నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు
2014–19 మధ్య చేపట్టినకార్యక్రమాలను పునరుద్ధరణ
వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు వెల్లడి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నియోజకవర్గ స్థాయిలో పీపీపీ విధానంలో ఆస్పత్రులను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. ఆస్పత్రికి స్థలాన్ని ప్రభుత్వమే ఇస్తుందని తెలిపారు. ప్రభుత్వ, పీపీపీ ఆస్పత్రులను ఒకే గొడుగు కిందకు తెస్తామని చెప్పారు. వైద్య, ఆరోగ్య శాఖపై సోమవారం సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైద్య, ఆరోగ్య శాఖలో 2014–19 మధ్య అమలు చేసిన కార్యక్రమాలు, పథకాలను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ యాప్‌ను రూపొందించి హెల్త్ కార్డు ద్వారా ప్రైవేట్ ఆస్పత్రిలో చేరే వ్యక్తుల వివరాలు, అక్కడ రోగికి అందించే వైద్య సేవలు, పరికరాలు, మందుల వివరాలు కూడా ఉండాలన్నారు. దీని ద్వారా ఆస్పత్రి పనితీరు తెలుస్తుందన్నారు. మండలాల వారీగా కిడ్నీ బాధితుల వివరాలు సేకరించాలని, సమస్యకు కారణాలు, వ్యాధి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నీటిపై అధ్యయనం చేయాలని చెప్పారు. ఉద్దానంలో పూర్తిస్థాయి అధ్యయనంతోనే సమస్యను గుర్తించగలిగామన్నారు.
ఆసుపత్రులలో శిశువుల అపహరణ కేసులు అరికట్టాలని చెప్పారు. తల్లులకు మళ్లీ ఎన్టీఆర్ బేబీ కిట్స్ అందించాలన్నారు. సదరం నకిలీ ధ్రువపత్రాల జారీపై చర్యలు తీసుకోవాలన్నారు. ఏజెన్సీల్లో డోలీ మోతలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఏడాదికి రూ.10 వేల కోట్ల టర్నోవర్ అయ్యే మెడ్‌టెక్ జోన్ పట్ల గత పాలకులు నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, సీఎస్ నీరబ్‌కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
15 శాతం వృద్ధి రేటే లక్ష్యం
దేశంలోని టాప్–5 రాష్ట్రాలతో పోటీ పడేలా, 15 శాతం వృద్ధి రేటు సాధన లక్ష్యంగా నూతన పారిశ్రామిక విధానం ఉండాలని, ఇందులో నీతి ఆయోగ్ ఆలోచనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు చెప్పారు. నూతన పారిశ్రామికాభివృద్ధి విధానం 2024–29 ముసాయిదాను పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, అధికారులు సోమవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబుకు వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ నూతన పాలసీలో పిపిపి, పి–4 విధానాలను పొందుపర్చాలని చెప్పారు.
పరిశ్రమలకు అనుమతులు వేగంగా ఇవ్వాలన్నారు. ఈనెల 16న పారిశ్రామకవేత్తలతో సమావేశమవుతామని చెప్పారు. ఆ తర్వాత ఈనెల 23న మరోసారి సమావేశమై విధానంపై చర్చిద్దామని చెప్పారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి డా.ఎన్.యువరాజ్, సీఎం అదనపు కార్యదర్శి కార్తికేయ మిశ్రా, పరిశ్రమల శాఖ కమిషనర్ సీహెచ్ శ్రీధర్, ఏపీఐఐసీ ఎండీ అభిíÙక్త్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment