్చినప్పుడు, ఓ లేడీ పోలీస్ వివరించే విధానం బాగుంది. మహిళలపై జరుగుతున్న అంశాలను ఈ సినిమాలో చూపించినట్లు తెలుస్తోంది’’ అని తెలంగాణ పోలీసు ఉన్నతాధికారిణి సుమతి (డీఐజీ – ఉమెన్ సేఫ్టీ వింగ్) అన్నారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ కథానాయకుడిగా, విశాఖ ధిమాన్, దీపికా రెడ్డి కథానాయికలుగా తెరకెక్కిన చిత్రం ‘తెర వెనుక’. నెల్లుట్ల ప్రవీణ్ చంద్ర దర్శకత్వంలో జయలక్ష్మి మురళి మచ్చ సమర్పణలో మురళీ జగన్నాథ్ మచ్చ నిర్మించారు. ఈ సినిమా ఆడియోను డీఐజీ సుమతి విడుదల చేయగా, దర్శకుడు ఎన్.శంకర్, సుచిర్ ఇండియా లయన్ కిరణ్, నిర్మాత గురురాజ్, సంఘసేవకుడు రేగొండ నరేష్, నటుడు శివారెడ్డి తదితరులు పాటలను విడుదల చేశారు. ఈ నెల 25న ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదల కానుంది. నెల్లుట్ల ప్రవీణ్ చంద్ర మాట్లాడుతూ– ‘‘సమాజంలో జరుగుతున్న సంఘటనలను తీసుకొని ఈ సినిమా చేశాను. సామాజిక స్పృహ కలిగిన క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందించాం’’ అన్నారు. ‘‘ప్రేక్షకులను ఆలోచింపజేసే చిత్రమిది’’ అన్నారు మురళీ జగన్నాథ్ మచ్చ. -
ఆన్లైన్ క్లాసులు.. ఓ కంట కనిపెట్టండి
సాక్షి, హైదరాబాద్: కరోనా అందరి జీవితాలను మార్చేసింది. ముఖ్యంగా టీనేజీ, యువతలో మానసికంగా మునుపెన్నడూ చూడనంత మార్పు వచ్చింది. కరోనా పుణ్యమాని విద్యాసంస్థలేవీ ఇపుడు మునుపటిలా పనిచేసే అవకాశాల్లేవు. దీంతో వారంతా ఇంటికే పరిమితమవుతున్నారు. ఇకపై పాఠాలు, తరగతులన్నీ ఆన్లైన్లోనే. అయితే, చాలామంది టీనేజీ పిల్లలకు, యువ విద్యార్థులకు ఆన్లైన్లో ఉన్న ఆపదలు, మోసాలు, అపాయాలపై అవగాహన లేదు. అలాగే, విద్యార్థులు ఆన్లైన్లో ఎలా ఉంటున్నారు? ఏం చేస్తున్నారు? ఎలాంటి ఆపదలు ఉంటాయన్న విషయంపై వారికీ తగినంత పరిజ్ఞానం లేదు. దీంతో విద్యార్థులు– తల్లిదండ్రుల మధ్య కొంత దూరం తలెత్తుతోంది. అందుకే, ఈ దూరాన్ని తగ్గించి విద్యార్థులు– తల్లిదండ్రులకు సురక్షిత ఆన్లైన్ సేవల వినియోగమే లక్ష్యంగా మహిళా భద్రతా విభాగం వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమ ప్రచారం పోస్టర్లను మహిళా భద్రతా విభాగం అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీ) స్వాతి లక్రా, డీఐజీ సుమతి ఆవిష్కరించారు. ఆన్లైన్ సర్వేకు శ్రీకారం! విద్యార్థులు తల్లిదండ్రులకు ఆన్లైన్ ఆపదలపై ఎంత పరిజ్ఞానం ఉందన్న అంశంపై ఆన్లైన్లోనే ఓ సర్వే చేపట్టింది. ఇందులో టీనేజీ, తల్లిదండ్రులకు వేర్వేరుగా ప్రశ్నావళి రూపొందించింది. ఉదాహరణకు మీకు రాన్సమ్ వేర్ అంటే తెలుసా? మీ మెయిల్స్, సోషల్ మీడియా ఖాతాలు హాక్ అయితే ఏం చేస్తారు? సైబర్ వేధింపులకు దిగితే ఎలా స్పందిస్తారు? తదితరాలు విద్యార్థులకు ఇచ్చారు. ఇక మీ పిల్లలు ఆన్లైన్లో ఏం చేస్తున్నారు? ఏయే కంటెంట్ చూస్తున్నారు? ఏం గేములు ఆడుతున్నారు? వేటి వల్ల ఎంత ముప్పు? వాటిని అధిగమించేందుకు వారిచ్చే సలహాలు తీసుకుంటున్నారు. ప్రశ్నావళిలో సమాధానాలు ఇవ్వలేకపోయిన అంశాలపై దృష్టి కేంద్రీకరించి వాటిపై భవిష్యత్తులో మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. మన రాష్ట్రంలో ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ ఆపైన 15 లక్షలకుపైగా విద్యార్థినులు ఉంటారు. ఈ సర్వే ప్రారంభించిన 24 గంటల్లోనే సుమారు 3000 మంది పాల్గొనడం విశేషం. ప్రతీరోజూ దాదాపు ఐదువేల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు సర్వేలో భాగస్వామ్యం అయ్యేలా ఈ కార్యక్రమానికి విస్తృత ప్రచారం కల్పించాలని సంకల్పించారు. రంగంలోకి విద్యా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆన్లైన్ సర్వే కార్యక్రమం ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులతో పాటుగా వారి తల్లిదండ్రులను కలుపుకుంటే దాదాపు 30 లక్షలమందిని లక్ష్యంగా చేసుకుని రూపొందించారు. వీరందరూ తమ అభిప్రాయాలను తెలిపితే రాష్ట్రంలోని విద్యార్థులు– తల్లిదండ్రులు ఆన్లైన్లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో ఒక స్పష్టత వస్తుంది. అందుకే, ఈ కార్యక్రమంలో విద్యా, స్త్రీ శిశు సంక్షేమశాఖల సాయం కోరారు. ఇప్పటికే రాష్ట్రంలో జిల్లా విద్యాధికారులు (డీఈఓ)లకు ఈ సర్వే లింక్ చేరింది. వారి ద్వారా ప్రభుత్వ పాఠశాలల ప్రిన్సిపాళ్లు, టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులకు చేరనుంది. అలాగే త్వరలోనే ప్రైవేటు పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ, వర్సిటీలూ ఈ ఆన్లైన్ అవగాహన సర్వేలో పాల్గొనేలా చర్యలు చేపట్టనున్నారు. పోస్టర్లను విడుదల చేస్తున్న ఏడీజీ స్వాతి లక్రా, డీఐజీ సుమతి -
ఎక్కడికి పోతావు చిన్నవాడా!
సాక్షి, హైదరాబాద్: ‘చెరపకురా చెడేవు..’అనేది నానుడి. ‘ఏడిపించకురా ఏడిచేవు..’అన్నది ’న్యూ’నుడి. ఆడపిల్లలను వేధించే పోకిరీలకు షీ టీమ్స్ పరోక్షంగా ఇచ్చే సందేశం ఇదే. మఫ్టీలో సేఫ్టీ.. పెట్టీ కేసులు.. ఆనక ‘పిడి’కిలి.. ఇదీ షీటీమ్స్ వ్యూహం. మహిళారక్షణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన షీ–టీమ్స్ నిఘా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది. 2014లో హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ‘షీ–టీమ్స్’మంచి ఫలితాలు ఇస్తున్నాయి. మహిళలు, బాలికలు, యువతులు, విద్యార్థినులను వేధిస్తున్న ఘటనలపై 100కు డయల్, ఫోన్, వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఫిర్యాదులకు నిమిషాల్లోనే స్పందిస్తున్నాయి. షీటీమ్స్‌ను క్రమంగా తెలంగాణలోని 33 జిల్లాలకు విజయవంతంగా విస్తరించారు. తొలిసారి తెలిసీ తెలియకుండా ఆడవారిని వేధించేవారిని హెచ్చరించి, కౌన్సెలింగ్ ఇచ్చి విడిచిపెడతారు. కావాలని ఏడిపించినవారిపై పెట్టీ కేసులు పెడుతున్నారు. మరింత తీవ్రమైన నేరం చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టుకు పంపుతున్నారు. పదేపదే నేరాలను పునరావృతం చేసినవారిపై ప్రివెంటివ్ డిటెన్షన్(పి.డి.)యాక్ట్ అమలుకు సిద్ధమవుతున్నారు. కేసుల రికార్డు నిర్వహణకు షీ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ప్రత్యేకంగా ఆన్లైన్లో సరి్టఫికెట్ కోర్సు కూడా నిర్వహిస్తున్నాయి. నివారణమార్గాలు వెతుకుతున్నాం ఆడవారిని ఏడిపించడం, ఇబ్బంది పెట్టడం అనే దానిని కేవలం సామాజిక సమస్యగానే కాదు, మానసిక, ఆరి్థక, సాంస్కృతిక కోణాల్లోనూ పరిగణిస్తున్నాం. సమస్య తలెత్తాక స్పందించడం కంటే నివారణ మార్గాలు వెతుకుతున్నాం. పకడ్బందీ నిఘావ్యవస్థను ఏర్పాటు చేశాం. ఎన్జీవోలు, మానసిక నిపుణులతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. – స్వాతి లక్రా, ఐజీ, విమెన్ సేఫ్టీ వింగ్ నిమిషాల్లో వాలిపోతాం 33 జిల్లాల్లో మా బృందాలు చాలా యాక్టివ్‌గా ఉన్నాయి. ఆడవారిని ఏడిపించాలనుకున్న వారు ఎక్కడున్నా.. మా నిఘాను దాటిపోలేరు. కేసు నమోదు దగ్గర నుంచి నిందితులకు శిక్ష పడేంత వరకు నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది.– సుమతి, ఎస్పీ(సీఐడీ), విమెన్ సేఫ్టీ వింగ్ -
కన్న తండ్రి కన్నుమూసినా..
తొండంగి: కన్నతండ్రి మృతి చెందినా బరువెక్కిన హృదయంతో పదోతరగతి పరీక్షకు హాజరైంది తొండంగి మండలం ఎ.కొత్తపల్లికి చెందిన మాధన సుమతి. ఈమె ఇదే గ్రామంలో జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుతూ పబ్లిక్ పరీక్షలకు హాజరవుతోంది. శుక్రవారం తెల్లవారుజామున తండ్రి మాధన వీరభద్రరావు అనారోగ్యంతో మృతిచెందారు. కన్నతండ్రి మృతి చెందినా, అంత్యక్రియలు పూర్తికాకుండా శుక్రవారం తొండంగి అక్షర పబ్లిక్ స్కూల్ సెంటర్లో పరీక్షా కేంద్రానికి వెళ్లి ఫిజిక్స్ పరీక్ష రాసింది. కాగా సుమతి అక్క సుధారాణి గతంలో హైస్కూల్లో పదవతరగతి పరీక్షల్లో ప్రథమస్థానంలో నిలిచింది. కాగా ప్రస్తుతం ట్రిపుల్ ఐటీ చదువుతుండగా పెళ్లి సంబంధం కుదరడంతో చదువుకు బ్రేక్‌పడింది. కొద్ది రోజుల్లో వివాహ ముహూర్తాలు పెట్టుకుందామన్న నేపథ్యంలో సుమతి, సుధారాణిల కుటుంబసభ్యులకు తండ్రి మరణం తీరని విచారాన్ని మిగిల్చింది. -
నవ్విన చోటే నిలిచి.. గెలిచి..!
తాగునీటి కోసం గ్రామీణ మహిళల కష్టాలు ఆమెను కదిలించాయి. నీటి సమస్య పరిష్కారానికి ఎన్నో మార్లు అధికారులకు విన్నవించారు. స్వచ్ఛంద సేవలను ఆశ్రయించారు. తన నగలను తాకట్టు పెట్టి మçహారాష్ట్ర, రాజస్తాన్ వెళ్లారు. అన్నాహజరే, రాజేంద్రసింగ్ల సలహాలు తీసుకున్నారు. మొదట ఓ కొలను తవ్వారు. ఈ ప్రయత్నానికి కొందరు నవ్వుకున్నారు.ఎన్నో అవమానాలు, అవహేళనలు ఎదుర్కొన్నా కుంగిపోలేదు. కొలను నిండడంతో పరిసరాల్లో భూగర్భజలాలు కొంత మేరకు పెరిగాయి. అదే స్ఫూర్తితో స్వచ్ఛంద సంస్థల, యువత సహకారం తీసుకుని మరో ఎనిమిదికొలనులు తవ్వించారు. ప్రస్తుతం కొలనులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగాయి. నవ్వినచోటే నిలిచి గెలిచారు తిరువళ్లూరు సమీపంలోని నల్లటూరు గ్రామానికి చెందిన సుమతి. తిరువళ్లూరు: సాగర చక్రవర్తి అశ్వమేధయాగం చేయతలపెట్టగా ఇంద్రుడు ఆ అశ్వాన్ని దొంగిలించి కపిల మహర్షి దగ్గర కట్టేశాడట. ఆ ఆశ్వాన్ని చూసిన యువరాజులు ఆ మహర్షిని నిందించడంతో ఆగ్రహించిన రుషి వారందరిని భస్మం చేశాడట. నిజం తెలుసుకున్న సాగరచక్రవర్తి రెండో భార్య కుమారుడు అసమంజ రాజకుమారుల ఆత్మకు శాంతి ప్రసాదించాలని రుషిని ప్రార్థించగా.. దేవలోకం నుంచి గంగను భూమికి తీసుకువస్తే వారి ఆత్మకు శాంతి కలుగుతుందని తెలిపాడట. దీంతో అసమంజ మనవుడు భగీరథుడు కఠోర తపస్సు చేసి గంగను భూమి మీదకు తెచ్చినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఇదే విధంగా అదిగత్తూరు సమీపం 5 గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి భగీరథ యత్నమే చేసింది ఆమె. భర్త సహకారం, సమీప పరిశ్రమలు, స్వచ్ఛంద సంస్థలు, గ్రామ యువకులతో వర్షం నీటి ఆదాకు కొలను తవ్వకానికి నిధులు సేకరించారు. అలా పదేళ్ల క్రితం ప్రారంభించి ఇప్పటివరకు గ్రామంలో తొమ్మిది కొలనుల తవ్వించారు. పచ్చదనం కోసం రెండు వేల మొక్కలను నాటి శభాష్ అనిపించుకుంటున్నారు సమాజికవేత్త సుమతి. కుటంబ నేపథ్యం.. తిరువళ్లూరు సమీపం, నల్లటూరు గ్రామానికి చెందిన సుమతి డిగ్రీ వరకు చదువుకున్నారు. ఆమెకు 14 ఏళ్ల క్రితం చిదంబరనాథన్తో వివాహం జరిగింది. వివాహం జరిగిన మరుసటి రోజు నుంచే కన్నీటి కష్టాలు ఎదురయ్యాయి. తాగునీటి కోసం మూడు కిలోమీటర్ల దూరం వెళ్లి వ్యవసాయబావి వద్ద తాగునీటిని తెచ్చుకోవాలి. ఇలా నీటికోసం పడిన కష్టాలు ఆమెను కదిలించాయి. సమస్య పరిష్కారం ఆమె మాటల్లోనే.. ఈ శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టా. 2006లో నిర్వహించిన గ్రామసభలో ఏకాటూరు వద్ద ఉన్న కూవం నదిపై అనకట్ట కట్టాలని తీర్మానం చేశాం. అధికారులు సైతం వచ్చి వెళ్లినా పని కాలేదూ కదా.. మళ్లీ సమస్య ఉగ్రరూపం దాల్చింది. అప్పడే ఇండియా వాటర్‌మెన్ రాజస్థాన్‌కు చెందిన రాజేంద్రసింగ్, అన్నాహజారే గురించి పుస్తకాల్లో చదివా. గ్రామాల్లో నీటిని ఆదాచేయడానికి స్వచ్ఛంద సంసల సహకారంతో కొలను తవ్వారన్నది అందులోని సారాంశం. ప్రభుత్వాన్ని నమ్మి ప్రయోజనం లేదని నగలను తాకట్టు పెట్టి మహరాష్ట్ర, రాజస్తాన్‌కు బయలుదేరా. అన్నాహజరే, రాజేంద్రసింగ్‌ను కలిసి గ్రామంలోని తాగునీటి సమస్యను వివరించా. కొలను తవ్వి నీటిని ఆదా చేయమని చెప్పారు రాజేంద్రసింగ్. మొదట్లో నమ్మకం లేకపోయినా హజారే స్వగ్రామమైన రాలేగన్ సిద్ధి్ద, రాజస్థాన్‌లో తవ్విన కొలనులను పరిశీలించాక నమ్మకం ఏర్పడింది. నిధుల కోసం వినతి.. గ్రామపంచాయతీ అధ్యక్షుడికి కొలను తవ్వకం కోసం నిధులను సేరించాలని కోరా. అయితే అందుకు అయ్యే ఖర్చును గుర్తుచేస్తూ నన్ను ఎగతాలి చేశారు. అయినా నేను గ్రామంలోని యువకులు, స్వచ్ఛంద సంస్థలు, సమీప కంపెనీలను ఆశ్రయించి నిధులు సేకరించా. ఆ నిధులతో తాగునీటి ట్యాంకర్ కోసం ఏర్పాటు చేసిన బోరుకు సమీపంలో పెద్ద కొలనును ఆరునెలల పాటు శ్రమించి తవ్వాం. కొలనుకు నాలుగు వైపులా రాళ్లను పేర్చాం. ఆ ఏడాదే మంచి వర్షం. కొలను నీటితో నిండి జలకళను సంతరించుకుంది. దీంతో భూగర్భజలాలు కొంత మేరకు పెరగడంతో ఆరు నెలల పాటు తాగునీటికి ఇబ్బంది లేకుండా పోయింది. మొత్తం తొమ్మిది కొలనులు.. అదే జోష్‌తో మరో ఎనిమిది కొలనులను తవ్వాలని పనులు ప్రారంభించా. మొదట్లో మమ్మిల్ని ఎగతాళి చేసిన వారే మాతో చేతులు కలిపారు. ఏడాదికి ఒక కొలను చొప్పున ఎనిమిదింటిని పూర్తి చేశాం. ప్రస్తుతం గ్రామంలో తొమ్మిది కొలనులను తవ్వాం. ప్రవేటు వ్యక్తి చేతిలో ఆక్రమణకు గురైన మరో కొలనును స్వాధీనం చేసుకుని మరమ్మతులు చేశాం. కొలనుల తవ్వడానికి తాను చేసిన ప్రయత్నంలో ఎన్నో అవమానాలు, అవహేళనలు ఎదుర్కొన్నప్పుడు కొంచెం బాధపడ్డా. కానీ కొలనుల్లో నీరు నిండి ప్రవహిస్తుండడంతో పలువురు శభాష్ అంటూ ప్రశంసిస్తుంటే ఆ బాధను మరిచిపోతున్నా. భర్త సహకారం.. సుమతి సాధించిన విజయం వెనుక భర్త చిదంబరనాథన్ ప్రోత్సహం, యువకుల సహకారం ఎంతో ఉంది. ప్రస్తుతం అదే టీం లక్ష మొక్కలను నాటాలని నిర్ణయించి రెండువేల మొక్కలను నాటి పరిరక్షిస్తున్నారు. సుమతి సమాజసేవకు గాను పలు అవార్డులు వచ్చాయి. గ్రామస్తులు సైతం పంచాయతీ అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని నిర్ణయించారు. అయితే ఎన్నికలు నిలిచిపోయాయి. భవిష్యత్‌లో పంచాయతీ అధ్యక్షురాలిగా ఎన్నికై సమాజ సేవ చేయాలని ఆశిద్దాం. -
అనంతలో దారుణం
అనుమానంతో భార్యను హతమార్చిన భర్త అనుమానం పెనుభూతమైంది. భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో గొడవపడి కత్తితో గొంతు కోసి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. అనంతపురంలో మంగళవారం ఉదయం జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. - అనంతపురం సెంట్రల్ నగరంలోని వినాయక్‌నగర్‌లో చలపతి, సుమతి(34) దంపతులు నివసిస్తున్నారు. వీరికి హేమలత(14), మానస (11), రాఘవేంద్ర (8) సంతానం. చలపతి పెయింటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఎంతో అన్యోన్యంగా సాగుతున్న వీరి కుటుంబంలో కొంతకాలంగా మనస్పర్థలు ఏర్పడ్డాయి. భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని భర్త అనుమానించాడు. ఈ విషయమై పలుమార్లు ఇద్దరూ గొడవపడ్డారు. సుమతి పుట్టింటి వారికి కూడా తెలియజేసి మందలించినట్లు సమాచారం. ఒకానొక సమయంలో బుక్కరాయసముద్రం మండలం వడియంపేటలో ఉన్న తమ సొంత ఇంటికి మకాం మార్చాలని భావించాడు. అయితే పిల్లల చదువు దృష్ట్యా విరమించుకున్నాడు. మంగళవారం ఉదయం మరోసారి వివాహేతర విషయమై భార్యాభర్తలు గొడవపడ్డారు. కోపోద్రిక్తుడైన చలపతి ఇంట్లో కూరగాయలు కోసేందుకు ఉపయోగించే కత్తి తీసుకొని గొంతుకోసి హతమార్చాడు. అనంతరం పారిపోయాడు. ఉదయాన్నే ఈ ఘటన జరగడంతో వినాయక్‌నగర్‌లో కలకలం రేగింది. కాలనీలోని ప్రజలు పెద్ద ఎత్తున ఆ ఇంటివద్ద గుమిగూడారు. వన్‌టౌన్ సీఐ రాఘవన్, ఎస్ఐలు రంగయాదవ్, నాగమధులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, నిందితుడు చలపతి సాయంత్రానికి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం ధ్రువీకరించడం లేదు. -
చిరుతలా వెంటాడి దొంగను చితకబాదింది!
పళ్లిపట్టు(తమిళనాడు): తన చేతిలోని నగదు బ్యాగును కొట్టేసి పారిపోతున్న ఓ దొంగని చిరుతలా పరుగెత్తి పట్టుకుని పట్టుకుంది ఓ మహిళ. అ తర్వాత దొంగను ఆ మహిళ చితకబాదింది. ఈ సంఘటన తమిళనాడులోని తిరుత్తణిలో చోటుచేసుకుంది. తిరుత్తణి జేజే నగర్ ప్రాంతానికి చెందిన సుమతి(39), ఆమె చెల్లి శాంతి(35) బస్టాండు సమీపంలోని ఏటీఎంకు వెళ్లారు. అక్కడ రూ.40 వేలు డ్రా చేసుకుని బ్యాగులో పెట్టుకుని స్కూటీ స్టార్ట్ చేస్తుండగా అంతా గమనిస్తున్న ఓ వ్యక్తి అకస్మాత్తుగా బ్యాగును లాక్కుని పారిపోయాడు. ఆమె దొంగ దొంగ అంటూ కేకలు వేసినా దొంగను పట్టుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆమె చిరుతలా పరుగెత్తి, దొంగని వెంబడించి పట్టుకుంది. నగదు బ్యాగును దొంగనుంచి తీసుకుని అతన్ని పోలీసులకు అప్పగించింది. నిందితుడు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన వినోద్(38) అని పోలీసులు గుర్తించారు. అతడు తరుచూ దోపిడీలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో చెప్పాడు. -
'టిఫిన్ పెట్టలేదని కోడల్ని చంపేశాడు'
విజయవాడ రూరల్: కొడుకు ప్రేమించి పెళ్లాడిన యువతిని..తండ్రిలా ఆదరించాల్సిన మామే దారుణంగా హత్య చేశాడు. విజయవాడ రూరల్ మండలం నున్నలో జరిగిన ఈ ఘటన వివరాలు పోలీసుల కథనం మేరకు ప్రకారం. స్థానికంగా ఉండే జూలిపూడి సత్యనారాయణ కుమారుడు శివాజీ పెట్రోల్ బంక్‌లో పని చేస్తాడు. పది రోజుల క్రితమే సుమతి అనే యువతిని ప్రేమ వివాహం చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. కానీ కొడుకు ప్రేమ వివాహం ఇంట్లో వాళ్లకు ఇష్టం లేనట్టు సమాచారం. ఈ క్రమంలో శనివారం ఉదయం శివాజీ పెట్రోల్ బంక్ కు విధులకు వెళ్లగా... సుమతి స్థానికంగానే ఉన్న ఆడపడచు ఇంటికి వెళ్లింది. కొద్ది సేపటి తర్వాత ఇంటికి తిరిగివచ్చిన సుమతిపై సత్యనారాయణ అగ్గిమీద గుగ్గిలమయ్యాడు . టిఫిన్ పెట్టకుండా పెత్తనాలు చేయడానికి వెళ్లావా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కోపంలోనే తలుపు గడియ వేసి, టీవీ సౌండ్ ఎక్కువగా పెట్టి సుమతి చున్నీతో ఆమె మెడకు బిగించి చంపేశాడు. అనంతరం ఏమీ ఎరుగని వాడిలా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన కోడలు చనిపోయిందని చెప్పి పోలీసులను తీసుకొచ్చాడు. అయితే పోలీసుల విచారణలో అతడే హత్య చేసినట్టు తేలడంతో సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు. ఏసీపీ శ్రావణి సంఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలను సేకరించారు. -
బ్యాంకు వెనుక గుంత తవ్వి..
తిరువళ్లూరు, న్యూస్‌లైన్: తిరువళ్లూరు సమీపంలోని తిరుప్పాచ్చూర్‌లో ఇండియన్ బ్యాంకు వెనుక గుర్తు తెలియని దుండగులు ఐదు అడుగుల మేర గుంతను తవ్వారు. లాకర్లో ఉన్న నగదు, నగలను అపహరించాలని మాస్టర్ ప్లాన్ వేశారు. దీనికోసం తవ్విన గుంతను ఆ గ్రామ మహిళలు గుర్తించారు. బ్యాంకు లాకర్లో రెండు కోట్లకుపైగా విలువజేసే నగదు, నగలు భద్రంగా ఉండడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. తిరువళ్లూరు జిల్లా తిరుప్పాచ్చూర్ ప్రాంతంలో ఇండియన్ బ్యాంకు బ్రాంచి ఉంది. దీని వెనుక భాగంలో పిచ్చిమొక్కలతో పాటు ఇతర ముళ్లపొదులు విపరీతంగా పెరిగిపోయాయి. వీటిని తొలగించాలని బ్యాంకు అధికారులు నిర్ణయించారు. తిరుప్పాచ్చూర్ గ్రామంలోని మహిళలకు పిచ్చిమొక్కలను తొలగించే పనిని అప్పగించారు. పనిలో నిమగ్నమైన కూలీలు లాకర్ రూమ్ ప్రాంతంలో ఐదు అడుగుల మేరకు తవ్వకాలు జరిపినట్టు గుర్తించారు. వారు వెంటనే బ్యాంకు మేనేజర్ సుమతికి సమాచారం అందించారు. తవ్వకాలు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన మేనేజర్ తాలుకా ఇన్స్పెక్టర్ ఏకాంబరానికి ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీ సులు, బ్యాంకు వెనుక నుంచి లాకర్‌కు తవ్వకాలు జరిపినట్టు గుర్తించారు. అనంతరం ఇండియన్ బ్యాంకు భద్రతా అధికారి కుమరవేలు సంఘటన స్థలానికి చేరుకు పరిశీలించారు. బ్యాంకు లాకర్లో వుంచిన రెండు కోట్ల విలువ చేసే నగలు, నగదు భద్రంగా ఉండడంతో బ్యాంకు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం బ్యాంకు భద్రతాధికారి కుమర వేలు మీడియాతో మాట్లాడుతూ, బ్యాంకులో చోరీయత్నం జరిగిన నేపథ్యంలో నైట్ వాచ్‌మన్‌ను నియమిస్తామన్నారు. దీంతో పాటు బ్యాంకు ముందు, వెనుక భాగంలో కెమెరాలను ఏర్పాటుచేస్తామని తెలిపారు.