హైకోర్టులో మరోసారి ఊడిపడ్డ ఫాల్స్ సీలింగ్
బార్ కౌన్సిల్‌లో ఉద్యోగులకు తప్పిన ప్రమాదం
కోర్టు హాళ్ల వద్ద భారీగా నిలిచిపోయిన నీరు
సీలింగ్ నుంచి వరదలా నీటి ప్రవాహం
తడిచి ముద్దయిన ఫైళ్లు
సాక్షి, అమరావతి: రూ.వందల కోట్లు వెచ్చించి కూడా హైకోర్టు తాత్కాలిక భవనాన్ని టీడీపీ హయాంలో ఎంత నాసిరకంగా నిర్మించారో తాజాగా ప్రత్యక్షంగా వెల్లడైంది. శనివారం కురిసిన వర్షానికి హైకోర్టులోని పలు కోర్టు హాళ్ల వద్ద భారీగా నీరు చేరింది. అన్నీ ఫ్లోర్లలో ఇదే పరిస్థితి నెలకొంది. బయటకు వెళ్లే మార్గం లేక నీరంతా అక్కడే నిలిచిపోయింది. కారిడార్లలో కూడా నీరు భారీగా నిలిచిపోయింది. దీంతో కోర్టు సిబ్బంది మోటార్లతో తోడి నీటిని బయటకు పంపేందుకు శ్రమించారు.
ఇక హైకోర్టు ప్రాంగణంలో ఉన్న రాష్ట్ర న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్)లో పరిస్థితి చెప్పాల్సిన పనే లేదు. వర్షానికి బార్ కౌన్సిల్ కార్యాలయంలో ఫాల్స్ సీలింగ్ ఊడిపడింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సీలింగ్ పైనుంచి నీరు వరదలా లోపలకు చొచ్చుకొచ్చింది. దీంతో ఫైళ్లన్నీ తడిచిపోవడంతో భద్రపరిచేందుకు సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కుర్చీలను, టేబుళ్లను ఒకదానిపై ఒకటి ఉంచి వాటిపై ఫైళ్లను ఉంచారు.
కొత్త న్యాయవాదుల నమోదు కార్యక్రమం కూడా ఉండటంతో అవస్థ పడ్డారు. గతంలోనూ న్యాయమూర్తులు విధి నిర్వహణలో ఉండగానే కొన్ని చోట్ల ఫాల్స్ సీలింగ్‌లు ఊడిపడ్డాయి. అదృష్టవశాత్తూ సెలవు దినం కావడంతో అటు న్యాయమూర్తులు, ఇటు న్యాయవాదులకు ఇబ్బందులు తప్పాయి.
రూ.150 కోట్లతో నాసిరకంగా...
తాత్కాలిక హైకోర్టు భవనాన్ని చంద్రబాబు ప్రభుత్వం 2019లో రూ.150 కోట్ల వ్యయంతో నిర్మించింది. ఒక్కో ఎస్ఎఫ్టీకి భారీగా ఖర్చు చేశారు. ఒకపక్క పనులు కొనసాగుతుండగానే నిర్మాణం పూర్తైందంటూ నాడు సుప్రీంకోర్టుకు అవాస్తవాలు చెప్పి హైకోర్టును తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలించారు. ఏపీ హైకోర్టు నిర్మాణం పూర్తయిపోయిందని, అన్ని కోర్టు హాలులు పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పుదోవ పట్టించారు.
కోర్టు ప్రారంభించిన తరువాత హాళ్లను పరిశీలించేందుకు వచ్చిన అప్పటి సీజేకు చేదు అనుభవం ఎదురైంది. ఒకటి రెండు కోర్టు హాళ్లు మాత్రమే సిద్ధం చేసి మిగిలిన వాటిలోకి వెళ్లకుండా పరదాలు కట్టి సీజేను అవమానించింది. అప్పట్లో దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవయ్యాయి. ఇక హైకోర్టు భవనం లోపల మొత్తం డొల్లే. రాజ«స్థాన్ నుంచి తెప్పించిన శాండ్ స్టోన్ పలకలు హైకోర్టు వెలుపల బిగించారు. కొద్ది నెలలకే అవన్నీ ఊడిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment