
ప్రతీకాత్మకచిత్రం
తిరువొత్తియూరు (చెన్నై): వరుడి చేతిలో ఉన్న తాళిని లాక్కుని వధువు మెడలో కట్టడానికి యత్నంచిన ప్రేమికుడిని వధువు సోదరుడు, బంధువులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన ఘటన చెన్నై తండయార్ పేటలో జరిగింది. సినిమా తరహాలో జరిగిన ఈ వ్యవహారం అక్కడున్న వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది.
వివరాల్లోకి వెళితే.. చెన్నై తండయారుపేటకు చెందిన సుమతి (20). ఈమెకు అదే ప్రాంతానికి చెందిన రాజ్ (21) నౌక ఇంజినీర్‌తో నాలుగు నెలల క్రితం వివాహ నిశ్చితార్థం జరిగింది. తండయార్‌పేట నేతాజీ నగర్‌లో శుక్రవారం వివాహం జరగాల్సి ఉంది. ఇరు కుటుంబాల వారు వివాహ ఏర్పాట్లు పూర్తి చేశారు. ముహూర్తం దగ్గర పడుతున్న సమయంలో సుమారు 7 గంటలకు మంగళ వాయిద్యాలు వాయిస్తుండగా వరుడు తాళిని తీసుకుని వధువు మెడలో కట్టేందుకు సిద్ధమయ్యాడు.
చదవండి: (‘104’ మృత్యు మార్గాలు.. ఈ దారుల్లోనే అత్యధిక ప్రమాదాలు)
సరిగ్గా అదే సమయంలో అక్కడ నిలబడి ఉన్న యువకుడు ముందుకు దూసుకువచ్చి వరుడి చేతిలో ఉన్న తాళిని లాక్కుని వధువు మెడలో కట్టడానికి ప్రయత్నించాడు. ఇది చూసిన అక్కడి వారు అందరూ ఒక్క క్షణం నివ్వెర పోయారు. అక్కడే నిలబడి ఉన్న వధువు అన్న, బంధువులు యువకుడి చేతి నుంచి తాళి లాక్కుని అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో యువకుడు తండయార్ పేటకు చెందిన సుందరేష్ (25)గా గుర్తించారు.
చాకలి పేటలోని ప్రముఖ నగల దుకాణంలో సుమతితో కలిసి పని చేసేవాడని నిర్ధారించారు. వీరిద్దరు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారని, తల్లిదండ్రులను ఒప్పించలేక వివాహం జరుగుతున్న సమయంలో ఈ చర్యకు ప్రయత్నించినట్లు తెలిసింది. వివాహం జరిగిన సమయంలో అతను బంధువుగా వచ్చి ఏమి తెలియనట్లు పక్కన నిలబడి సరిగ్గా వివాహం జరిగే సమయంలో హఠాత్తుగా తాళి కట్టడానికి ప్రయత్నించినట్లు తెలిసింది. అయితే జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. వధువు బంధువులు, వరుడి కుటుంబ సభ్యులతో మాట్లాడినా ఫలితం లేకపోయింది.
Comments
Please login to add a commentAdd a comment