గ్రేడింగ్ చేస్తున్న నిమ్మకాయలు
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఈ ఏడాది ఉద్యాన పంటలు రైతు ఇంట సిరులు కురిపిస్తున్నాయి. జిల్లాలో ఉద్యాన పంటలుగా అత్యధిక విస్తీర్ణంలో నిమ్మ, బత్తాయి, బొప్పాయి, మిరప, మల్లె తదితర పంటలు సాగులో ఉన్నాయి. మెట్ట రైతుల బెట్ట తీరేలా దిగుబడులకు తోడు ధరలు సైతం ఆశా జనకంగా ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ దఫా రికార్డు స్థాయిలో రేటు దక్కుతోంది. కనీవినీ ఎరుగని స్థాయిలో నిమ్మ రేట్లు బాగా ఉండడంతో నిమ్మ రైతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఉద్యాన రైతుల ఇళ్లల్లో సిరులు దొర్లుతున్నాయి. నిమ్మతో పాటు మిరప, బత్తాయి, బొప్పాయి, మల్లె పంటల ధరలు ఈ ఏడాది ఆశాజనకంగా ఉన్నాయి. నిమ్మ ధరలు అయితే చరిత్రలో ఎన్నడూ పలకని విధంగా పసిడి ధరతో పోటీపడుతున్నాయి. నిమ్మ లూజు బస్తా కనిష్టంగా రూ.13 వేల నుంచి గరిష్టంగా రూ.15 వేల వరకు స్థానిక మార్కెట్‌లో పలుకుతోంది. కిలో రూ.150 నుంచి రూ.200 వరకూ ధర ఉంది. ముంబయి, బెంగళూరు మార్కెట్లలో సైతం నిమ్మ ధరలు ఆకాశాన్ని అంటాయి. అవే ధరలు మార్కెట్‌లో నిలకడగా ఉండడంతో నిమ్మ రైతుల ఆనందానికి అవధుల్లేవు.
ఎండలు ముదరడంతో..
ఎండలు ముదరడంతో నిమ్మ ధరలు వేగంగా పుంజుకున్నాయి. ఉమ్మడి జిల్లాలో పొదలకూరు, గూడూరు నిమ్మ మార్కెట్ల నుంచి దేశ రాజధాని ఢిల్లీ, ముంబయి, బెంగళూరుకు ఎగుమతి అవుతాయి. తాజాగా ఆయా మెట్రో సిటీల్లో «నిమ్మకాయలకు డిమాండ్ బాగా పెరిగింది. దీంతో మార్కెట్‌లో ఊపు వచ్చింది. కిలో ఆపిల్ కంటే కిలో నిమ్మధర అధికంగా ఉంది. తాజా సీజన్‌లో మహారాష్ట్రలోని బీజాపూర్, ఏపీలో రాజమండ్రి, ఏలూరు, తెనాలిలో దిగుబడి ఆశించిన మేరకు లేకపోవడం, రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో నిమ్మ కాపు బాగా ఉండడంతో మార్కెట్‌లో మంచి ధర లభిస్తోందని వ్యాపారులు వివరిస్తున్నారు.
బత్తాయి.. మిరప ధరలు జోష్
బత్తాయి, మిరప, మల్లెల ధరలు సైతం జోష్‌లో ఉన్నాయి. టన్ను బత్తాయిలు మేలైనవి రూ.60 వేలు పలుకుతుంటే.. కాయ నాణ్యతను బట్టి రూ.40 వేలకు తక్కువ లేకుండా ధర ఉంది. మిరపలో ఆకాష్ రకం కాయలు ధరలు బాగా ఉన్నాయి. బెంగళూరు బ్రీడ్ అయిన ఈ రకం నాలుగు రెట్లు అధికంగా కారం ఉంటుంది. దీంతో మెట్ట ప్రాంత రైతులు అధికంగా సాగు చేశారు. ప్రస్తుతం కిలో రూ.120 తక్కువ లేకుండా ధర పలుకుతోంది. ధరలు బాగా ఉండడంతో ఎకరానికి రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షలు లాభాలు దక్కుతున్నాయి. మల్లెపూలు మార్చి నుంచి దిగుబడి ప్రారంభమైంది. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో రూ.300 తగ్గడం లేదు. అక్టోబర్ వరకు దిగుబడి రానుంది.
ఉద్యాన పంటల ధరలు నిలకడగా ఉండడంతో రైతులు ఇంట సిరులు కురుస్తున్నాయి. జిల్లాలో సర్వేపల్లి, ఆత్మకూరు, కావలి, ఉదయగిరి, కోవూరు, కందుకూరు నియోజకవర్గాల్లో ఉద్యాన పంటలు సాగులో ఉన్నాయి. తిరుపతి జిల్లాలో కలిసిన గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో కూడా అధికంగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 50 వేల హెక్టార్లల్లో ఉద్యాన పంటలు సాగులో ఉండడం విశేషం. ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవడంతో ఉద్యాన పంట ఉత్పత్తులు నాణ్యతగా ఉన్నాయి. దీనికి తోడు మార్కెట్లో ధరలు కూడా బాగుండటం, ప్రభుత్వం ఉద్యాన రాయితీలు ప్రకటించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ ప్రోత్సాహం
జిల్లాలో ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక రాయితీలు ప్రకటించింది. ఆధునిక పద్ధతుల్లో సాగు చేసేందుకు అవసరమైన మెటీరియల్ రాయితీతో అందిస్తోంది. ప్రధానంగా మెట్ట ప్రాంతాల్లో నీటి కొరతను అధిగమించేందుకు బిందు సేద్యంతో పాటు మల్చింగ్ విధానం సాగుకు రైతులకు ప్రోత్సాహకాలు ఇస్తోంది. నేరుగా రైతుల ఖాతాల్లో ప్రోత్సాహక నగదు జమ చేస్తోంది. హెక్టారుకు రూ.16 వేల రాయితీ అందిస్తోంది.
బత్తాయి ధరలు బాగున్నాయి
ఈ ఏడాది బత్తాయి ధరలు అశాజనకంగా ఉన్నాయి. కొన్నేళ్లుగా ధరలు లేక రైతులు ఇబ్బంది పడ్డారు. గతేడాది వర్షాలు పుష్కలంగా కురిసి దిగుబడులు బాగా వచ్చాయి. గిట్టుబాటు ధరలు లభించాయి. ఈ ఏడాది మంచి వర్షాలు పడటంతో దిగుబడితో పాటు కాయ నాణ్యత కూడా చాలా బాగుంది. టన్ను ధర కాయ నాణ్యతను బట్టి రూ.45 వేల నుంచి రూ.60 వేలకు పైగా ధరలు పలుకుతున్నాయి. దివంగత వైఎస్సార్ హయాంలో బత్తాయి రైతు ఇంట ఆనందం కనిపించింది. ఇప్పుడు ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో బత్తాయి ధరలు గిట్టుబాటుగా ఉన్నాయి.
– సయ్యద్ గౌస్‌మొయిద్దీన్, బత్తాయి రైతు, దాసరి పల్లి, ఉదయగిరి మండంలం
Comments
Please login to add a commentAdd a comment