అనంతపురం క్రైం: సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మార్గనిర్దేశంలో పోలీస్ శాఖ అద్భుతంగా పనిచేస్తూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలను సమర్థవంతంగా పరిరక్షిస్తుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. అనంతపురం పోలీసు శిక్షణ కళాశాలలో ట్రైనింగ్ పూర్తిచేసుకున్న 28 మంది ప్రొబేషనరీ డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్‌ను సోమవారం పీటీసీ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా హోం మంత్రి తానేటి వనిత, డీపీజీ రాజేంద్రనాథ్ రెడ్డి హాజరయ్యారు.
హోంమంత్రి మాట్లాడుతూ.. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా తొలిసారిగా రాష్ట్రంలో మహిళల భద్రత, రక్షణ కోసం సీఎం జగనన్న ‘దిశ’యాప్ తీసుకొచ్చి పోలీస్స్టేషన్లు, ప్రత్యేక కోర్టులు తీసుకొచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దిశ యాప్ ద్వారా 30,500 మంది మహిళలు సహాయం పొందారని చెప్పారు. పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పోలీసు శాఖలోకి నూతనంగా ప్రవేశిస్తున్న డీఎస్పీలు నిజాయితీగా, సమర్థవంతంగా, నిష్పక్షపాతంగా సేవలందించాలని సూచించారు.
డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ సైబర్ నేరాల నియంత్రణ, సోషల్ మీడియా పోకడలను నియంత్రించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. పోలీసులు ఒత్తిడికి లోనుకాకుండా బాధితులకు సకాలంలో సేవలందించేందుకు కృషి చేయాలన్నారు. అనంతపురం పీటీసీ ప్రిన్సిపాల్ వెంకట్రామిరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ గీతాదేవి, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల ఎస్పీలు కేకేఎన్ అన్బురాజన్, మాధవరెడ్డి, తాడిపత్రి బెటాలియన్ కమాండెంట్ గంగాధర్ రావు, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment