సాక్షి ప్రత్యేకం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వినుకొండలో చేసిన ప్రసంగం ధాటిగా సాగింది. చేదోడు స్కీమ్ కింద లబ్దిదారులకు ఆర్ధిక సాయం అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ సభలో ఆయన కొన్ని కొత్త డైలాగులు వాడారు. వాటిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బాగా ఇబ్బంది కలిగించే అంశం కూడా ఒకటి ఉంది.
చంద్రబాబును జగన్ ముసలాయన గా అభివర్ణించారు. ఆ మాట అంటున్నప్పుడు సభికుల నుంచి విపరీతమైన స్పందన కనిపించింది. వచ్చే ఎన్నికలలో ముసలాయన కావాలా? రాష్ట్రాభివృద్ది కోసం పాటు పడుతున్న యువకుడైన తాను కావాలా? అని ఆయన ప్రజలను ప్రశ్నించారు. చంద్రబాబు అవుట్ డేటెడ్ అని చెప్పడమే జగన్ లక్ష్యంగా కనిపిస్తుంది. దీనితో పాటు మరో కొత్త పోలిక తెచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్నది కాస్ట్ వార్ కాదు.. క్లాస్ వార్ అని ప్రకటించారు.
పేదలకు, పెత్తందారులకు మద్య జరుగుతున్న యుద్దం అని ఆయన చెప్పారు. పేదలు ఒకవైపు ఉంటే, పెత్తందార్లు మరో వైపు ఉన్నారని జగన్ చెప్పడం ద్వారా పేదవర్గాలను మరింతగా ఆకట్టుకునే యత్నం చేశారు. తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటే, తన ప్రత్యర్దులు మోసాలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆయన అన్నారు.ఈ సందర్భంలో ముసలాయనకు దుష్టచతుష్టయం అండగా ఉందంటూ ఈనాడు, ఆంద్రజ్యోతి, టివీ5 లకు తోడు దత్తపుత్రుడు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
విద్య,వైద్య, వ్యవసాయం తదితర రంగాలలో తాను తీసుకు వచ్చిన మార్పులను గమనించాలని ఆయన కోరారు. మీ బిడ్డ అంటూ పలుమార్లు ప్రస్తావించి సభికులను ఆయన ఓన్ చేసుకోగలిగారు. తోడేళ్లు ఒకటవుతున్నాయని, తాను సింహంలా సింగిల్ గానే నడుస్తున్నానని జగన్ చెప్పడం ద్వారా వచ్చే ఎన్నికలలో జరగనున్న రాజకీయ పరిణామాలను ప్రజలకు తెలియచెప్పారు.
నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు, పేదలను నమ్ముకున్నానని ప్రకటించడం ద్వారా వారంతా తనవైపే ఉన్నారని చెప్పకనే చెప్పారు. టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి నారా లోకేష్ చేస్తున్న పాదయాత్రను ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని ప్రస్తావించకపోవడం విశేషం. లోకేష్ కు అనవసరమైన ప్రాధాన్యత ఇవ్వదలచుకోలేదని ఆయన చెప్పినట్లయింది. అదే సమయంలో లోకేష్ తాను ముఖ్యమంత్రి అభ్యర్దిని అని చెప్పలేకపోతున్నారు. తన తండ్రిని ముఖ్యమంత్రిని చేయడం కోసం పాదయాత్ర అని అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే ముసలాయన కోసం లోకేష్ పాదయాత్ర చేస్తున్నారన్న భావం స్ఫూర్తించేలా జగన్ మాట్లాడారనుకోవచ్చు. గతంలో చంద్రబాబు పాలనలో గజదొంగల్లా దోచేశారని, తన ప్రభుత్వ హయాంలో లంచాలకు తావులేని పాలన సాగుతోందని ఆయన చెప్పారు. తాను బటన్ నొక్కి ప్రజలకు సాయం చేస్తున్నానని, తద్వారా ఎక్కడా అవినీతికి తావుకు,లంచాలకు అవకాశం లేకుండా పోయిందని ఆయన స్పష్టం చేశారు. ఇది చాలా వరకు వాస్తవమే.
గతంలో జన్మభూమి కమిటీల ప్రమేయం లేకుండా ఏ కార్యక్రమం అమలు అయ్యేది కాదు. వారికి లంచాలు ఇచ్చుకోవల్సిన పరిస్థితి ఉండేది. కాని జగన్ అధికారంలోకి వచ్చాక పార్టీ చూడకుండా,ప్రాంతం, కులం, మతం ఏవీ చూడకుండా అర్హులైనవారందరికి సంక్షేమ ఫలాలు అందించడం ఆయనకి ప్లస్ పాయింట్ అయింది.రాష్ట్రం ప్రగతి పధంలో పయనిస్తోందని చెప్పడానికి కూడా ఆయన యత్నించారు.
అందుకు దేశంలోనే అగ్రస్థానంలో గ్రోత్ రేట్ ఉండడాన్ని ఆయన ఉదాహరించారు. రాష్ట్రం 11.43 శాతం వృద్ది రేటు సాధిఆంచిందని, ఇది దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆయన చెప్పారు. లోకేష్ కొద్ది రోజుల క్రితం కుప్పంలో పాల్గొన్న సభకు, వినుకొండలో జగన్ హాజరైన సభకు అసలు పొంతనే లేదంటే ఆశ్చర్యం కాదు.లోకేష్ సభలో జనం పాసివ్ స్పెక్టేటర్స్ మాదిరి అంటే కేవలం ఏదో మొక్కుబడిగా వచ్చిన ప్రేక్షకుల మాదిరి కూర్చుంటే, జగన్ సభలో పాజిటివ్ స్పెక్టేటర్స్ కనిపించారు. జగన్ వేదిక ఎక్కినప్పటి నుంచి, ఆయన దిగేవారు సభికులు పదే,పదే హర్షద్వానాలు చేయడం కనిపించింది.
జగన్ ప్రసంగిస్తున్నప్పుడైతే జనం కేరింతలు కొట్టడం ఆయన ఇమేజీ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రత్యేకించి కాస్ట్ వార్ కాదు.. క్లాస్ వార్ అని అన్నప్పుడు, పేదలకు,పెత్తందార్లకు మధ్య యుద్దం అన్నప్పుడు, తాను పొత్తులు లేకుండా సింహంలా సింగిల్ గా వస్తానని చెప్పినప్పుడు, అలాగే తోడేళ్లు కలుస్తున్నాయని అన్నప్పుడు జనం బాగా స్పందించారు. ఈ సభను బాగా గమనిస్తే తెలుగుదేశం వారికి ముచ్చెమటలు పట్టే విధంగానే జరిగిందని చెప్పడానికి ఎలాంటి సందేహం అవసరం లేదు.
:::హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్.
Comments
Please login to add a commentAdd a comment