సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: భానుడి భగభగలు.. రెండోరోజు గురువారం కూడా కొనసాగాయి. సూర్యుడు బుధవారం కంటే మరింత వడగాలులతో రాష్ట్రాన్ని వణికించాడు. ముఖ్యంగా కోస్తా జిల్లాలు ఎండ తీవ్రతతో అట్టుడికిపోయాయి. వడగాలులతో జనం తీవ్ర అవస్థలు పడ్డారు. యాస్ తుఫాన్ ప్రభావంతో వాతావరణంలో తేమ తగ్గడం.. ఉత్తర భారతదేశం నుంచి పొడిగాలులు వీస్తుండటంతో మన రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. వాతావరణంలో తేమ లేకపోవడంతో వడగాలులు తీవ్రమయ్యాయి. రాజస్థాన్ నుంచి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర వైపు గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో.. కోస్తాలో మరో రెండురోజులు వడగాలుల తీవ్రత కొనసాగుతుందని వాతావరణశాఖ వెల్లడించింది. శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకూ ప్రభావం ఉంటుందని తెలిపింది. గురువారం ఉదయం నుంచే ఎండ తీవ్రత మొదలైంది. 9 గంటలకే చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 37 డిగ్రీలు దాటింది.
మధ్యాహ్నం 1 గంటకు సాధారణం కంటే 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లా భామిని, విజయనగరం జిల్లా కురుపాంలలో అత్యధికంగా 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విశాఖలో సాధారణం కంటే రికార్డు స్థాయిలో 8.2 డిగ్రీలు ఎక్కువగా 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గత 51 ఏళ్ల కాలంలో మే లో విశాఖలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే కావడం గమనార్హం. ఎండలు ఎక్కువగా ఉండే రాయలసీమలో మాత్రం ఎక్కడా 40 డిగ్రీలు దాటలేదు. ఈనెల 30వ తేదీ వరకు కోస్తా జిల్లాల్లో ఈ తరహాలోనే ఎండలు, వడగాలులు తీవ్రంగా ఉంటాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. కోస్తా ప్రాంతంలోని 32 మండలాల్లో వడగాలులు వీచినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
30 నుంచి రాయలసీమలో వర్షాలు
తెలంగాణ నుంచి తేమ గాలులు వస్తుండటం వల్ల ఈనెల 30 నుంచి రాయలసీమలో వర్షాలు ప్రారంభమవుతాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అక్కడి నుంచి దక్షిణ కోస్తా, మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలకు వర్షాలు విస్తరిస్తాయన్నారు. రుతుపవనాల కంటే ముందే వర్షాలు కురవడం వల్ల ఎండల తీవ్రత తగ్గుముఖం పట్టనుంది. నైరుతి రుతుపవనాలు జూన్ మొదటి వారంలో రాష్ట్రాన్ని తాకనున్నాయి. ప్రీ మాన్‌సూన్ వర్షాల కాలం ముగిసే సమయానికి నైరుతి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉండటంతో ఎండల తీవ్రత ఈ నెలాఖరుకు ముగిసినట్లేనని వాతావరణశాఖ తెలిపింది.
చదవండి: బయటకు రావాలంటే హడల్: ఆ గ్రామానికి ఏమైంది!
Andhra Pradesh: 10 జిల్లాల్లో కరోనా తగ్గుముఖం
Comments
Please login to add a commentAdd a comment