
అనంతలో దారుణం
అనుమానంతో భార్యను హతమార్చిన భర్త
అనుమానం పెనుభూతమైంది. భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో గొడవపడి కత్తితో గొంతు కోసి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. అనంతపురంలో మంగళవారం ఉదయం జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. - అనంతపురం సెంట్రల్
నగరంలోని వినాయక్‌నగర్‌లో చలపతి, సుమతి(34) దంపతులు నివసిస్తున్నారు. వీరికి హేమలత(14), మానస (11), రాఘవేంద్ర (8) సంతానం. చలపతి పెయింటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఎంతో అన్యోన్యంగా సాగుతున్న వీరి కుటుంబంలో కొంతకాలంగా మనస్పర్థలు ఏర్పడ్డాయి. భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని భర్త అనుమానించాడు. ఈ విషయమై పలుమార్లు ఇద్దరూ గొడవపడ్డారు. సుమతి పుట్టింటి వారికి కూడా తెలియజేసి మందలించినట్లు సమాచారం.
ఒకానొక సమయంలో బుక్కరాయసముద్రం మండలం వడియంపేటలో ఉన్న తమ సొంత ఇంటికి మకాం మార్చాలని భావించాడు. అయితే పిల్లల చదువు దృష్ట్యా విరమించుకున్నాడు. మంగళవారం ఉదయం మరోసారి వివాహేతర విషయమై భార్యాభర్తలు గొడవపడ్డారు. కోపోద్రిక్తుడైన చలపతి ఇంట్లో కూరగాయలు కోసేందుకు ఉపయోగించే కత్తి తీసుకొని గొంతుకోసి హతమార్చాడు. అనంతరం పారిపోయాడు.
ఉదయాన్నే ఈ ఘటన జరగడంతో వినాయక్‌నగర్‌లో కలకలం రేగింది. కాలనీలోని ప్రజలు పెద్ద ఎత్తున ఆ ఇంటివద్ద గుమిగూడారు. వన్‌టౌన్ సీఐ రాఘవన్, ఎస్‌ఐలు రంగయాదవ్, నాగమధులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, నిందితుడు చలపతి సాయంత్రానికి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం ధ్రువీకరించడం లేదు.